Sunday, June 14, 2020

Atharva-Seersha-Ganapati-Upanishat

Inroduction

When I searched online to read upanishats in Telugu, I could find almost all important ones except Ganapati-Atharva-Seersha-Upanishad. So I decided to translate into Telugu Swami Tejomayananda's (Chinmaya Mission) book in English. God has given me enough strength to do it in a short period of time. I am grateful to have received some education in Telugu by my school teachers like Sri. Raju master. I was able to put together what turns out to be a lose translation. The flow of thoughts is not precise but the translation is in my humble way. I wouldn't be able to write in any language the “baashyam” of any upanishat because I don't have the required training in Sanskrit. So I am content with reading upanishats in Telugu or English. Hope you find it useful to your spiritual quest. All mistakes are mine. Please contact me to correct it when you find mistakes and make it as good as possible.

Each slOka in Sanskrit has a translation followed by a description. I am unable to provide word to word translation at this time.

ఓం నమస్తే గణపతయే ,
త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి,
త్వమేవ కేవలం కర్తాసి ,
త్వమేవ కేవలం ధర్తాసి ,
త్వమేవ కేవలం హర్తాసి,
త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మసి ,
త్వం సాక్షాదాత్మాసి , నిత్యం

తాత్పర్యము :

ఓం గణపతికి సాష్టాంగ నమస్కారము. నీ సహజ గుణము ఓంకారము . తత్త్వమసి అను మహావాక్యానికి నీవే ప్రతిరూపం . నీ వల్లే లోకములన్నియు సృజింపబడినవి. నీవే లోకాలను పాలించి , వాటి లయమునకు కారకుడవు (నీవే సృష్టి, స్థితి, లయమునకు కారకుడవు ). నీవే బ్రహ్మన్. నీవే సర్వ వ్యాపకుడవు. నీవే ఎప్పటికీ ఉండే ఆత్మ స్వరూపుడవు

నమస్కారము చేయుట అనాదిగా వస్తున్న హిందువుల సాంప్రదాయము . రెండు చేతులు జోడించుట నమస్కారము . నమస్కారము ఇతరులను గౌరవించుటకు తార్కాణము. పాదములను చేతులతో తాకుట, రెండు చేతులు జోడించి వంగుట; తలిదండ్రుల , పెద్దల, గురువుల, దైవ విగ్రహముల పాదములను తాకుట కూడా నమస్కారము . అట్టి నమస్కారము చేయుట ఇతరులను గౌరవించుట, ఆరాధించుట మరియు శరణాగతి కొరకే . ఒకరియందలి భక్తి భావము చూపుటకు, ఆహ్లాదమును ప్రదర్శించుటకు , వారి ఉన్నత స్తాయిని సూచించుటకు, మరియు వారిని ఆరాధించుటకు వంగి నమస్కరించుట సంప్రదాయము . ఒక ద్వారపాలకుడు యాంత్రికముగా నమస్కారము చేయుట ఒక విధిగా తలచుటవలనే గాని నిజమైన భక్తి వలన గాదు . ఒక బాలుడు తలిదండ్రుల మాట ననుసరించి పెద్దవారికి సాష్టాంగ నమస్కారము చేయుట తరచూ చూచుచున్నాము . కాని ఒక్కొక్కప్పుడు తలిదండ్రులు తమ పిల్లలకు సంప్రదాయమని ఆదేశించి పెద్దలకు మరియు గురువులకు అయిష్టముగా సాష్టాంగనమస్కారముచేయించుట కూడా చూచుచున్నాము . నమస్కారము మన గుండె లోతులనుండి రావలెను గాని ఒకరి ప్రోద్భలము వలన కాదు .

గణపతి అంటే ఎవరు? హిందువులకు గణపతి అంటే ఒక ఏనుగు శిరస్సు గలిగి ఆబాలగోపాలము భారతదేశమంతటా కుల మత భేదములు లేక ఆరాధించే దైవస్వరూపమని తలచుట కద్దు . శైవులు, వైష్ణవులు, శక్తి ఆరాధకులు అను తేడా లేకుండా గణపతిని కొలిచెదరు. గణపతి పనులకు అడ్డు వచ్చే విఘ్నములను తొలగించే దేవునిగా ఒక పని ప్రారంభించే ముందు పూజింతురు .

సంస్కృతములో "గణ" మనగా లెక్కించుట (గణితము అనే పదమునకు కూడా మూలము). మనము లెక్కించి , విశ్లేషించి చేసే ప్రక్రియ ద్వారా చేయు గుంపును కూడా గణమందురు . శాస్త్రవేత్తలు ప్రపంచమును సహజ లేదా కృత్రిమ రసాయములగాను , స్తావర లేదా జంగముల గాను, గ్రహములు లేదా నక్షత్రములుగాను గుంపులుచేయుదురు . గణపతి వాటినన్నిటిని పాలించే దైవ శక్తి

ప్రపంచము పంచభూతముల వలన మరియు త్రిగుణముల వలన తయారుచేయ బడినది. పంచభూతములనగా భూమి, ఆకాశము, వాయువు, జలము మరియు అగ్ని . సత్త్వ, రజస్ , తామస ములను త్రిగుణములందురు . మన శరీరములు సప్త ధాతువులు (రస, రక్త , మాంస, మేద , అస్తి , మజ్జ , శుక్ర ) చే , ఐదు జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము ) చే , ఐదు కర్మేoద్రయములు (వాక్కు, పని [చేతులు] చే , పాద [కాళ్లు], ఉపస్తము [జననేంద్రియము], పాయు లేదా గుదము) చే, ఐదు శారీరిక పనులు (శ్వాస , జీర్ణము , రక్త ప్రసరణ , మల మూత్ర విసర్జన, నాడీ లేదా నరముల వ్యవస్థ) చే , నాలుగు మతి సంభందిత అవయవములు (బుద్ధి, చిత్తము, మనస్సు లేదా జ్ఞాపక శక్తి మరియు అహంకారము ) చే చేయబడినవి . గణపతి వీటన్నిటికీ మూలాధారము .

ఒక్కొక్క గుంపుకు ఒక నాయకుడు ఉండవచ్చును . ఇంద్రుడు స్వర్గానికి అధిపతి , ఒక రాష్ట్రపతి దేశానికి నాయకుడు లేదా ఒక మనిషి తక్కిన ప్రాణులన్నిటికన్నా ఉత్క్రుష్టుడు కావచ్చును . కానీ, గణపతి రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తి , అన్ని ప్రాణులకు అధిపతి . కాన గణపతి స్వభావము ఎట్టిది ?

గణపతి స్వభావము ఎట్టిదనగా "త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి " అని చెప్పవచ్చును . ప్రత్యక్షమనగా ఇంద్రియముల ద్వారా తెలిసికొన్నది . కాన అది అబద్దమని కొట్టి పారేయుటకు వీలు లేనిది . మనము మన ఉనికిని అబద్దమనలేముగదా . మనమెల్లప్పుడూ "అహం" అను స్థితిని గలవారము . అట్లే గణపతి ఎల్లప్పుడూ మన మనస్సుకు గోచరించే గొప్ప శక్తి స్వరూపుడు .

తత్త్వమసి అను మహావాక్యమును రెండు విధములుగా గ్రహింప వచ్చును: “తత్త్వం అసి" లేదా "తత్ త్వం అసి " గణపతి ఈ ప్రపంచమంతటికి సారము (తత్త్వం). ప్రతి అనుభవమునకు మూలము . క్రొత్తొక వింత అను నానుడి వలన భారతీయులు సంబారములు లేదా మసాలా ను భోజనములో కోరుదురు . అట్లే గణపతి ప్రపంచానికoతటకు మూలము. గణపతి లేకున్న లోకము నిస్సారము .

మహావాక్యములు వేదముల చివరనుండు ఉపనిషత్తుల సారము . "తత్ త్వం అసి " అను మహావాక్యమువలన మానవుడు పరిమితుడు కాని అతి ఉత్కృష్టమైన పరిపూర్ణుడుగా తలచవలెను . ఇది నమ్మశక్యము కాక పోవచ్చును . సదా చింతలవలయమునందు చిక్కుకొని , సంసార దుఃఖాదులను అనుభవించు మానవుడు పరిపూర్ణుడెట్లగును? మన మెంత విజ్ఞానమును సంపాదించినను , ఎంత ధనమును ఆర్జించినను , సమాజములో ఎంత అధికారమును పొందినను, మన మెన్నటికి పరిపూర్ణము గాలేము అని అనుమానము రావచ్చు . పరిపూర్ణమనగా ఒక గణిత సంఖ్య కాదు. ఒక అల, తుపానునందు పుట్టినను సముద్రము లేదా జలము కాలేదు. ఏలననగా అల సముద్రములో (జలములో) పుట్టి, సముద్రములో కలిసిపోయే ఆభాస . అది సామాన్యమైన సముద్రము యొక్క విశేషము . గణపతి పరిమితముకాని, సర్వము నందు వ్యాపించియున్న ఒక మహా చైతన్య శక్తి.

ఈ విధముగా పరిపూర్ణమైన గణపతి స్వభావమును చెప్పిన ఉపనిషత్తు ఇప్పుడు గణపతికి ప్రపంచమునకు గల సంబంధమును తెలుపుచున్నది.

గణపతి సృష్టి, స్థితి, లయ కారకుడు (కర్త , ధర్త , మరియు హర్త ). ప్రతి ప్రపంచ కార్యమునకు కారణము కలదు . మన ఉనికి మన తలిదండ్రుల ఉనికి మీద ఆధారపడినది . మనము దుకాణామూలలో చూచే పదార్థములను తయారు చేసే వ్యవస్థ కలదు . ఒక చిత్రమునకు చిత్రకారుడు గలడు . ఒక కర్మ చేయుటకు తగిన జ్ఞానము , శక్తి అవసరము

ఈ ప్రపంచమును మానవుడుగాని , దేశముగాని సృష్టించలేదు . ఈ విశాల ప్రపంచమును సృష్టించిన కర్తకు అపరిమితమైన జ్ఞానము, శక్తి ఉండవలెను . గణపతి ఒక పరిపూర్ణ దైవ స్వరూపుడై సృష్టిలో మనము చూసే జడములైన నక్షత్రముల మొదలుకొని, చైతన్యవంతమైన ప్రాణస్వరూపముల వరకు సృజించు శక్తిగలవాడు .

