Sloka 13.2
శ్రీ భాగవానువాచ :
ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే ; ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః
శరీరము క్షేత్రము, అర్జునా . ఎవ్వరైతే తాము ఈ క్షేత్రము కామని తలంతురో వారే నిజముగా క్షేత్రమును తెలిసినవారు
కొన్నేళ్ళక్రితం నేను ఉత్తర దిక్కులో సిమ్లాకు రైలు మీద ప్రయాణం చేస్తున్నాను. ఒకప్పుడు సిమ్లా ఆంగ్లుల వేసవి రాజధాని . డిల్లీనుంచి బయలదేరిన కొన్ని ఘడియలు కాలేదేమో ప్రక్కన మాటలు వినబడ్డాయి. నా ప్రక్క కూర్చున్న వ్యక్తి గట్టిగా మాట్లాడుతున్నాడు. నేను అతనిని ఏమైనా అయిందని ప్రశ్నించేను. "కూరుక్షేత్రా! వచ్చే స్టేషను కూరుక్షేత్రా!!" అన్నాడు .
నాకు ఆయని ఉత్సాహం అర్థమయింది. కురువంశీయుల కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగిందని , ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన పురాణం పుట్టినదని ప్రతి చిన్నవానికి భారతదేశంలో తెలుసు. ఆ పురాణంలోని మూడు వేల సంవత్సరముల క్రింది జరిగిన యుద్ధంలో పాల్గొన్న పాత్రధారులు మన బంధువులవలె సుపరిచితులు. కానీ ఆ యుద్ధ కారణము ఇప్పటికీ క్రొత్తకాదు . అణ్వాశ్త్ర ముల యుగంలో ఇటువంటి యుద్ధ ఆవిష్కరణ నా ఊహకందినదే
నా చుట్టుప్రక్కల కూర్చున్నవాళ్ళందరూ రైలు దిగి ప్రశాంతంగా ఉన్న ఆ క్షేత్రంలో కొన్ని నిమిషాలు తిరిగేరు. వేల సంవత్సరాల క్రితం ఆ భూమి ప్రపంచ విలయంగా ఉండేది . ఆ వాతావరణం శంఖనాదాలతో, హాహాకారాలతో పద్దెనిమిది రోజులు నిండియున్నది . గొప్పవారైన వీరులు రాబందుల, చేపల, అర్థ చంద్రకారంగల వ్యూహాలు పన్ని విజయముకొరకు ఆ నేలపై అటునిటు తిరిగేరు. చివరికి వారంతా హతులైనారు.
"ఊహించుకో, భీష్ముడు , ద్రోణుడు తమ సేనలకాధిపత్యం ఇక్కడే వహించేరు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు సారథిగా రధంమీద పయనించేడు. మీరు నించున్న ప్రదేశంలో మనకు తెలిసినంత వరకు అర్జునుడు ధనుర్భాణములను ప్రక్కన పెట్టి కూర్చొని ఉండవచ్చు . శ్రీ కృష్ణుని గీతోపదేశం ఇక్కడే జరిగుండవచ్చు" అని నా తోటి ప్రయాణీకుడు సంభ్రమ ఆశ్చర్యములతో ప్రకటించేడు .
నేను అతని మాటలతో ఏకీభవించేను. అక్కడ జరిగిన యుద్ధం ఒక చారిత్రిక ఘటన మాత్రమే కాదని అర్థం చేసుకొన్నాను . గీత చెప్పే రణం మన శరీరాల్లోనూ , మనస్సులలోనూ జరిగేదే . త్యాగము-లోభము, వెలుగు-చీకటి, ప్రేమ-శతృత్వము , ఐక్యత-విరోధము మొదలగు ద్వంద్వాలు వాటిలో నిరంతరము చోటు చేసుకొన్నాయి. గీత ఆరంభవాక్యాలు "నాకు చెప్పు కూరుక్షేత్రంలో ఏమి జరుగుతున్నాదో. అది ధర్మ భూమి. కురువంశీయుల భూమి" మనకి కూడా వర్తిస్తాయి . గీతా సంభాషణ మన శరీర క్షేత్రంలో అన్ని కాలాల్లోనూ నిరంతరమూ జరుగుతున్నది.
ఇంకోవిధంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో శరీరమును క్షేత్రంతో పోల్చడం శరీరానికే పరిమితం కాదు . శరీరం మనందరూ అర్థంచేసికొనే మనుష్యుల ఆకారం. ఆంగ్లంలో చెప్పే "personality" అనగా వ్యక్తిత్వం కూడా కలుపుకోవాలి. అటువంటిదాన్ని రణరంగమనడం ఒక విధంగా అతిశయం. భౌతిక శరీరమునుండి - ఉదాహరణకు ఆరోగ్యం - మానసిక స్థితి వరకు మనలో జరిగే వ్యతిరేక శక్తుల రణం త్యాగం-లోభం మధ్యన జరిగేది.
ఇది మనలో జరిగే అంతర్యుద్ధం. అది బయటకు వ్యక్తీకరణమైతే భౌతిక యుద్ధం. ప్రపంచ శక్తులు తమ అణ్వాశ్త్రములతో ప్రపంచ విలయం పద్దెనిమిది రోజులలో కాక అన్ని నిమిషాలలో చేసెదమని బహిరంగంగా చెప్పుకుంటాయి . ఇదే మొదటి పావు కదపడం అంటే. వేళ్ళమీద లెక్కపెట్టలేని బహు దేశాలు క్రూరమైన అంతర్యుద్ధాలతో నిండి ఉన్నాయి. బెల్ఫాస్ట్ (Belfast) లో జరిగే యుద్ధం అమెరికా లోని డెట్రాయిట్ (Detroit) నగరంలో జరిగే మారణహోమంకన్నా కొంచెం క్రూరత్వం తక్కువని చదివేను. అదీ ఈ శాంతి సమయంలో ! అలాగే చాలా కుటుంబాల అంతర్గత యుద్ధాలు మానవ సంభందాలను , పనిచేసే ప్రదేశాలను, రాజకీయాలను, ఆనంద సమయాలను ప్రభావితం చేస్తాయి . వీని వల్ల మనలాంటి నిమిత్త మాత్రులైన కోట్ల ప్రజల ప్రపంచాన్ని మార్చగల ఆశయాలు, ఆశలు అతలాకుతలం అవుతాయి. అందుకే బయట ప్రపంచం ఎంత ప్రమాదకరంగా ఉన్నా, నిజమైన యుద్ధం మన అంతర్గతంలో జరుగుతోందని గీత చెప్తుంది. నిజమైన శాంతి పొందాలంటే ఈ అంతర్యుద్ధంలో విజేతలం కావాలి.
మనం మన మనశ్శరీరాలను యుద్ధ భూమిగా గాక ఇంకో విధంగా అర్థం చెప్పుకోవచ్చు.
భారతదేశానికి సంభందించిన ఒక కథ జ్ఞాపకం వస్తోంది. ఒక వ్యక్తిని తన వ్యాపాకమేమిటని అడిగేరు. తాను ఒక రైతు నని బదులు చెప్పేడు. "మీరు రైతు లాగ కనబడటం లేరు. మీకెంత పొలం ఉంది?" అని అడిగేరు. ఆయన జవాబు: "ఐదున్నర అడుగులు." గట్టిగా నవ్వి "ఐదున్నర అడుగులలో ఎంత పండించగలవు" అని అడిగేరు. "ఆ మట్టి ఎంతో సారవంతమైనది. నా శరీరమే పొలం . నా ఆలోచనలు, కర్మలు బీజాలు. చెడు, మంచి నా పంట."
