Saturday, August 28, 2021

Bruhadaaranya Upanishat Telugu About Desire

స్వామి మాధవానంద ఆది శంకరుల భాష్యము ఆంగ్లములోకి అనువదించిన బృహదారణ్యక ఉపనిషత్తు ఆధారముగా ఈ క్రింది తెలుగు అనువాదము చేయబడినది

Go To English Version

ఆదిలో నేను అనే స్పురణ ఉండును. అంటే సాధారణమైన, అవివేకముతో కూడిన , శరీరముతో మమేకమైన పురుషుడు . వాని ఆత్మ అజ్ఞానముతో పేరుకుపోయి ఉండును. శరీరమును ఆత్మగా తలచును. తన ఆలోచనలు మరియు కర్మలు శరీరముపై ఆరోపింపబడునవి అని తలంచును .

అట్టి పురుషుడు భార్య కావలెనని కోరును. ఏల అనగా తాను ఒంటరినని భయపడి తోడును కాంక్షించును. అట్లే తాను మరణించిన పిదప ఒక స్త్రీ గర్భములో ప్రవేశించి మరల జన్మించవలెనని ఎరిగి సంతానమును కోరుకొనును.దానిని నెరవేర్చుకొనుటకై యజ్ఞయాగాదులు చేయ నిశ్చయించుకొనును. మరియు ఒక వైదిక కర్మ చేయవారు దంపతులై ఉండవలెను . పిదప అతడు ధనమును కోరును. ఎందుకనగా ధనము లేనిదే యజ్ఞయాగాదులు చేయుటకు వీలు కాదు . తదుపరి యజ్ఞయాగాదుల వలన స్వర్గము లేదా ఉన్నత లోకాల ప్రాప్తిని కాంక్షిoచును.

సాధారణముగా పురుషుడు కోరుకొను వస్తువులు : భార్య, సంతానము , ధనము మరియు వైదిక కర్మల ఆచారణము. కోరికలు తీర్చుకొనుటకు ఒక లక్ష్యము దానిని సాధించు మార్గము ఏర్పరచుకొని అజ్ఞాని కనబడు లేదా కనబడని దారులు త్రొక్కును.

కానీ నిజముగ పురుషుడు ఈవిధముగా చెప్పకనే స్వర్గలోక ప్రాప్తిని కాంక్షిoచును. ఎట్లనగా మనము ఒక పదార్థము భుజించిన అది ఆకలి తీర్చుకొనుటకే కాక సంతృప్తి పొందుటకు కూడా.

అట్టి పురుషుడు పట్టు పురుగువలె తనంతట తానే బంధములను ఏర్పరుచుకుని కర్మలను ఆచరించుచూ యుండును.

ఒక ప్రశ్న కలుగవచ్చు: కోరికలు లెక్కపెట్టలేనన్ని. వానిలో పురుషుడు ఏ కోర్కెలను కోరును? శృతి సమాధానము : పరిమితమైన కోర్కెలు మాత్రమే కోరి తృప్తి నొందవలెను. మరియు కోరికలను తీర్చికొనుటకు ఒక గమ్యముండ వలెను. ఆ లక్ష్యమును చేరుటకు ఒక ప్రణాళిక అవసరము. చివరకు మనుజుడు అందుబాటులో యున్న వస్తువులను కోరును. ఏలనగా గొంతెమ్మ కోరికలవలన నిరుత్సాహము తప్పదని తెలిసికొనును.

అట్టి పురుషుడు అజ్ఞానముతో కొట్టుమిట్టాడుచు ఉండును. అతడు వైదిక కర్మలు, వానినుండి పొందిన ఫలములే జీవితమని తలంచును . "అగ్నితో చేసే వైదిక కర్మలతో (యజ్ఞ యాగాదులతో) మమేకమై, పొగలో ఉక్కిరిబిక్కిరయి మనిషి తనయందు ఉండెడి ఆత్మను తెలియలేకున్నాడు" అని తైత్తరీయ ఉపనిషత్తు చెప్పి యున్నది.

ఇంతవరకు చెప్పిన వర్ణన ప్రజాపతికి కూడా వర్తించును . ఎవ్వడైతే ఉన్నదానితో సంతృప్తిపడడో వానికి ముప్పు తప్పదు . మొదట కాంత , తదుపరి కనకము , పిమ్మట సంతానము , ఆ తదుపరి యజ్ఞము , దాని వలన కలుగు స్వర్గ ప్రాప్తి అను 5 బంధనములను అజ్ఞానముతో పురుషుడు ఏర్పరచుకొని జీవనము సాగించును .

పురుషుడు కాంత, కనకము, సంతానము లేకున్న జీవితము వ్యర్థమని తలుచును. అవి లేకున్న ఏదో వెలితిగా తలచును. తాను ఒక అసంపూర్ణ జీవిగా భావించును. అట్టివానికి ఒక జంతువుకి తేడా లేదు.

ఆత్మజ్ఞానమును పొందుటకు ఇప్పటిరకు వర్ణించిన కోరికలు వానిని తీర్చుకొను సాధనములు (యజ్ఞయాగాదులు) విసర్జించవలెను.

జ్ఞాని అట్టి వానికి భిన్నముగా ఉండును. జ్ఞానికి మనస్సు అన్ని అవయవాలకన్న ముఖ్యమని తెలుసును. వాక్కు జ్ఞానికి భార్య. ఈ రెండింటి సహాయముతో, ముఖ్య ప్రాణముతో కర్మలను ఆచరించును . ఆ ముఖ్యప్రాణము జ్ఞానికి సంతానము వంటిది. కర్మలను ఆచరించు జ్ఞాని యొక్క కళ్ళు ధనము వంటివి . ఎందుకనగా కర్మలను ఆచరించువానికి కళ్ళు చాలా ముఖ్యము. మరియు సంపదనలను చూడవలెనన్న కళ్ళు అవసరము. జ్ఞాని తన చెవులను ధ్యానము ద్వారా పారమార్థమును తెలుసుకొనుటకై ఉపయోగించును.

మరి జ్ఞాని చేయు కర్మ మేమిటి? వాని శరీరమే. ఎందుకనగా శరీరముతోనే యజ్ఞయాగాదులు చేయుట సాధ్యము కనుక.

No comments:

Post a Comment