చాలామంది అనేక సృష్టి కార్యాలు చేస్తారు : పద్యాలు వ్రాయుట, యంత్రాలను తయారుచేయుట, ఇల్లు నిర్మించుట, దుస్తులు కుట్టుట, పిల్లలను కనుట మొదలైనవి. కాని అట్టి వస్తువులను కాపాడుకొనుట అతి దుర్లభము. గణపతి సృష్టి చేయుటకు గల శక్తిమంతుడే గాక దానిని కాపాడుటకు గల శక్తి గలవాడు . మనకు గల ౩౩ కోట్ల దేవతలకు నిర్దేశించిన పనులను చేయుటకు గల చాకచక్యానికి అతడే కారణము. గణపతి ఆధ్వర్యములోనే పర్యావరణము, అందలి ప్రాణులు వృద్ధినొందుచున్నారు

మనము తయారుచేయవలసిన వస్తువులను కాపాడుట ఎంత దుర్లభమో,వానిని లయము చేయుట పది రెట్లు దుర్లభము. మనకున్న వస్తువులను వదలి పెట్టి (దానము చేసి) మరల జీవితాన్ని ప్రారంభించుట మిక్కిలి కష్టము. కృష్ణ భగవానుడు తన కనులారా యదుకుల సంతతి ఒకరినొకరు సంహరించికొని పతనమగుట చూచి చూడనట్లుండెను . దీని సారాంశము పుట్టినది ప్రతి ఒక్కటి గతించుట తప్పదు.

సృష్టి చేయుట మరియు దాని స్థితి కాపాడుట ఎంత ముఖ్యమో లయ కార్యము కూడ అంతే ముఖ్యము . ఒకవేళ పుట్టిన వారు గిట్టక పోతే క్రొత్తగా పుట్టుకొచ్చిన వారికి తగిన వనరులు, స్థలము ఉండదు కదా. గణపతి ఇట్టి లయ కార్యమునకు తగిన శక్తి సామర్థ్యములు కలవాడు. మహా వీరుడైన భీష్ముడు కురుక్షేత్ర యుద్ధములో శ్రీ కృష్ణుడు ఒక్కడే తనకు మోక్షమునివ్వగలడని తెలిసికొన్న జ్ఞాని . కొందరు సహజముగా వచ్చే తుపానులు , దావాలము, భూకంపములు మొదలైనవి పరమాత్మ ప్రోద్భవమువలెననే జరుగుచున్నవని తలంచుదురు

హిందువులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులు సృష్టి, స్థితి , లయమునకు కారకులని నమ్మెదరు . కాని వారి శక్తి ఒక విశ్వానికే పరిమితము. నిజానికి కోట్లాను కోట్ల సృష్టి, స్థితి, లయములను పరమాత్మ ఒక్కడే చేయుచున్నాడు. ఖగోళ శాస్త్రజ్ఞులు క్రొత్త విశ్వాలను కనుగొనుట మనము వార్తలలో చదివిదెము . మిక్కిలి శక్తి గల పూర్ణ పురుషుడు మాత్రమే అట్టి సృష్టి, స్థితి, లయములను చేయు సామర్ధ్యము గలవాడు .

ఒక ప్రశ్న: పరమాత్మ సృష్టి కర్త అయితే, జగత్తు ఏమిటి?

ప్రతి సృష్టికి చేతనమైన కారణము మరియు ఉపాదాన కారణము ఉండవలెను . ఉదాహరణకు ఒక మట్టి కుండను కుమ్మరి మట్టిని ఉపయోగించి చేయును. అట్లే ఈ జగత్తుకు సచేతనమైన మరియు ఉపాదాన కారణములేమిటి ? పరమేశ్వరుడు సృష్టి, స్థితి, లయములు చేయగలుగువాడు కావున అతడే చేతనమైన కారణము .

సృష్టి ప్రారంభానికి ముందు పరిపూర్ణమైన జ్ఞానముoడెను. అదే బ్రహ్మము లేదా పరమేశ్వరుడు. కావున పరమేశ్వరుడే సృష్టికి చేతన మరియు ఉపాదాన కారణము. అతడు పంచ భూతములను , త్రిగుణములను తన నుండే మొదట సృష్టించెను . వాని నుండి జగత్తును సృష్టించెను . కావున జగములన్నియు పరమేశ్వరుని వ్యక్తీకరణములే . ఆది శంకరాచార్యులుచే ఈ జగత్తు అంతయూ పరిపూర్ణమైన జ్ఞానము మరియు చైతన్యము నుండి ఆవిర్భవించినది యని చెప్పబడినది

గణపతి సృష్టి, స్థితి , లయము చేయ గలిగిన చిచ్చక్తి . జగములు ఆయని వ్యక్తీకరణములు కూడా . ఇక మిగిలినది నేను అను భవము. నేనెవ్వరిని ?

ప్రత్యక్ష ప్రమాణము అన పంచేంద్రియాల ద్వారా గ్రహించగలిగినది . ఉదాహరణకు మనము చూచే వస్తువులు. దానికి వ్యతిరేకము పరోక్షము . ఉదాహరణకు ఎవరెస్ట్ పర్వతము చాలామందికి పరోక్షము . మరి నేను అను భావము ప్రత్యక్షమా లేక పరోక్షమా? మన ఉనికిని గ్రహించుటకు ఇతర సాధనములు (మనస్సు, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలు) అక్కరలేదు . నిజానికి వాని ఉనికి మన ఉనికి పై ఆధార పడియున్నది . నేను అన్న భావము లేకున్న నావరకు ప్రపంచమే లేదు. నేను అను భావము ఒక వస్తువు కాలేదు . దృక్కు - దృశ్యము -ద్రష్ట వేరు వేరు . నేను అను భావము "ఆత్మ " మీద కూడా ఆధారపడియున్నది . ఆత్మ శరీరము లోన లేక బయట ఉన్నదని చెప్పలేము. ఆత్మ సర్వాంతర్యామి . కాని మనము సాధారణముగా ఆత్మని శరీరము మేరకే పరిమితము చేస్తాము . ఉదాహరణకు "నీవు ఎక్కడ ఉన్నావు"? అని ప్రశ్నిస్తే, ఒకని సమాధానము శరీరము మీద ఆధారపడి యున్నది. నా శరీరము ఎక్కడున్నదో నేను అక్కడే ఉన్నాను. ఈ విధముగా గణపతి మన ఆత్మానుభవమునకు మూలమై యున్నాడు .

ఋతం వచ్మి , సత్యం వచ్మి

తాత్పర్యము :

నేను శాస్త్రము చెప్పిన రీతి సత్యమునే పలికెదను . నే చెప్పే సత్యము నా అనుభవపూర్వకము

ఋతమనగా శాస్త్రమునకు సంబంధించిన జ్ఞానము . మనము ఏదైనా విషయమును గురించి అధ్యయనము చేయ దలచిన శాస్త్ర గ్రంధాలు లేదా గురువు చెప్పిన విద్య ప్రమాణముగా తీసికొనెదము . గణపతి శాస్త్రము ప్రమాణముగా ఒక పరిపూర్ణ దైవము

ఒకడు శాస్త్ర ప్రమాణమును ఒప్పు కొనక పోతే మరెలా ? పూర్వము మన ఋషుల స్వీయానుభవమే సత్యమని గ్రహించిరి . వారు వివరించిన సత్యములు ఒక కల్పన లేదా పరోక్ష జ్ఞానము కాదు.

చూచుటకు, నమ్ముటకు గల అవినాభావ సంబంధము మనకు తెలిసినదే . కాని శాస్త్ర ప్రమాణము ప్రకారము దానిని గురువులు అంగీకరించరు . సత్యము సూక్ష్మము , గ్రహించుటకు అతి క్లిష్టమైనది , ఇంద్రియాలకు అంతు బట్టనిది, మరియు స్వానుభవములకు వ్యతిరేకముగా ఉండునది. అందు మూలమున శిష్యులు గురువు చెప్పిన మాటలు ఒక్కొక్కప్పుడు అసత్యములుగా తలంచెదరు. గురువుని నమ్మిన వారు శంకలు లేకుండా పరిపూర్ణమైన సత్యమును గ్రహించగలరు. ఇదే కొన్నాళ్ళకు స్వీయానుభవమునకు మార్గము చూపును.

అవ త్వం మాం ,
అవ వక్తారం ,
అవ శ్రోతారం ,
అవ దాతారం ,
అవ ధాతారం,
అవ నుచానం,
అవ శిష్యం ,
అవ పశ్చాత్తాత్ ,
అవ పురస్తాత్ ,
అవోత్తారాత్తాత్,
అవ దక్షిణాత్తాత్ ,
అవ చోధ్వత్తాత్ ,
అవ ధరాత్తాత్ ,
సర్వతో మాం పాహి పాహి సమన్తాత్

తాత్పర్యము :

నన్ను దయచేసి రక్షించుము . దయచేసి వక్తను , శ్రోతను , దాతను మరియు పోషకుని రక్షించుము . గురువుని, శిష్యుని రక్షించుము . నన్ను నాలుగు దిక్కులయందు (ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర) రక్షించుము . నన్ను మీదనా క్రిందనా రక్షించుము. నన్ను అన్ని దిక్కులయందు రక్షించుము .