గీత కూడా అటువంటి ధోరణిలోనే సాగుతుంది. శరీరము , వ్యక్తిత్వము, గీత దృష్టిలో, ఒక రైతు పొలం వంటివి . మనస్సనే మట్టిలో మన ఆశలు, భయాలు, కోపాలు మొదలుగువానిని విత్తనాలవలె నాటుతాము. కాలక్రమేణా వేళ్ళు మొలిచి అవి చెట్లవుతాయి. వానిలాగే మన అలవాట్లు , భావాలు, వ్యక్తిత్వము, ప్రపంచాన్ని చూచే దృక్పథము దృఢమవుతాయి. వాటి నుండి వచ్చే ఫలాలు మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా మార్చుతాయి. ఇదే కర్మంటే! ఈ మిగతా పుస్తకము దాని గురించే వ్రాయబడినది.
శ్రీకృష్ణుడు మన శరీరములు పొలం దున్నటం లాగ కావు అని అంటారు. . ఈ కోణంలోంచి చూస్తే సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరైనా నీవెవరని ప్రశ్నిస్తే మన శరీరాన్ని చూపిస్తాము. "నా పొడవు ఐదు అడుగుల ఐదు అంగుళాలు. నా బరువు అరవై కిలోలు. అంతగా జుట్టు లేదు." శ్రీకృష్నుడు అటువంటి సమాధానాన్ని అంగీకరించడు . "అవన్నీ నీవు కాదు. అవి నీ పొలం వంటివి. నీవే దానిని పండించే రైతు." ఇది నా శరీరాన్ని సరైన విధంగా చూసే జ్ఞానాన్ని కలిగిస్తుంది . ఇట్లాంటి దృక్పథం నా అవసరాలకు , సామర్థ్యానికి సరైనది. నేను తక్కిన వారల పొలం చూసి ఆనందిస్తాను. కానీ నా పొలమంటేనే నాకు మక్కువ. ఉంకొకని పొలంతో నేనేమి చేస్తాను. కాబట్టి నా దేహాన్ని సరైన విధంగా పోషిస్తాను. కానీ నేను దానికి మాత్రమే పరిమితమని భావించను .
నాకు స్టీవ్ అనబడే మిత్రుడు ఉండేవాడు . అతనికి తోటలు పెంచడంలో ప్రావీణ్యత ఉంది. ప్రతి సంవత్సరం వర్ష ఎండ కాలాల్లో తన పిల్లలను తన పెరట్లో ఉన్న తోటకి తీసుకు వెళ్తాడు . వాళ్ళ చేత తోట ఎలా ఉండాలో ఒక ఊహ కలిగిస్తాడు . నేను క్రిందటి మారు వెళ్ళినపుడు మొక్కలు చిందరవందరగా తోటమాలి వేసిన మొక్కలులా కాక ఉన్నాయి . కానీ ఆ తోట విశేషంగా ఉంది. ఎలాగంటే క్యారెట్ మొక్కలన్నీ ఒకచోట, బీట్రూటులన్నీ మరోచోట, ఇలాగ ఒక చిత్రలేఖనంలాగా ఉన్నాయి. శ్రావణ మాసంలో (ఆగష్టు) అది నేను పెరిగిన అడవి లాగ ఉంది. అక్కడ వెతకడం కష్టం. కానీ పిల్లలు ఎక్కడ టమోటాలు ఉన్నాయో , ఎక్కడ బీట్రూటులు ఉన్నాయో క్షణంలో చెప్పగలరు. అలాగే వారికి దాగుడు మూతల ఆట ఆడడం సులభతరం. పెద్దలెవరికి కనిపించకుండా పాదుల వెనుక దాక్కోవడానికి ఆ తోట వీలుగా ఉంది .
స్టీవ్ కు కూడా ఆ తోట గురించి బాగా తెలుసు. మట్టిని చూసి దానిలో ఏ రసాయనం లోపించిందో చెప్పగలడు . అతనికి ఎండ , ఉష్ణోగ్రత , నీరు , రసాయనాలు ఎలాగ ప్రదేశాన్ని బట్టి మారుతాయో చెప్పగలడు. అలాగే ఏ మొక్కలు ఎలాగ తక్కినవానిని ప్రభావితం చేస్తాయో తెలుసు. ఎండాకాలమంతా ఆయన పిల్లలతో వచ్చి నాకు తోటలో పండిన కాయలు, పళ్ళు ఇచ్చేవాడు.
