Bhagavat Gita
5.14
కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసా౦
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్
కామాక్రోధముల నుండి విడిపడిన వారును, మనసు స్వాధీనపడిన వారును, ఆత్మ జ్ఞానులును అగు యతి పురుషులకు బ్రహ్మజ్ఞానము సర్వత్ర కలదు.
ఈ శ్లోకంలో బ్రహ్మనిర్వాణ అనే పదం శ్రీకృష్ణుడు ప్రయోగించేడు. అంటే ఒక ఉత్కృష్టమైన లక్ష్యం. దాన్ని చేరాలంటే రెండు అడ్డంకులు ఉన్నాయి. ఒకటి స్వార్థం. దాని వల్ల ఒకడు లాభము, పేరుప్రఖ్యాతలు, ప్రతిష్ఠ కొరకై ప్రేరేపింపబడతాడు. బుద్ధుడు దీన్నే తన్హా -- అంటే తనది పొందటానికి ఇతరులతో అవసరమైతే కలహం పెట్టుకొని చేయడం-- అంటాడు. రెండవ ప్రతిబంధకం క్రోధం. ఎక్కడైతే వేర్పాటు, తానొక్కడే తృప్తి పొందాలనే భావన ఉంటుందో అక్కడ క్రోధం ఉన్నట్టే. కామము, క్రోధము కలసి వస్తాయి. మనమంతా స్వార్థ౦తో ఒక పెద్ద వస్తువు పొందాలని ప్రయత్నిస్తే, అది ప్రపంచంలో ఒకే ఒక వస్తువయితే, మన మధ్య స్పర్థలు కలగక మానవు.
అనేక విడిపోవడాలలో -- వ్యష్ఠి అయినా, సమిష్ఠి అయినా-- మన ఇష్టం, ఇతరుల ఇష్టం మధ్య, మన సౌభాగ్యం ఇతరుల సౌభాగ్యం మధ్య కలహం ఉంటుంది. సౌభాగ్యం, శాంతి విడదీయబడలేవు. నేతలు ప్రపంచ శాంతి ఎంతో అవసరమని చెప్తున్నారు. ప్రపంచం ఒక మూలలో యుద్ధం జరుగుతూ ఉంటే, మరో మూలలో శాంతి ఉన్నా లాభం లేదు. అలాగే ఒక దేశంలో సౌభాగ్య ముండి, వేరే దేశం దరిద్రంతో బాధ పడుతూ ఉంటే కూడా లాభం లేదు. ఎలాగంటే మన ఇంట్లో వంట గది నిప్పంటుకుంటే, దానిని ఆర్పకపోతే, అది ఇల్లంతా వ్యాపించి ఇల్లునే తగలబెడుతుంది.
కామాక్రోధాలను నియంత్రించాలంటే, మన ఇంటిలో కలసిమెలసి ఉండాలి. లేకపోతే ఇంట్లో యుద్ధ బీజాలు నాటబడతాయి. ఇంట్లోని వ్యక్తుల మధ్య కలహాలు, వేర్పాటు భావాలు ఉన్నాయంటే, ఆ ఇంట్లో ఒక చిన్న యుద్ధం జరుగుతున్నట్టే. అది ప్రపంచ యుద్ధమంత పెద్దది కాకపోయినా, అది యుద్ధమే.
యుద్ధ ప్రతిపాదిక మనస్సులో కలుగుతుంది. అది క్రమంగా మన హృదయాలలోనూ, ఇళ్లలోనూ, సమాజంలోనూ, చివరకు ప్రపంచమంతా వ్యాపిస్తుంది. గీత చేసే బోధ: యుద్ధం స్వార్థం-నిస్వార్థం, శుద్ధం-అశుద్ధం, ఆసురిక-దైవీక స్వభావాల మధ్య జరిగే పోరాటం. గీత చెప్పే యుద్ధం మన మనస్సులో, హృదయంలో జరిగే గందరగోళం. యుద్ధం రెండు వర్గాల మధ్య పోరాటం కాబట్టి మనకి ఆసురిక వర్గమైనా లేదా దైవిక వర్గమైనా ఎన్నిక చేసికోవచ్చు. అది దేశాకాలమానాలతో సంబంధం లేనిది. 331
No comments:
Post a Comment