గణపతీ ! నా ఆరోగ్యమును, శరీరమును రక్షించుము; నా మానసిక స్థితిని , మంచి భావములను , మేధా శక్తిని అనగా అప్రమత్తతో మరియు విచక్షనను , ఆధ్యాత్మికతను అనగా క్రమశిక్షణతో పరిపూర్ణ జ్ఞానమునకై ప్రయతించుటను, సర్వదా ప్రసాదించుము . ఓ దేవా ! నా కుటుంబమును, మిత్రులను, బంధువులను, ధనమును , ఆస్తిని రక్షించుము

ప్రతి ఒక్కరు అనేక రకములైన పాత్రలను పోషించుచున్నాము . గణపతీ ! నా పాత్రలను రక్షించుము . పరిపూర్ణ జ్ఞానము తెలిసికొనుటకై గురువుల అవసరము గలదు . వారిని కూడా రక్షించుము .

నూరులో ఒకడు ధైర్య వంతుడు; వెయ్యిలో ఒకడు పండితుడు ; వేలలో ఒకడు మంచి వక్త ; కానీ కోట్లలో నైనా ఒక దాత కానరాడు . ఇది నానుడి

పలుమంది ధైర్యముతో తమ తలంపులను బహిర్గతము చేయుదురు. కానీ వారి మాటలు వివేకమైనవి లేదా శాస్త్రపరమైనవని చెప్పలేము. మరి కొందరు గొప్ప జ్ఞానులైనప్పటికి వారి భావాలను చక్కగా వివరించలేక పోవుదురు . కొందరు మంచి వక్తలు అయినప్పటికీ ఇతరులకు బోధించుటకు తగరు. గొప్ప వక్తలను , జ్ఞానులను , భావ ప్రకరణలో ఆరితేరినవారలను , శంకలను తొలగింప శక్తి గలవారలను , స్పూర్తినిచ్చువారలను , ఓ దేవా రక్షింపుము

భారతదేశములో పలుచోట్ల ఒక కుటుంబ పెద్దనిగాని లేదా పరిపాలకుని గాని దాత అని కుటుంబ సభ్యులు లేదా ప్రజలు తలచెదరు . పరిపూర్ణమైన దాతలు కోటిలో ఒక్కరు. పెక్కు దాతలు తమకు అక్కరలేనివి దానము చేయుదురు. మరికొందరు ఫలాపేక్ష గలవారు. కొందరు కీర్తి ప్రతిష్టలకై దానములు చేయుదురు. మిగిలిన దాతలు యాంత్రికముగా పదవులకై ప్రాకులాడెదరు . ఎవ్వరో కొద్దిమంది మనసారా దానము చేయు ఉదార బుద్ధి గలవారు . ఓ గణపతీ , అట్టి దాతల ఉదారతను పెంపొందించి వారిని రక్షింపుము.

కొందరు దానము చేయుటకన్న దాతలకు సహాయము చేయుటకు ఇష్టపడెదరు . ఉదాహరణకు ఒక గురుకులము లోని కార్యకలాపములు అనేకము. వంటలు, పరిశుభ్రత, మొదలైన వాటికి సహాయము చేయుటకు దాతలు ముందుకు వచ్చెదరు . అట్టి వారలను కూడ గణపతి రక్షించు గాక .

మనలను వైదిక శాస్త్రములవైపు దారి మరలించుటకు తోడ్పడు గురువులను "అనూచాన" ఆనియందురు . వారు మనకు కర్మలు, ఉపాసనలు , జ్ఞానాన్వేషణ మొదలైన వైదిక ధర్మములను బోధింతురు . కొందరు సద్గురులు మనలకు మోక్ష మార్గము అనగా జన్మరాహిత్యము కలుగజేయనది బోధింతురు . ఓ గణపతీ అట్టి గురువులను, సద్గురులను రక్షింపుము

ఒక శిష్యుడు జ్ఞానమునకై గురువులను ఆశ్రయింతును . అతడు గురువు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధతో వినును . ఒక ప్రతిభగల శిష్యుడు గురువు మనస్సులోని మాటలను , అంతర్గతమును గ్రహించు మేధ కలిగియుండి గురువు చెప్పకనే సత్కర్మలు చేయుచుండును . ఒక మంచి శిష్యుడు ఈ విధముగా ప్రార్ధన చేయును: “దేవా నాకు ప్రత్యక్షము కమ్ము . నాకు సుజ్ఞానము కలుగజేయుము. గురువు చెప్పిన బోధ ఎన్నటికీ మరుపు రానీయకుము. రాత్రింబగళ్ళు శాస్త్రములు చదువుటకు తగిన శక్తిని ప్రసాదించుము . నేను సదా సత్యము పలుకు వానిగా తీర్చిదిద్దుము . నన్ను మరియు వక్తను రక్షించుము" ఓ గణపతీ , నన్ను ఒక మంచి శిష్యునిగా చేయుము; నా ఆధ్యాత్మికతను, భక్తిని , శ్రద్ధను పెంపొందించుము .

పై మంత్రములోని సారము ఏమనగా, గణపతియే ఆది గురువు , వక్త , దాత మరియు ధాత. దేవుడే సర్వమును ప్రసాదించువాడు . మనమంతా ఆయనముందు యాచకూలమే

ఒక కార్యక్రమమునక పలు రకముల విఘ్నములు రావచ్చును . ఒక దేశమునకు శత్రువుల బారినుండి రక్షించుకొనుటకు సైన్యము యుండునట్లే మన ఆధ్యాత్మికతకు అన్ని దిక్కుల నుండి రక్షణ అవసరము. ఈ విధమైన భావనతో ఋషి పై మంత్రమును చదివెను .

యజ్ఞ యాగాదులు చేయుటకు ముందు యజమాని "భూర్భువః సువరోమ్ ఇతి దిగ్భందః " అని ప్రార్ధించును . దాని అర్థమేమానగా అన్ని దిక్కులనుండి విఘ్నములు లేకుండా బంధన చేయుట. కావున గణపతిని అన్ని దిక్కులయందు, అన్ని వేళళ యందు రక్షించుటకు ప్రార్ధించడ మైనది .

త్వం వాఙ్మయస్త్o చిన్మయః ,
త్వమానందమయస్త్వం బ్రహ్మమయః ,
త్వం సచ్చిదానంద అద్వితీయోసి ,
త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి ,
త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి

తాత్పర్యము :

గణపతి వాక్కుకు, చైతన్యమునకు, ఆనందమునకు , పరిపూర్ణతకు ప్రతిరూపం; అద్వైత జ్ఞానమునకు నిలయం; సర్వ వ్యాప్తి యగు బ్రహ్మము; జ్ఞానమునకు, వివేచనకు ప్రతిమూర్తి

ప్రపంచమంతయు ఓంకారముచే సృష్టించబడినది . వాక్కు లేకున్న మనకు వేద వాఙ్మయము , ధర్మాధర్మ విచక్షణము, సత్యాసత్యములు, సుఖదుఃఖాలు తెలియక పోయెడివి.

ఒకప్పుడు ధ్రువుడు విష్ణువు ప్రత్యక్షముతో అవాక్కాయెను . విష్ణువు తన శంఖముతో ధ్రువుని చెంపని త్రాకగా ధ్రువుడు ఈ విధముగా విష్ణుమూర్తిని ప్రస్తుతించెను : “ఓ సకల శక్తిమంతా, నేను నీకు భక్తితో ప్రణామము చేయుచున్నాను ; నీవే నా ప్రాణమునకు కారకుడవు; నీ కరుణ నాయందు ప్రసరించి నాలో గుప్తమైన వాక్కును వెలికి తీసినది. అట్లే నా జ్ఞాన, కర్మ ఇంద్రియములు మెల్కొల్పబడినవి". ప్రఖ్యాత కవులు తమ రచనలకు భగవంతుని ప్రోద్భలమే కారణమని చెప్పెదరు . ఓ గణపతీ , మా వాక్కుకు అధినేతవై మా వాక్కును ఉత్తేజపరచి , మాచేత నీ మహిమలను స్తుతించుకొని సదా మాధుర్య వచనములను, సత్యమును పలికించుము

చైతన్య శక్తి సకల సృష్టి వ్యాపించి యున్నది. అది స్వయం ప్రకాశము, అన్ని జీవుల ప్రదీప్తికి కారణము . దానివలెనే మన మనస్సు, బుద్ధి, చిత్తము పనిచేయుచున్నవి. చైతన్యము లేకున్న ప్రాణము, జ్ఞానము లేవు. ఓ గణపతీ నీ చైతన్యమువలన మా ప్రాణము, జ్ఞానము పెంపొందింప బడినవి. మమ్ములను మంచి జ్ఞానులుగా, నీ కీర్తనము చేయువారలుగా తీర్చి దిద్దుము

భగవంతుడు ఆనందస్వరూపుడు . ప్రతిఒక్కరూ ఆనందమునే కోరుకొందురు . లేక దేని కొరకై జీవించుట? ఆనందములేని బ్రతుకు వ్యర్థము . ప్రమోద = ప్రియ (మునపటి స్మృతులు) + మోద (రాబోయే సంతోషము) మనునది ఆనందమునకు ప్రతీక. ప్రమోదము అన్ని రూపాలలో అనగా సామాన్య జీవితము నుండి ఉత్కృష్టమైన ఆనందానుభవము వరకు సూచించును. స్తావరజంగమములు సైతము మానవుల వలెనే సంతోషమును వ్యక్తము చేయును . వేలును చీకుతున్న చిన్న పిల్లవాడు; ఆకాశములో ఎగిరే పక్షులు; ధ్యానము చేయుచున్న యోగులు; వీరందరూ ఆనందమనే జలాశయము నుండి నీరు తోడుకొని ఆస్వాదించుచున్నారు. ఓ గణపతీ , మా బ్రహ్మానందమునకు , ఆహ్లాదమునకు కారణమైన నిన్ను పొందుగాక; మేము నీ దయతో ఇతరులకు ఆనందమును కలిగించి ధన్యుల మవుదుము గాక.

బ్రహ్మమనగా ఆది మధ్యాన్తము లేని పరిపూర్ణుడు (బృహత్వాత్ బ్రహ్మ). ఉనికి-చైతన్యము-ఆనందము. అపరిమితమైన శక్తి, జ్ఞానము, సుగుణములు గల మహోన్నత శక్తి . అవ్యక్తము ; బహు ప్రజ్ఞాశాలి ; అన్ని రూపులు; కావున ఓ గణపతీ మమ్ములను అపరిమిత జ్ఞానులుగా మార్చి నిన్ను నిరంతరము సేవించు కొనునట్లు చేయుము .