స్టీవ్ తన శరీరమే తన తోట అనుకున్నాడాని అనుకోండి. నాకైతే అతనికి తన తోటలో ఎక్కడ ఏముందో తెలియదని అనిపిస్తుంది. అతన్ని తోటలో లాగ పనిముట్లతో మట్టిని పరిశీలించలేము. అందువల్ల ఆ మట్టిలో ఏమీ పెరగవు. అతను తన శరీరంలో మొక్కలు పాతడానికి అంగీకరించడు. ఎవరైనా తన మట్టిని విమర్శిస్తే అది తననే విమర్శించినట్టుగా అనుకొని తనను ప్రజలు అవమానం చేస్తున్నారని భావిస్తాడు. మరి పిల్లలు వేళ్ళతో తన శరీరాన్ని పొడిస్తే ఏమవుతుంది? మొత్తానికి ఆ తోట చెడుతుంది. అతను తన తోటను బయటకు వచ్చి ఒక వస్తువులా చూడలేడు. తోటకి ఏదైతే మంచిదో, ఏది చెడో చెప్పలేడు .
మనందరము ప్రతి దినమూ ఇటువంటి తప్పు చేస్తాము. మన శరీరాలే మన శ్వస్వరూపమని భావిస్తాము. మన మనస్సే మనమని తలుస్తాము. వాటి పరిణామాలు వినాశనానికి దారి తీస్తాయి. మన ఉపాధికే పరిమితమైనప్పుడు మన ఆనందం శరీరం ఇంద్రియాలతో ముడి పడి ఉంటుంది . దానివల్ల ఏళ్లు పెరుగుతున్నకొద్దీ మన జీవితం వ్యర్థమవుతుంది. మనం ఎక్కువగా తినవచ్చు, లేదా అనారోగ్యం కలిగించే ఆహారం తినవచ్చు. కేవలం జిహ్వ చాపల్యం గురించి తినవచ్చు త్రాగవచ్చు. పొగత్రాగడం , మద్యం సేవించడం మొదలైన చెడు అలవాట్ల వలన మన ఇంద్రియ చపలత్వానికి బానిసలైపోవచ్చు. సరైన వ్యాయామం లేక తమోగుణమే శ్రేష్టమని నమ్మవచ్చు. సమయమంతా శరీరం గూర్చి ఆలోచిస్తూ, మన చర్మ వర్ఛస్సుని పెంచుకోవడానికి రకరకాల రసాయినక ప్రయోగాలు చేస్తూ, కండలు పెంచడం వంటి కార్యల్లో వృధా చేయవచ్చు. మనము మన శరీరం అని భావించి మన రూపురేఖలే శాశ్వతమని తలచవచ్చు . వీటన్నిటివల్ల మనం మానసిక అభధ్రత పొందడం తప్పదు. శరీరం జరామరణాలుకు లోబడవలసిందే . మనం ఎప్పుడైతే ఉపాధి శాశ్వతమని భావిస్తామో, కాలుడి వెక్కిరింపుకు గురి అవుతాము.
ఇంకో విధంగా చెప్పాలంటే మన ఉనికి ఉపాధి-తోటవలె కాదని తెలియకపోతే దానిని ఎలా పండిస్తాము? మనకి నియంత్రణ శక్తి కొంచెమే. ఈ పై శ్లోకాని సందేశమదే. కానీ ఇంకా లోతుకు పోతే శరీరము , మనస్సు విడివిడిగా కాక ఒకే క్షేత్రానికి చెందినవి. నూతన వైద్య విధానంతో పోల్చితే మన ఆరోగ్యం మరియు ముసలితనం గూర్చిన వైదిక జ్ఞానం పురాతనమని తెలుస్తుంది.
పశ్చిమ శాస్త్రాల గత రెండు శతాబాల పురోగతిలో తెలిసికోవలసినది ఉపాధి రసాయనిక, జన్యు సంభంధమైన సమిష్టి. కనీసం ఆలోచనలైనా అభౌతిక మనుకుంటే అవి ఉపాధిలో పయనించే విద్యుత్ తరంగాలని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇది మానవ జన్మను కనిష్ట స్థితికి దించే దృక్పథం. తోటలో పంట తప్ప ఏమీలేదు. అనగా మట్టి, విత్తనం, వ్రేళ్ళు మొదలగునవి లేవు. ఏదోవిధంగా మనకు తెలియని రీతిలో మొక్కలు భూమి ఉపరితలంలో పెరిగి, మనకు పంట యాదృచ్ఛికంగా ఇస్తాయని తప్పుగా నమ్మాలి. మన భౌతిక శాస్త్ర జ్ఞానంతో ఏపిల్ (Apple) మొక్కలు యాంత్రికంగా ఎక్కువ శాతం ఏపిల్ పండ్లను ఇస్తాయి కానీ బత్తాయి పండ్లు ఇవ్వవని తలంచాలి.
శాస్త్రం క్రొత్త విషయాలు చెప్పడం ఒక విధంగా ఉపయోగకరమే. కానీ ఒక బోటనిస్ట్ (Botanist) సమ్మతించదు. ఆమె అనవచ్చు "ఏపిల్ పండ్లలో ఉన్న నల్లనివి విత్తనాలు. వాటిని సరియైన భూమిలో పాతి పెడితే మరిన్ని ఏపిల్ పండ్లు పండుతాయి." మనకు ఒకవేళ విత్తనాల గురించి తెలియకపోతే ఈ జ్ఞానం పనికొచ్చేదే. మనకు తోటల గురించి తెలిసింది చాలా తక్కువని అనిపిస్తుంది. ఇదేవిధంగా శరీరమును తోటతో పోల్చితే మనోశరీరాల సంభందం పండుకీ విత్తుకీ గల బంధం వంటిదని తెలుస్తుంది. మన ఆలోచనలు కోరికలు ఎలాగైతే భౌతిక వస్తువులుగా పరిణామం చెందుతాయో -- ఎలాగంటే ఒక రకమైన ఆలోచన మనను కర్మ చేయుటకు ప్రోద్భలం ఇస్తుందో - తెలిస్తే మనం జీవితం మీద పరిశోధన ప్రారంభ దశలో ఉన్నామని తెలుస్తుంది.
ప్రాచీన గుహాల్లో బ్రతికే మానవునికి పంట అంటే ఏమీ తెలియక పోవచ్చు. కానీ వానికి ఏపిల్ అంటే తెలుసు, వాటిని చెట్టు నుండి పొందుట తెలుసు. విత్తు-చెట్టుకున్న సంభందం తెలియకనే వాడు ఏపిల్ పండ్లను అనుభవిస్తాడు. ఏది ఏమైనా విత్తనం చెట్టు వేరు వేరు రూపాలు. వానికి మట్టికి, సూర్యునికి, వర్షానికి, రసాయనాలకి విత్తనంతోనూ , చెట్టుతోనూ ఉన్న అవినాభావ సంభందం తెలియదు. వాని చుట్టూ రకరకాలైన విత్తనాలు ఉన్నా వాటి విలువ తెలీక పట్టించుకోడు. ఏపిల్ విత్తనాలు కుండలో ఉన్నా, ఆవాలు నేలపై పడి ఉన్నా వానికి వాటిపై ఎటువంటి ఆలోచన రాదు.