సత్-చిత్ లతో ప్రపంచము నడచుచున్నది . సత్ మార్పులేక సతతము ఒకే రీతిలో నుండునది . చైతన్యము స్వయంప్రకాశము. అది అన్ని అవస్తలలోనూ (జాగృత్ -స్వప్న -సుషుప్తి), సమాధి లోనూ ఉండునది . అది ఎరుక కలిగించి అన్ని అనుభవములను అందించునది . చిత్ స్వయంప్రకాశక చైతన్యము

పరిమితమైతే సంతోషము లేదు. ఏ ఆనందమైతే అపరిమితమై , సర్వ దేశ -కాలాలను వ్యాపించి యున్నదో అదియే పూర్ణ సంతోషము. అపరిమితమైన అఖండ ఆనందము సర్వ వ్యాపాకము. కావున మార్పు లేని సత్ స్వయంప్రకాశమైన చిత్ తో కలసి మనకు సంపూర్ణ ఆనందానుభవమును కలుగజేయును

ఉనికి లేని జీవి లేదు . రెండు పరిపూర్ణ పదార్థాలు లేవు . కావున దేవుడు ఒక్కడే. అతడు పరిపూర్ణుడై అన్నిటియందు గుప్తముగా ఉన్నాడు. జ్ఞాన , విజ్ఞానములకు బహు అర్థములు గలవు . జ్ఞానము చైతన్యము మరియు సామాన్యము . దాని అధ్యక్షతలో విశేషములైన విజ్ఞానము తెలియబడుచున్నది . జ్ఞానము శాస్త్రపఠనమువలన తెలియబడునది . విజ్ఞానము దాని అనుభవము . జ్ఞానము సిద్ధాంతపరమైనది . విజ్ఞానము దాని వ్యక్త రూపము. జ్ఞానము ఐహికము మరియు లౌకికము . విజ్ఞానము ఆధ్యాత్మికము . ఓ సర్వ శాస్త్ర పారంగతుడైన గణపతీ మాకు జ్ఞానమును మరియు వివేకమును ప్రసాదించుము

సర్వ జగదిదం త్వత్తో జాయతే ,
సర్వ జగదిదం త్వత్తస్తిష్టతి ,
సర్వ జగదిదం త్వయి లయమేష్యతి ,
సర్వ జగదిదం త్వయి ప్రత్యేతి ,
త్వం భూమిరాపో అనలో అనిలో నభః ,
త్వం చత్వారి వాక్పదాని

తాత్పర్యము :

సర్వ ప్రపంచమునకు సృష్టి కారకుడవు; దాని స్థితికి కారకుడవు ; నీలోనే సృష్టి లయమగునది ; ఈ సృష్టి అంతయు నీలో ప్రతిబింబిస్తున్నది ; నీవు భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశము; నీవు చతుర్విధ వాక్స్వరూపుడవు

ప్రపంచమనగా మన శరీరమునకు వెలుపల యున్నది అనునది మన సాధారణ అనభవము. కొందరి ప్రపంచానుభూతి వారి ఊరుకి, సమాజానికి, దేశానికి, భూమండలానికి పరిమితమైనది . కొందరు చంద్రుని, సూర్యుని, కోట్లాను నక్షత్ర మండలాలను ప్రపంచమని భావింతురు . మరి కొందరు అనేకమైన బ్రహ్మాండాలు పుట్టుట , లయమగుట ప్రపంచమని తలుతురు . కొందరి ప్రపంచానుభవము సంగీతము, సాహిత్యము, నిద్ర, మరియు కళలకే పరిమితము చేయుదురు . వేదాంతము ప్రపంచ మనగా అనుభవము వలన తెలిసికొనగలిగినది అని మనకు తెలిపెను . అది స్థూల వస్తువు కాని, లేక సూక్ష్మ ఆలోచనలు కాని, అవ్యక్త భావన కాని, భూత-వర్తమాన-భవిష్యత్ కాలాలకు అతీతము. కాన అవి అన్నియూ ప్రపంచ సంబంధితమే .

సాధారణముగా మన శరీరాలను, మనస్సు-బుద్ధి-చిత్తము లను ప్రపంచముగా భావించము. కానీ నిజానికి అవి అన్నియూ ప్రపంచములోని భాగములే . మన శారీరిక స్థితిగతులు "ఇది లేదా నేను" అనుభవించునని చెప్పెదము . మన శరీరమునుకు కలిగే సుఖ-దుఃఖాలు గూర్చి తెలుసుకొనే ద్రష్ట - దృశ్యము రెండూ జడమే . ప్రపంచము ఒకని ఆలోచనలు లేదా శరీరమునకు పరిమితము కాదు. అది స్థూలమైన విరాట్, సూక్ష్మమైన హిరణ్యగర్భ, అవ్యక్తమైన ప్రకృతి స్వరూపము. కావున అది మనము ఊహించుకొనునవి, చూసినవి, విన్నవి, తెలిసికొన్నవి, అనుభవించినవి, కలుపుకొని ప్రపంచముగా భాసిల్లుతున్నది .

జగత్తు = జ + గ + త్ : జ అనగా జాయతే లేదా పుట్టినది; గ అనగా గచ్ఛతి లేదా అదృశ్యమైనది ; త్ అనగా తిష్టతి ఏవ లేదా మధ్యలో ఉన్నది. అందువలన జగత్తు ఎక్కడినుంచి వచ్చినది, ఎక్కడ నిష్క్రమించుచున్నది మరియు దేనితో కలసిపోవుచున్నది అని ప్రశ్నించవచ్చు. ఉదాహరణకు మట్టి కుండలు మట్టిలో పుట్టి , మట్టిలోనే కలసిపోతాయి . కావున మట్టి, మట్టి కుండలకు ఉపాదాన కారణము. అట్లే జగత్తు ఉనికి-చైతన్యము-సత్యము అను త్రిపుటివల్ల తన కార్యకాలాపాలు సాగించుచున్నది . గణపతి అట్టి జగత్తుకు ఉపాదాన కారణము

ఎప్పుడైతే నిమిత్తము , ఉపాదానము అను రెండ కారణములూ ఒకటే అయితే అట్టి సృష్టి ఆభాస అనగా మాయా స్వరూపము. ఉదాహరణకు కల కంటున్నప్పుడు ఆ రెండు కారణములకు మూలము అచేతనమైన మనస్సు . కావున కల నిజము కాదు. తద్వారా తెలిసికొనిననది ఏమిటంటే గణపతి సృష్టి-స్థితి-లయ కార్యములను గావించుటే గాక ఉపాదాన కారణముగా భాసిల్లగల సమర్థత గలవాడు. కావున ప్రపంచమంతయూ గణపతి ఆభాస లేదా విభూతి

రూపము కారణము లేనిదే ప్రతిఫలించదు . ఉదాహరణకు ఎండ మావి ఎడారికి-నీలాకాశానికి మధ్యన గల కాంతి కిరణాల వల్ల కలుగు భ్రాంతి . అట్లే ప్రపంచము జ్ఞానమనే తెరపై ఆవిష్కరింపబడినది .

మాయ తనకు ఆధారమైన పదార్థమును ఏమీ చేయలేదు. ఉదాహరణకు ఒక త్రాడును చూచి పాము అని భ్రమ పడిన మాత్రాన, తాడు విష పూరిత మవ్వదు . ద్వంద్వములైన సుఖ-దుఃఖాలు , అంద-వికారములు, క్రొత్త-పాత మొదలైనవి జ్ఞానమును ఏమీ చేయలేవు . ఓ గణపతీ నీవు ప్రపంచమునకు మూలాధారుడవని ఎరుగుదు కాన నన్ను ఈ మాయనుండి తరించు మార్గమును చూపుము

స్థూల , సూక్ష్మ ప్రపంచమంతయూ పంచభూతాత్మకము మరియు సగుణాత్మకము . అనంత ఆకాశము , చల్లని గాలులు, మండే నిప్పు, గలగల పారే నదులు , ఎత్తైన పర్వతములు, సమస్తము పరమాత్మ స్వరూపములే. మానవుని మేధా శక్తి, చైతన్యముతో కూడిన శరీరము కూడా ఆ పరమాత్మ ప్రతిరూపాములే . శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునికి చేసిన ఉపదేశము: ఎక్కడైతే పరిపక్వత ఉన్నదో , ధర్మమున్నదో , సౌందర్యమున్నదో లేదా ప్రతిభ గలదో అవి అన్నియూ నా ప్రకాశములని తలంతుము . ఓ గణపతీ మమ్ములను ఈ ప్రపంచమును నీ విభూతిగా చూచు భాగ్యమును ప్రసాదించుము .

ప్రపంచము నామ రూపాత్మకము . నామము, అక్షరము, వాక్కు లేనిచో జ్ఞాన సముపార్జనకు వీలులేదు. ఒక పుష్పముయొక్క సౌందర్యము, మృదుత్వము , కమ్మదనము , సువాసన అక్షరములు లేక ఎట్లు వివరించెదము? పరమాత్మ సమస్త వాఙ్మయమునకు, చైతన్యమునకు మూలశక్తి . అతడే వాక్కునకు, వాక్కునుండి వెలువడే సాహిత్యమునకు కూడా ఆది దైవము . వాక్కుకు ముందు జ్ఞానము అవ్యక్తమై ఉండును. దానిని పర వాణి యందురు. దాని తరువాత మాట సంబంధిత ఆలోచన పుట్టును . దానిని పశ్యన్తి వాణి యందురు. మాట బయటకు వచ్చుటకు ముందు మన ఆలోచనల సమూహము స్పష్టముగా గోచరించును . దీనిని మధ్యమ వాణి యందురు. తద్వారా మాట మన స్వరపేటిక నుండి వెలువడి వైఖారి వాణిగా వినిపించును .

సాధారణముగా మౌన వ్రతము చేయు వారలు తమ వైఖారి వాణిని నియంత్రించు కొందురు. వారి మనస్సు అనేకమైన ఆలోచనలతో నిండియుండును .సాధనతో మనస్సు కూడా మౌనమవును . అనగా మధ్యమ మరియు పశ్యన్తి వాణి, పర వాణి యందు ప్రవిలాపమగును .

అక్షరముల ద్వారా వస్తువుల నామములు వచ్చును . అక్షరముల సమూహము వస్తువుల గుణము, విశేషణము , వృత్తి మొదలైనవి తెలుపును . ఉదాహరణకు : "ఒక ఎర్రని మందారము దేవుని పాదముల వద్ద పెట్టబడినది" అను వాక్యములో "మందారము" ఒక వస్తు నామము. అది ఎర్రని రంగు గలది అనగా దాని విశేషణము . దానిని దేవుని పాదము వద్ద పెట్ట బడెను అనగా దేవునికి పుష్పములతో పూజ చేయుదురనునది ఒక వృత్తి. ఆ పుష్పము దేవునికి సమర్పించుటవలన పవిత్రమైనది అనగా దాని సంబంధము . ఈ విధముగా ఒక మందార పుష్పము వివరించుటవలన అది విశేషమై తక్కిన పుష్పములకన్నా విలక్షణముగా చెప్పబడినది.

పరిపూర్ణుడైన గణపతి ఒక వస్తువు కానేకాడు . అట్లని విశేషము గాడు. ఆయనను స్తుతించుటకు పదములు చాలవు. . ఓ గణపతీ నీ నిజ స్వరూపామును గాంచి నిన్ను స్తుతించుటకు వలసిన అక్షర సమూహములు, వాక్కు ప్రసాదించుము .

త్వం గుణత్రయాతీతః ,
త్వం అవస్థాత్రయాతీతః,
త్వం దేహత్రయాతీతః ,
త్వం కాలత్రయాతీతః

తాత్పర్యము :

గణపతీ , నువ్వు గుణత్రయములకు(సత్వ, రజస్, తమస్ ) అతీతుడవు ; మూడు అవస్థలకు (జాగృత, స్వప్న, సుషుప్తి)అతీతుడవు; దేహత్రయమునకు (స్థూల, సూక్ష్మ, కారణ) అతీతుడవు; ముక్కాలములకు (వర్తమాన, భూత, భవిష్య) అతీతుడవు

జ్ఞానము సర్వ వ్యాపాకము. దానికి మూలము ఒక్కడైన పరమాత్మ . జగత్తంతా ఆయన విభూతి . ఉన్నదే పరమాత్మ. సృష్టి ఆయని మాయా విలాసము . పురుష సూక్తములో పరమాత్మ గురించి ఇట్లు వివరింప బడినది : పరమాత్మలో నాల్గవ వంతు మనము చూసే జగత్తు . మిగతా మూడు వంతులు అవ్యక్త రూపమై మెలగుచున్నది . అట్లని పరమాత్మ యందు విభాగములున్నవని తలంప రాదు . పరమాత్మ పూర్ణమైనవాడు .

అతీతమనగా మనకు గోచరమవ్వనిది కూడా కావచ్చు . ఉదాహరణకు మన కన్నులకు బుద్ధి, చిత్తము లేదా అహంకారము కనబడనివి. కావున అవి పరమాత్మ వలె నిగూఢమై ఉన్నవి .

దేవుని మాయా శక్తి సత్త్వ, రజస్, తమస్ అను మూడు విధములుగా చెప్పుదురు. మనము కారణములను తెలిసికొనుటకు సాధన చేయుదుము. మాయ అనునది పరమాత్మకున్న ఒక మహత్తర శక్తి. . అందువలన సృష్టి మాయ, త్రిగుణములు , పంచభూతములతో కలిసి ఏర్పడినది. సత్త్వ గుణము తెలివిని, స్వప్రకాశమును సూచించునది; రజస్సు రాజసము లేదా అహంకారమును సూచించును; తమస్సు సోమరితనమును , జడత్వమును సూచించును . శరీరము జడము. దానిని చైతన్యవంతము చేయునది ప్రాణ శక్తి. పైని శ్లోకములో గణపతిని త్రిగుణాతీతుడని చెప్పబడినది. కావున మనము మంచి గుణములకై ఆయనను ప్రార్థించిన మేలు కలుగును.

మనము ప్రతిదినము జాగృత్ , స్వప్న మరియు సుషుప్తి లను అనుభవించెదము . జాగృదావస్తాలో మనము శరీరము దాని ఇంద్రియములతోనూ ప్రపంచముతో లావా-దేవీ పెట్టుకొందుము. స్వప్నావస్తలో మన అచేతన మనస్సు చూపే దృశ్యాలను చూచెదము . కాని సుషుప్తిలో అచేతన మనస్సు ప్రభావము తగ్గి శరీరమును మైమరచి, ప్రపంచమును మరచి నిద్రించెదము . అ అవస్థలో నేను అను భావన కూడా ప్రవిలాపన మగును .

త్రిగుణములు ఈ మూడు అవస్థలతో ముడిబడి యున్నవి. సుషుప్తిలో తమో గుణము మనను ఆవరించును. స్వప్నావస్తాలో రజోగుణము పని చేయును. అప్పుడు అచేతన మనస్సు మేల్కొనియుండి మన మనోఫల్కములో మనము వేకువగా ఉన్నప్పటి అనుభవాలను చిత్రముగా చూపించును. వేకువలో ఉన్నప్పుడు సత్వ గుణము వలన మనకు బుద్ధి, జిజ్ఞాశ , ఆలోచనా క్రమము అనుభవమునకు వచ్చును .

గణపతి అవస్థాత్రయమునకు ఆవల నుండువాడు. ఆయన అన్ని అవస్థలయందు సాక్షిగా యుండికూడ అవి లేనట్లే యుండును . ఆయన వానిని అనుభవించుచు యున్నను వాని వలన నియంత్రింపబడడు . ఓ గణపతీ నీవు అన్ని అవస్థలయందుండి నా సర్వతోరక్షణను ప్రసాదించుము . నా అనుభవముల సాక్షిగా నన్ను వృద్ధినొందించుము

మనకు మూడు విధములైన శరీరములు కలవు: స్థూల, సూక్ష్మ, మరియు కారణ. స్థూల శరీరము పంచభూతాత్మకము (వాయువు, అగ్ని, ఆకాశము, జలము, భూమి). సూక్ష్మ శరీరము పంచకర్మలు (శ్వాస , జీర్ణము , రక్త ప్రసరణ , మల మూత్ర విసర్జన, నాడీ లేదా నరముల వ్యవస్థ), పంచ కర్మేoద్రియములు , పంచ జ్ఞానేoద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము లతో కూడుకొని యుండును. స్థూల, సూక్ష్మ శరీరములకావల యున్నది కారణ శరీరము. అది అజ్ఞానపూరితమై , అవ్యక్తమైన వాసనాలతో కోరికలను కల్పించి వాటిని తీర్చుకొను దిశను నిర్దేశించును. మనమందరము ఒక విధముగా అజ్ఞానులమే. కాని మన పూర్వ జన్మ వాసనల వలన మన ఆలోచనలు, కర్మలు విభక్తమై నుండును.

గణపతి ఆ మూడు శరీరముల ఆవల నుండువాడు . అట్లే ఆ మూడిటిని ధరించినవాడు కూడా. కానీ నిశ్శరీరుడై చలించువాడు . ఓ గణపతీ మమ్ములను ఈ మూడు శరీరములను అధిగమించు మార్గమును చూపి మాకు మంచి ఆలోచనలు ఇచ్చి , మాచే సుకర్మలు చేయించుము .

కాలము ఆలోచనాక్రమమును చూపునది . మన ఆలోచనలు మారినప్పుడల్లా కాలము గడుచుచున్నట్లు తెలిసికోబడును. ఒకే ఆలోచన ఉన్నప్పుడు సమయము తెలియదు. అట్లే సుషుప్తావస్తలో కాలము తెలియుటకు ఆస్కారము లేదు. ఆ అవస్థలో అజ్ఞాన వృత్తి అనగా నాకు ఏమీ తెలియదు లేదా నాకేమీ అనుభవమునకు రావట్లేదు అనిపిస్తుంది . అట్లే ఆలోచనలు లేని సమాధి స్థితిలో కాలము తెలియదు. ఒక భక్తుడు పారవశ్యము చెందినప్పుడు అనగా భావ సమాధిలో ఉన్నప్పుడు కూడా సమయము తెలియదు.

సమయము మన ఇష్టాయిష్టాలమీద ఆధారపడునది . మనము సంతోషముగా ఉన్నప్పుడు సమయము తెలియదు. దుఃఖపూరితమైనప్పుడు సమయము దుర్భరముగా అనిపించును.

కాలము వలన మనకు వర్తమాన-భూత-భవిష్యత్ తెలియుచున్నది. కాలము ఒక ప్రవాహము . అది భూతకాలమునుండి భవిష్యత్కాలమునకు , లేదా భవిష్యత్కాలమునుండి భూతకాలమునకు ప్రవహించునది . నిజానికి వర్తమానములో భూత-భవిష్యత్ కాలములు ఇమిడి ఉన్నవి. కావున మనకు తెలియబడు సారాంశము వర్తమాన కాలమే.

సమయము మన మానసిక పరిధిలోనికి వచ్చునది. అది మన ఆలోచనలలో నిక్షిప్తమై ఉండును. గణపతి మన ఆలోచనలకు సాక్షి. మన గత స్మృతులు , వర్తమాన ఆలోచనలు, భవిష్యత్కాల ఊహలు తెలిసికొనగలవాడు. ఆయన అన్ని కాలములకు అతీతుడు. ఆయన చిరస్మరణీయుడు .

త్వం మూలాధారస్థితోసి నిత్యం,
త్వం శక్తిత్రయాత్మకః,
త్వాం యోగినో ధ్యాయన్తి నిత్యం

తాత్పర్యము :

నువ్వు సదా మూలాధారుడవై యుందువు. నీవు మూడు విధములైన శక్తితో భాసిల్లుచున్నావు . నిన్ను యోగులు ఎల్లప్పుడూ ప్రార్ధన చేయుదురు .