ఎవరైతే మానవుడనగా శరీరం ఒక్కటే అనుకొంటారో వారు ప్రాచీన గుహల్లో బ్రతికిన వానికంటే వేరుగా లేరు. వాని ఆలోచనలు వాని ఆరోగ్యం, ఉపాధిని నడుపుతాయని గ్రహించడు. తనకు ఇష్టమొచ్చిన రీతిలో ఆలోచిస్తాడు. ఆలోచనలను పెట్టి పోషిస్తాడు. చివరకు, కొన్నేళ్ళ తరువాత, శరీరములోని భౌతిక మార్పులకు లోనవుతాడు. ఆ మార్పులు తన ఆలోచనలవలెనే అనగా విత్తుకి చెట్టుకీ సంబంధమలేదనే విధంగా ఉన్నాయని గ్రహింపడు.
బుద్ధుడు "మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి" అని చెప్పెను. అనగా భౌతికంగా కూడా. ఉదాహరణకు ఒక క్రోధముతో కూడిన వ్యక్తిని తీసికొందాం. వానికి ప్రతికూల పరిస్తితులు వస్తే అవి ఇతరులవలననే అని తలంచి వారిపై క్రోధాన్ని పెంచుకొంటాడు. దీనివల్ల ఎన్నో ప్రమాదాలు వస్తాయి. కానీ వాని ఆరోగ్యం గూర్చి ఆలోచిద్దాం. వాని ఆలోచనలు విత్తనాల వంటివి. వాడు వాటిని తన క్షేత్రంలో నాటి పెంపొందించి పెద్దచేస్తాడు. ఇదంతా మనశ్శనే క్షేత్రంలో తెలియకుండానే జరుగుతుంది. ఏదో ఒకనాడు ఆ క్రోధంతో కూడిన విత్తనాలు పరిపక్వానికి వస్తాయి. వాని ఆరోగ్యం దెబ్బ తింటుంది. కడుపునొప్పి, మదుమ్లేహం వంటి జబ్బులు వస్తాయి. ఇదంతా తన క్రోధం, దానిని పెంపొందించే ప్రతికూల పరిస్తితుల వల్ల ఆరోగ్యంపై ఆరోపితమయినవని వైద్య శాస్త్రం చెబుతుంది.
మనం నేర్చుకున్న తప్పుడు విషయాలను తుడిచి వేయవచ్చు. క్రోధంతో నిండిన తోట వంటి ఉపాధినందలి కలుపు మొక్కలని తీసి క్రొత్త విత్తనాలను పాతవచ్చు. కానీ అలా చేయకపోతే కొన్ని సంవత్సరాల పిదప అనారోగ్య బారిన పడతాము. భౌతికంగా మన శరీరం మనను రక్షించడానికి సదా ఉపకరిస్తుంది. అది అతిశయోక్తి కావచ్చు. కానీ మన శరీరానికి తెలిసినదదే. చేయగలిగింది వేరే లేదు. మన ఒత్తిడిని తగ్గించడానికి అది రాత్రింబవళ్ళు శ్రమిస్తుంది. ఒక విధంగా మన సరిహద్దు సైనికులలాగ మనని రక్షిస్తూ ఉంటుంది. అది అంతా మన ఆరోగ్యం మీద ఆరోపితమౌతుంది. గుండె పోటు, అజీర్తి, తల నొప్పి, చికాకు, మరియు తరచూ జలుబు, జ్వరం వంటివి కలుగుతాయి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా క్షీణింపజేస్తాయి. జన్యు సంభంద కారణాల వల్ల ఇవన్నీ ఎప్పుడోఒకప్పుడు చరమ దశకు చేరుస్తాయి. అప్పుడు కీళ్ల నొప్పులు, కేన్సరు వంటి తీవ్ర పరిస్తితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఏది ఏమైనప్పటికి వీటికి మూలకారణం క్రోధం. అదే సకల దుష్ఫలితాలకు మూలం.
ఆశ్చర్యంగా తన ఆరోగ్య పతనానికి క్రోధమని తెలిసికోలేడు. తన పరిస్తితులను క్రోధంతోనే ఇతరులపై ఆరోపిస్తాడు. జీవితం ఒక అన్యాయమైన దెబ్బ కొట్టిందంటాడు . క్షేత్రమంతా క్రోధంతో నిండిపోయి పాతుకుపోయి ఉంటుంది. ఈ విధంగా విచారించితే వాని ఆలోచనలే వాని పతనానికి కారణమని తెలుస్తోంది.