దేవుడు సర్వాంతర్యామి అయివుండి ఒక శరీరమును కూడ ధరించి యుండును. ధారణ అనగా మనస్సును ఒక స్థానము - శరీరము లోపలైనా , వెలుపలైనా - యందు కేంద్రీకరించుట. హృదయస్థానమందు గానీ కనుబొమల మధ్య గాని మనస్సును లగ్నము చేయుట సులభ సాధ్యము. ఏల అనగా పరమాత్మ ఆ స్థానములందు యుండును .

యోగ శాస్త్రము నభ్యసించువారు పరమాత్మ శక్తిని వివరించుచు కుండలిని గూర్చి చెప్పెదరు. కుండలిని శక్తి వెన్నెముక క్రింద మూలాధార చక్రము యందు సర్పిలాకారములో యుండును. ధ్యానముతో కుండలిని శక్తిని యోగులు పై చక్రములైన స్వాధిష్టాన , మణిపూర , అనాహత , విశుద్ధ మరియు ఆజ్ఞ చక్రముల వైపు మళ్ళింతురు . ఈ ఆరు చక్రములు మలమూత్ర విసర్జనావయములు, బొడ్డు, హృదయము, మెడ, కనుబొమల మధ్య వద్ద వుండునవి . కుండలిని శక్తిని విడుదలచేసినపుడు మరికొన్ని శక్తులు తోడై శీర్ష మధ్యమున నున్న సహస్రార చక్రమును చేరును. ఈ విధమైన సాధనను ఒక యోగ గురువుద్వారా నేర్చుకొనవలెను. గణపతి మూలాధార చక్రము క్రింద యున్న కుండలిని యందు నిక్షిప్తమై యున్నాడు . అట్లే అన్ని చక్రములయందు వ్యాపించి ఉన్నాడు.ఓ గణపతీ , మాకు నీ శక్తిని ప్రసాదించి మా కుండలినిని మేల్కొలుపు భాగ్యము కలిగించు

పరమాత్మ అతి శక్తిమంతుడు . అన్ని శక్తులు పరమాత్మవే . పరమాత్మ సృష్టి , స్థితి, లయ కార్యాలకు అధ్యక్షుడు . సకల కర్మలు, వాని ఫలాలకు పరమాత్మయే కారకుడు. దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ పరమాత్మ క్రియలే . మూడు శక్తులు- ఇచ్ఛ, జ్ఞాన, క్రియ- పరమాత్మయే ధరించియున్నాడు . సర్వాంతర్యామి, సర్వ జ్ఞాన స్వరూపుడు అయిన పరమాత్మ మూడు శక్తులతో రంజిల్లుతున్నాడు .

భక్తులు గణపతిని పరిపరి విధాల ప్రార్ధించుదురు. కొందరు యోగులయి కుండలిని శక్తి ద్వారా ప్రార్ధింతురు . మరి కొందరు భక్తితో, సాకారముతో ఆయన గుణగణములను ప్రస్తుతించుచు పూజింతురు . జ్ఞానయోగులు ఆయనను పరిపూర్ణస్వరూపముగా తలచెదరు. పదవి కోరువారు ఆయనని వరములకొరకు పూజింతురు. జ్ఞానమును కోరువారు సర్వశాస్త్ర పారంగుతుడైన గణపతిని ప్రార్ధించుచున్నారు. ఓ గణపతీ మా మనస్సును నీయందు లగ్నము చేసిన మా కోరికలను తీర్చుము.

త్వం బ్రహ్మా త్వం ,
విష్ణుస్త్వం ,
రుద్రస్త్వం ,
ఇంద్రస్త్వం ,
అగ్నిస్త్వం ,
సూర్యస్త్వం ,
చంద్రమాస్త్వం,
బ్రహ్మ భూర్భువః స్వరోమ్

తాత్పర్యము :

బ్రహ్మ , విష్ణు, రుద్ర, ఇంద్ర, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు నీ ప్రతిరూపాలే . నువ్వు పరిపూర్ణుడువు . ముల్లోకాలయందు నీవే వ్యాప్తిచెంది యున్నావు.

ప్రతి జ్ఞానవంతమైన కర్మలో - అది సూక్ష్మ మైనను లేదా స్థూల మైనను- మూడు విషయాలు ఉండును : ఆధిదైవిక, ఆధిభౌతిక , ఆధ్యాత్మిక . దేనినైన ఇంద్రియముల వలన గ్రహించుట ఆధిభౌతికము. మనస్సు ద్వార గ్రహించునది ఆధ్యాత్మికం . మన ఇంద్రియాలు పనిచేయుటకు కావలసిన శక్తిని ప్రసాదించు అధిష్టాన దేవతలు ఆధిదైవికమనబడుదురు. ఈ మూడూ పరమాత్మ స్వరూపాములే. గణపతి ఆధిదైవికమని పై శ్లోకములో చెప్పబడుచున్నది.

సృష్టి ఉపాదాన కారణముతో మరియు చైతన్యముతో కూడుకున్నది. పరమాత్మ పూర్ణ స్వరూపుడై అన్ని జీవరాసులలోనూ ఇమిడి ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు మరియు రుద్రుడు సృష్టి, స్థితి, లయములకు కారకులు. ఇంద్రుడు మనను శక్తివంతము చేయు దేవత. అగ్ని మన వాక్కుకు మరియు కర్మేన్ద్రియములకు అధిష్ఠాన దేవత. వాయువు మన చర్మము మరియు తక్కిన జ్ఞానేంద్రియములకు అధష్ఠాన దేవత. సూర్యుడు మన బుద్ధికి మరియు చంద్రుడు మన మనస్సుకు అధిష్ఠాన దేవతలు.

శాస్త్రము పదునాల్గు లోకములున్నవని చెప్పును. అవి ఏడు ఊర్ధ్వ లోకాలు, క్రింద ఏడులోకాలుగా విభజింపబడినవి. భూ, భువ, స్వ , మహా, జన, తప మరియు సత్య అను ఏడు లోకాలు ఊర్ధ్వ లోకాలు. మనకు సాధారణముగా గోచరించునవి మూడు మాత్రమే: భూ అనగా భూలోకము, భువ అనగా ఆకాశము, మరియు స్వ అనగా స్వర్గ లోకము. పరమాత్మ ఈ సృష్టినంతయు వ్యాపించియున్న కారణమువలన ఊర్ధ్వ , అధో లోకాలుగా భాసిస్తున్నాడు .

గణపతి పరిపూర్ణ దేవతఅనగా బ్రహ్మన్ . భూ అనగా సృష్టించబడినదాని ఉనికి. భూ అనగా సత్ స్వరూపుడైన బ్రహ్మము. భువ అనగా భవ్యతి లేదా విరాజిల్లునది . భువ అనగా చైతన్యముతో కూడినది కూడా . కావున అది చిత్ స్వరూపము. స్వర్గ మనగా సంతోషమునిచ్చునది. స్వర్గము అనగా సుఖం గచ్ఛతి . అందుచేత బ్రహ్మం సదా సంతోషము నిచ్చునది. ఉనికి - చైతన్యము-ఆనందము అను మూడూ ఓంకారములో లయమవునవి .

“తత్త్వమసి" అను మహావాక్య అర్థమేమి ? తత్త్వమసి అనగా - త్వం ఆత్మాసి నిత్యం. అనగా గణపతి సర్వప్రకాశకుడై సర్వవ్యాపాకుడై నిత్యము పరమాత్మ స్వరూపుడై ఉండువాడు . ఇది "తత్త్వమసి" యందలి "త్వం" అను మాటకు అర్థము. ఈ ప్రపంచమంతయు గణపతి యందు చూడబడునది. సర్వం జగదిదం త్వాయి ప్రత్యేతి - అనగా గణపతి ప్రపంచమునకు మూలాధారము . ఇది “తత్త్వమసి” యందు ఇమిడియున్న "తత్" అను మాటకు అర్థము. తద్వారా సర్వప్రకాశక ఆత్మ అనగా సర్వాధిష్ఠాన బ్రహ్మ గణపతి రూపమై యున్నాడు . చివరకు మనము గణపతి కృప వలన పరిపూర్ణులమై - అహం బ్రహ్మాస్మి (నేను బ్రహ్మమై ఉన్నాను) అను మహావాక్యమునకు ప్రతీకలమై ఉన్నాము.

గణాదిo పూర్వం ఉచ్ఛార్య వర్ణాదీ స్తదనంతరం ;
అనుస్వారః ;
అర్ధేన్డు లసితం ;
తారేణ రుద్ధం ;
ఏతత్తవ మను స్వరూపం ;
గకారః పూర్వరూపం ;
ఆకారో మధ్యరూపం ;
అనుస్వారాశ్చాన్త్య రూపం ;
బిందురుట్టార రూపం;
నాదః సన్ధానం ;
సంహితా సంధిః

తాత్పర్యము :

మొదట “గణ” అను పద్యములో "గ" అను శబ్దము , దాని తరువాత "అ" అను అచ్చులలో మొదటి అక్షరము, దానికి అనుస్వరము "మ" అను శబ్దము ఓంకార ముతో మొదలబెట్టి పలికిన గణపతి అను శబ్ధార్థము వచ్చును . నీ భూలోక అవతారములో "గ" అను శబ్దము మొదటి రూపము, “అ" అను శబ్దము మధ్యమ రూపము, అనుస్వరము తరువాత రూపము, బిందు శబ్దము చివరి రూపము; “నాద" అను శబ్దము మధ్యలో మరియు "సంహిత సంధి" అయి ఉన్నది

కొందరు భక్తులు పరమాత్మ సగుణ స్వరూపమును ఆరాధింతురు. నీలాకాశము పరమాత్మ సర్వవ్యాపకమును సూచించునది. విష్ణువుయొక్క నాల్గు చేతులు పురుషార్థములను - ధర్మ, అర్థ, కామ, మోక్షములు- సూచించునవి. ఈ విధముగా పరమాత్మ సగుణ రూపమును ఋషులు దర్శించిరి .