ఒక ఆహ్లాద విషయానికొస్తే, ఓర్పును చూడండి. ఎవ్వరైనప్పటికీ ఓర్పును పెంపొందించుకొనవచ్చు. ఓర్పు ఔషధం వంటిది. జీవితం క్రోధంతో కాక సహనంతో గడిపేవాడిని ఊహించుకోండి. వానికి ఒత్తిడి కలిగినప్పుడల్లా ఓర్పుతో, సహనంతో, అసంగత్వంతో , వైరాగ్యంతో పరిస్తితులను అర్థం చేసికొంటాడు. వానికి జీవితం ఆరోగ్యంతో , ఆహ్లాదంతో గడుస్తుంది. ఈ విధంగా స్వస్థత మంచి ఆలోచనలతో ప్రాప్తిస్తుంది.
మనం క్షేత్రంతో సంబంధం పెంచుకుంటూ పోతే మన హార్మోన్లు (harmones) మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. చాలామంది జ్యోతిష్యాన్ని (Astrology) నమ్మవచ్చు. ఇంకా ఎక్కువమంది హార్మోనాలజీని (Hormonology)నమ్ముతారు. "నేను అడ్రినలిన్ (Adrenaline) రాశిలో పుట్టేను" అని కొందరంటే, "నేను గోనాడ్స్ (Gonads) అనే రాశిలో తైమస్ (Thymus) పెరుగుతున్న ఘడియలో పుట్టేను" అని మరొకడు అంటాడు. ఎవరైతే తమ జీవితాల్ని హార్మోన్లతో ముడిపెడతారో వారు రసాయనాలతో శాసింపబడిన వారవుతారు. గీత దానిని వ్యతికేరించదు. జీవితం రసాయనాలతో ముడిపడితే, గీత వానిని రక్షింపలేదు. ఎవరైతే దానిని అధిగమించి ముందుకు వస్తారో ఆ నియంతపై గెలుస్తారు. మన శరీరంలోని రసాయనాలు మన మనస్సుకు బానిసలు గానీ దానికి రాజులు గారు.
ఇటువంటి గీతా జ్ఞానం వల్ల మన వ్యక్తిత్వం మారాలి. నాకు తరచూ వినబడే పదము అన్య జీవిత శైలి (Alternate life-style). "ఫ్యాషన్ (fashionable) బట్టలు వేసుకో , యాస మార్చు, మీసాన్ని పెంచు, మేకప్ (Make-up) వేసుకో, వాటి వల్ల నీ జీవన శైలి మార్చుకో" అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఎటువంటి లాభంలేదు. మనం జీవన శైలి మార్చుకోవాలంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. నీ బాల్య మిత్రుడు రాముడు తాను ఉపాధికే పరిమితమని ఎప్పుడు నమ్మడో వాడు రాముడు కాడు. కనీసం నీతో బాల్యాన్ని పంచుకొన్న రాముడు కాడు. మైస్టెర్ ఎక్హార్ట్ (Meister Eckhart) చెప్పినట్లు "ఇతను క్రొత్త వాడు. శాంతి సామ్రాజ్యానికి వారసుడు". దీనిలో భయపడవలసిన విషయమొకటుంది. అవధూతలు (Mystics) ఒక ముసలివాని మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు దివాలా తీసిన అహంకారం మరణానికి చిహ్నం మాత్రమే కాదు. అది నిజం. అహంకారం పోతుంది కానీ దానికది రుచికరం కాదు. అది బాధిస్తుంది. ఈ విధంగా మనం ఉత్కృష్టమైన ఆనందాన్ని పొందాలి. ఎందుకంటే మనం ఒక ప్రజ్వలించే నూతన వ్యక్తిత్వాన్ని పొందడానికి సిద్ధమయ్యేము.