పూర్వకాలములో ఋషులు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క బీజాక్షర సంపుటిని ఆపాదించిరి. ఎట్లయితే ఒక విత్తనములో చెట్టు యొక్క బీజము యుండునో, అట్లే ఒక్కొక్క బీజాక్షరములో ఒక్కొక్క దేవత రూపము ఇమిడి యున్నది. . ఉదాహరణకు గణపతి యొక్క బీజాక్షరము "గం". “గణ" అను శబ్దములోని మొదటి అక్షరము "గ్" ను అచ్చులలోని మొదటి అక్షరమైన "అ" తో కలిపిన "గ" అగును. “గ" మీద "మం" అనెడి అనుస్వరము జోడించిన "గమ్" అగును. దానిమీద అర్థచంద్రాకార బిందువును పెట్టిన "గం" అగును. “గం" అను బీజాక్షరమునకు ముందు "ఓం" కారము జోడించుట వలన "ఓం గం" అను శబ్దము పుట్టుచున్నది. ఓం = అ + ఉ + మ్ అను శబ్దములతో కూడినది. అట్లు బీజమంత్రమును ఉచ్చరించిన "మం" అనుస్వరము అనాహిత సంధి అయి తరువాత వచ్చు మంత్రముతో కలుపుచున్నది . ఇది గణపతి యొక్క భూలోక అవతారమని పై మంత్రముద్వారా ఋషి మనకు తెలుపుచున్నాడు .

సైషా గణేశ విద్యా; గణక ఋషి; నిచ్రుత్ గాయత్రీ చందహః ; గణపతిర్ దేవతా

తాత్పర్యము :

ఇది గణేశ విద్య ; ఈ మంత్రమునకు ఋషి గణకుడు. నిచ్రుత్ గాయత్రి ఈ మంత్రము యొక్క ఛందస్సు. ఈ మంత్రము యొక్క దేవత గణపతి

“ఓం గం" అను బీజాక్షరములు గణక అను ఋషికి సాక్షాత్కరించినవి. వైదిక మంత్రములు త్రిస్తుప్ , అనుస్తుప్ , గాయత్రి, పంక్తి , మహతి మరియు బృహతి మొదలగు ఛందస్సులలో కల్పించబడినవి. ఛందస్సును బట్టి ఊఛ్ఛారణ యుండును. ఈ మంత్రము నిచ్రుత్ గాయత్రి ఛందస్సుతో కల్పించబడినదని ఋషి మనకు తెలియజేయుచున్నాడు .

ఓం గం గణపతయే నమః

తాత్పర్యము :

ఇది బీజ మంత్రముతో గూడి గణపతికి అభివందనము చేయు మహామంత్రము .

ఈ ఉపనిషత్తు "ఓం నమస్తే గణపతయే " అనుచు ప్రారంభమైనది. పై మహామంత్రార్ధము కూడా అదియే. నమస్కరించుట శరణాగతికి తార్కాణము. “నేను నన్ను, నావి, యను వాటన్నిని వదలి శరణు వేడుచున్నాను" అని ఆ మంత్ర ఉద్దేశ్యము .

ఏక దంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి; తన్నో దంతిః ప్రచోదయాత్

తాత్పర్యము :

ఒకటే దంతమున్న, తొండము వక్రముగా నున్నగణపతిని ప్రార్ధించుచున్నాము

ఈ మంత్రము యొక్క ఛందస్సు గాయత్రి. గాయత్రి అనగా మనను దాటించునది (గాయంతం త్రాయతే ఇతి గాయత్రి ). అన్ని గాయత్రి మంత్రములలో "భూర్ భువః సువః తత్ సవితుర్ వారేణ్యం , భర్గో దేవస్య ధీమహి, ధియో యోన ప్రచోదయాత్" అను మంత్రము ముఖ్యముగా చెప్పబడినది. దేవతలకు బీజ మంత్రములు ఉండునట్లే , ఒక్కొక్క దేవతకు గాయత్రి మంత్రము కూడ ఉండును. ఉదాహరణకు: "తత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి" అను మంత్రమును శివ గాయత్రి అందురు.

ప్రతి గాయత్రి మంత్రములోనూ "విద్మహే, ధీమహి, తన్నహ్ ప్రచోదయాత్" అను పదములు తరచూ విందుము . అవి "నిన్ను తెలిసికొను విధముగా నిన్ను ప్రార్ధించుచున్నాము . మమ్ములను జ్ఞాన వంతులుగా చేయుము" అను ఉద్దేశ్యమును మంత్ర రూపములో క్రోడీకరింపబడినవి. ఈ పదముల మధ్యలో మనము మననము చేయు దేవత యొక్క మూడు నామములు చేర్చుట పరిపాటి. గణపతి గాయాత్రిలో : ఏక-దంత , వక్ర తుండ , దంతి అను మూడు నామములు ప్రయోగింపబడినవి. ఈ మూడు నామములు గణపతి యొక్క గజేంద్ర రూపమైన ముఖమును తెలియజేయుచున్నవి.

ఏక దంతః చతుర్హస్తం పాశమంకుశ ధారిణం;
రదం చ వరదం హస్తై బిభ్రాణం మూషక ధ్వజం ;
రక్త లంబోదరం శూర్పకర్ణకం రక్త వాససం ;
రక్త గంధా నులిప్తాంగం రక్త పుష్పైః సుపూజితం ;
భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ;
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరం ;;
ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః

తాత్పర్యము :

ఒక దంతము, నాలుగు చేతులు- ఒక చేతితో పాశము, రెండవ చేతితో అంకుశము , మూడవ చేతితో దంతము, నాల్గవ చేతితో అభయము - మూషిక ఛిహ్నముతో ధ్వజము,ఎర్రని రంగు గల శరీరము, పెద్ద పొట్ట గల, వికారమైన చెవులు, ఎర్రని బట్టలు ధరించి, శరీరమంతటా ఎర్ర చందనము పూసి, ఎర్రని పుష్పాలతో పూజింపబడి, ఎవడైతే భక్తులను దయతో చూచుచు , స్వయం ప్రకాశకుడై , సృష్టికి మూల కారణమై , తన స్వభావమును ఎప్పటికీ మార్చుకొనక, సృష్టికి ఆది యందుండి, ప్రకృతి - పురుషులకు అతీతుడై యున్నాడో అట్టి గణపతిని ధ్యానించు యోగి ఉత్తమ యోగిగా పరిగణింపబడును

ఏనుగుకు సాధారణముగా రెండు దంతములుండును . అవి ద్వైతమునకు తార్కాణము. గణపతి ఒకేదంతము కలిగి అద్వైతమును సూచించును. ఆయన అద్వైతభావము సర్వజీవ సమానత్వమునకు నిదర్శనము .

చేతులు కర్మేంద్రియములు. గణపతి నాల్గు చేతులు నాలుగు పురుషార్థ ములైన ధర్మ , అర్థ, కామ, మోక్ష ములను సూచించును. గణపతి ఆ నాల్గింటిని మనకు ప్రసాదించ గలిగిన సామర్థ్యము గలవాడు.

గణపతి పాపులను పాశముతో కట్టి బంధించగల శక్తి గలవాడు. అట్లే పాశముతో భక్తులను తనవైపు త్రిప్పుకొనగల సామర్థ్యము గలవాడు.

అంకుశముతో గణపతి తనను తాను నియంత్రించుకొనగలిగినవాడు. అట్లే ప్రపంచములోని అతి సూక్ష్మము నుండి స్థూలమువరకు యున్న పదార్థములను నియంత్రించ గల శక్తి గలవాడు. గణపతి తీపి (మోదక) పదార్థమును ఒక చేతితో పట్టుకొనును. ఆయన సర్వ విధముల సంతోషము (మోద) ఇవ్వ గల్గినవాడు. ఆధ్యాత్మిక లేదా లౌకిక అనుభవముల యందు ఆనందము కలుగ చేయగలవాడు.

గణపతి పక్షపాతము లేకుండా తనను ఆశ్రయించి శరణాగతి కోరినవారిని రక్షించును. వారికి కోరిన వరములివ్వగల సామర్ధ్యము గలవాడు. కాని ప్రతి వొక్కరు వారి వారి కర్మానుసారము , వారికి కావలసినంతమటుకు , వారి పుణ్యానుసారము లాభము పొందెదరు.

గణపతి దంతమును చేతితో పట్టుకొని యుండును. ఆ దంతము తోనే ఆయన వ్యాస మహర్షి ముందు కూర్చుని , ఆయన చెప్పినట్లు మహాభారత గ్రంధమును వ్రాసెను.

గణపతి ధ్వజము మూషికము కలిగి యుండును. ఆయన మూషిక వాహనుడని ప్రసిద్ధి.

గణపతి ఎర్రని గంధము, వస్త్రములు ధరించి యుండును. ఎరుపు రజో గుణమును సూచించును. అటులనే ఎరుపు ప్రేమకు కూడా సoకేతమే.

గణపతి పొట్ట చాలా పెద్దది. ఎందుకనగా ఆయన మంచి చెడులను ద్వంద్వాలును సమన్వయ పరుచు శక్తి కలవాడు. ఆయన సర్వ ప్రపంచమును తన కుక్షిలో ధరించ గల శక్తి కలవాడు.

ఆయన పెద్ద చెవులు సర్వ శబ్దములను గ్రహించును. ఆయన మంచి మాటలను విని లోకములను పాలించు సామర్థ్యము కలవాడు.

ఆయన భక్తులను కాపాడుచు , స్వప్రకాశకుడై దేదీప్యమానుడై సదా భాసిల్లుచుండును .

గణపతి సృష్టికి ఉపాదాన మరియు నిమిత్త కారణము. ఆయన కారణము లేని కారణము అనగా మూల కారణము.

గణపతి సృష్టి ఆదియందున్నవాడు . దానికి పూర్వమున్నవాడు. ఆయన సత్యమునకు, జగత్తుకు అతీతమైనవాడు. ఆయన తొండము ఏనుగు తొండమువలె అతి సూక్ష్మ మైనది లేక అతి స్థూల మైన వస్తువులను లేదా కార్యములను చేయ శక్తి గలది. ఆయన తొండము తిన్నగా ఉండదు. అది కుడి లేదా ఎడమ వైపు త్రిప్పి యుండును. ఎందుకనగా ఆయన భక్తుల యందు పక్షపాతి .

నమో వ్రాతపతయే ;
నమో గణపతయే ;
నమః ప్రమథపతయే ;
నమస్తేస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న నాశినే శివ సుతాయ వరద మూర్తయే నమః

తాత్పర్యము :

ఎవరైతే కష్టపడి పని చేయుదురో వారికి దైవమైన గణపతికి సాష్టాంగ నమస్కారము. అన్ని గణములకు అధిపతి యైన గణపతికి వందనము. శివుని భక్తులైన ప్రమథ లకు నాయకుడైన గణపతికి ప్రణామము. పెద్ద పొట్ట, ఏక దంతి, విఘ్నములను నాశనము చేయువాడు, సాక్షాత్ పరమ శివుని పుత్రుడు అయిన గణపతికి అభివందనము. కోరికలను తీర్చు గణపతికి నమస్కారము .

గణపతి విఘ్నములను కల్పించ గలడు, విఘ్నములను నిర్మూలించగలడు. కావున మనము ఒక కార్యమును తల పెట్టినపుడు గణపతి పూజ చేసెదము.

నిరాకార, అవ్యక్త రూపములో బ్రహ్మమై గణపతి తన తండ్రియైన శివుని వలె సర్వ వ్యాపకుడు . సగుణ రూపములో ఒక ప్రతిమకు పరిమితమై పూజింపబడుచు భక్తులను పాలించుచుండును.

ఫల శృతి

ఏతద్ అథర్వసీర్షం యోఅధీతే స బ్రహ్మ భూయాయ కల్పతే ;
స సర్వవిఘ్నైర్ న బాధ్యతే ;
స సర్వత్ర సుఖమేధతే ;
స పంచమహా పాతాత్ ప్రముచ్యతే

తాత్పర్యము :

ఎవరైతే ఈ అథర్వ శీర్ష ఉపనిషత్తును చదువుతారో వారికి "నేను పరిపూర్ణుడను" అను భావము ఉదయించును . వానిని విఘ్నములు బాధించవు . వానికి సర్వ వేళల , సర్వావస్థల యందు ఆనందము కలుగును . పంచ పాపములనుండి విముక్తుడు కాగలడు

జ్ఞానమే గొప్ప శక్తి . ఒక బలవంతునిని విఘ్నములు ఆపలేవు . వాని ఉత్సాహమును మరియు ప్రగతిని అరికట్టలేవు . ఒక్కొక్క ఓటమి ఒక్కొక్క మెట్టుగా అగుపించి గమ్యమును చేర్చును . ఈ ఉపనిషత్తు పఠనమువల్ల విఘ్నములు మనను బాధించవు.

ఇతరులపై ఆధారపడుట దుఖ కారణము . ఈ ఉపనిషత్తు చదివిన వారికి ఒకని ఆనందము తన మీదే ఆధారపడి యున్నదని, అది వేరొక జీవి నుండి పొందుటకు సాధ్యము కాదని తెలియబడును.

ఒక కర్మకు కర్త ఆ కర్మ ఫలమును అనుభవించి భోక్త అగును. ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎవ్వరూ ఉల్లంఘించలేరు. ఎవ్వడైతే తాను కర్తా, భోక్తా కాదని తలచునో వానికి మంచి లేదా చెడు కలుగదు.

పంచపాతకాలుఅనగా: హత్య, త్రాగుడు, బలాత్కారము, దొంగతనము, దుష్టులతో సాంగత్యము. ఈ ఉపనిషత్తు పఠనమువలన మనము సర్వ పాపములనుండి విముక్తులమగుదుము .

సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి ;
ప్రాతర్ధీయానో రాత్రికృతం పాపం నాశయతి ;
సాయం ప్రాతః ప్రయున్జానో పాపో ఆపాపో భవతి;
సర్వత్రా ధీయానో అపవిఘ్నౌ భవతి;
ధర్మార్థకామమోక్షం చ విందతి

తాత్పర్యము :

ఎవరైతే సాయంత్రము ఈ మంత్రములను చదువుదురో వారు రోజంతా చేసిన పాపములు హరించును. ఉదయము చదివిన రాత్రి చేసిన పాపములు పోవును. ఎవ్వరు ఉదయము, సాయంత్రము, ఉభయ వేళలా చదువునో వారికి పాపములు పూర్తిగా తొలగిపోవును. ఎవరైతే అన్నివేళలా చదివేదరో వారు విఘ్నములు లేక పురుషార్థకామమోక్షములను పొందుదురు.

పాపమనగానేమి?

ఏకర్మవలన మనకు దుఃఖము కల్గునో లేక మనము ఖండింప బడదుమో దానిని పాపమందురు. సత్యము, పరమాత్మ లేదా మంచి మార్గము నుండి తప్పి పోవు కర్మములను పాప మందురు. మొదటి తప్పు మన గురించి మనము తెలిసికొనలేకపోవుట. అజ్ఞానము వలన కోరికలు, వాని వలన కర్మలు చేయబడును. కోరికలకు అంతు లేదు. అంతులేని కోరికలను తీర్చుకొనుటకు మానవుడు చెడ్డ త్రోవన నడచి దుఃఖమును పొందును.

మరయితే పాపములు చేసి ఈ ఉపనిషత్తు ద్వారా వానిని ప్రక్షాళనము చేయవచ్చును కదా? మన పూర్వ కర్మలు ప్రారబ్ధ రూపములో ఫలించును కదా? వాటి సంగతేమిటి?

మనము తెలిసో తెలీయకో పాప కృత్యములు చేయుదుము. ఈ ఉపనిషత్తు లోని మంత్రములు మనము తెలియక చేసిన తప్పులను తుడిపివేయును. తెలిసి చేసిన తప్పులు పశ్చాత్తాపము తో గాని పోవు. దానికి ఈ ఉపనిషత్తు తోడయితే మరి తిరిగి తెలిసి చేయు పాపములు చేయకుండా సన్మార్గములో జీవనము సాగించుటకు వీలు కలుగును.

ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయం;
యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి

తాత్పర్యము :

ఈ అథర్వశీర్ష ఉపనిషత్తు అయోగ్యులకు యిచ్చుట లేదా బోధించుట చేయ రాదు . ఎవడైతే అట్లుకాక తప్పుగా బోధించినవానికి పాపము చుట్టుకొనును.

సహస్రావర్తనాద్యం యం కామమధీతే తం తమనేన సాధయేత్ ;
అనేన గణపతిమభిషిన్చతి స వాగ్మీ భవతి;
చతుర్త్యాo అనష్నాన్ జపతి స విధ్యావాన్ భవతి ;
ఇత్యధర్వణ వాక్యం ;
బ్రహ్మాధ్యావరణం విద్యాన్న బిభేతి కదాచనేతి ;
యో దూర్వాoకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి;
యో లజ్జైర్యజతి స యశోవాన్ భవతి;
స మేధావాన్ భవతి;
యో మోదక సహస్రేణ యజతి స వాంచితఫలమవాప్నోతి ;
యః సాజ్య సమిద్భిర్ యజతి స సర్వ లభతే స సర్వం లభతే ;
అష్టౌ బ్రాహ్మణాన్ సంయగ్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి;
సూర్య గ్రహే మహానధ్యాo ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా సిద్ధమంత్రో భవతి;
మహావిఘ్నాత్ ప్రముచ్యతే ;
మహాదోషాత్ ప్రముచ్యతే ;
మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే

తాత్పర్యము :

ఈ ఉపనిషత్తును వెయ్యి మార్లు చదివినవారికి సమస్త కోరికలు తీరును.

ఎవ్వరైతే ఈ ఉపనిషత్తును చదువుచు స్నానము చేయుచుండునో వారు గొప్ప వక్తలు కాగలరు

ఎవ్వరైతే ఈ ఉపనిషత్తు ను చదువుచు ప్రతి చతుర్థి దినము ఉపవాసముండిన గొప్ప జ్ఞానులు కాగలరు.

ప్రతిఒక్కరు బ్రహ్మము గూర్చి, దాని మాయను మరియు ఆవరణ శక్తిని గూర్చి తెలిసికొనవలెను. దానివలన ఎన్నటికీ భయము కలుగదు.

ఎవ్వడైతే గణపతిని ధర్భలతో (దూర్వాగడ్డి) పూజించునో కుబేరుడంత ధనవంతుడు కాగలడు

ఎవ్వడైతే ఎండిన ధాన్యముతో (పేలాలూ లేదా అటుకులు) గణపతిని పూజించునో అతడు మిక్కిలి పేరు ప్రఖ్యాతలు పొంది సర్వత్రా జయమును పొందును. అట్లే తెలివి తేటలు వృద్ధి నొందును.

ఎవ్వడైతే వెయ్యి మోదకములతో పూజించునో వాని వాంఛలు తీరును

ఎవ్వరైతే యజ్ఞము గావించి కలప మరియు నెయ్యి తో పూజించిన సర్వము వారి వసమగును

ఎవ్వడైతే ఎనిమిది తగిన మంచి వారలకు ఈ ఉపనిషత్తు యందు ప్రవీణులను చేయునో అతడు సూర్యుని వలె ప్రకాశించును

ఈ ఉపనిషత్తును సూర్యగ్రహణము నందు లేదా పవిత్ర నదీ జలముల వద్ద లేదా గణపతి విగ్రహము వద్ద చదివిన వారు ఈ మంత్రములలో చెప్పిన సకల జ్ఞానమును పొందుదురు. అట్టి వారు విఘ్నములు లేక , చెడ్డ ఆలోచనలులేక , పాపరహితులై యుండుదురు.