Saturday, March 5, 2022

Eknath Gita Chapter 14 Sloka 6

13.6

తమస్త్వ జ్ఞానజం విద్ధి మోహనం సర్వ దేహినాం

ప్రమాదాలనిద్రాభిః తన్ని బధ్నాతి భారత

భారతా! అజ్ఞాన జనితమైన తమోగుణము సర్వ జీవులకు మోహనమును కలుగజేయుచు మఱపు, అలసత్వము, నిద్రలలో జీవుని బంధించివేయుచున్నది

ఇంతవరకు శ్రీకృష్ణుడు చెప్పిన ఉపోద్ఘాతము, "ప్రపంచంలో వింతైన పాత్రని చూస్తారు. అతడు చెప్పిన మాట వినడు, బద్దకస్తుడు, స్తిమితము లేని వాడు, కృతజ్ఞత లేనివాడు" అని టివిలో ప్రకటన చేసినట్టు.

శ్రీకృష్ణుడు తమస్ చిహ్నాలు వల్లిస్తున్నాడు. మొదటిది ప్రమాద: మనఃపూర్వకత లేక పోవుట. ఇది చాలా చెడ్డని అలవాటు. అట్టివారు ముందుకు సాగలేరు. వాళ్ళ దృష్టి సదా మారుతూ ఉంటుంది. మనఃపూర్వకత ఉన్నవాళ్ళు విజయాన్ని పొందుతారు అని యోగి పతంజలి చెప్పియున్నారు. అట్టివారు ఒక మంచి లక్ష్యాన్ని మనస్సులో పెట్టుకొని మనస్పూర్తిగా, దిక్కులు చూడకుండా, పని చేస్తారు. ఆధ్యాత్మిక గురువులు ఒకరిని శిష్యునిగా చేర్చు కోవలంటే కొన్ని సంవత్సరాలు వాని స్వభావమును, మనఃపూర్వకతను తెలిసికొనుటకై నిఘా వేసి వుంచుతారు. అలాకాక వచ్చిన ప్రతి వొక్కరినీ శిష్యునిగా తీసుకొంటే, వానికి మనఃపూర్వకత లేకపోతే, గురువు సమయం, శక్తి వృధా అవుతాయి.

రెండవది ఆలస్య అనగా బద్దకం. అది నిరుత్సాహం, జడత్వం మొదలైనవాటితో కూడియున్నది. ఒకడు తన జడత్వం వలన నడుస్తున్నా, సంసిద్ధతతో యుండడు. మనస్సు గడిచిన కాలం గూర్చి, భవిష్యత్తులో ఏమి జరబోతుందని సదా ఆలోచిస్తూ ఉంటుంది. శరీరము మాంద్యముతో కూడి ఉంటుంది. అడుగులు నెమ్మదిగా పడతాయి. తల క్రిందకు వంచబడి ఉంటుంది. కూర్చున్నప్పుడు వెన్నెముక వంగియుంటుంది. దానివలన ధ్యానం సరిగా చేయలేడు.

చివరది నిద్ర. అది శరీరానికి కావలసినంత కాదు. దాన్నే అతినిద్ర అంటారు. ప్రపంచ విషయాలనుండి తప్పించుకోవడానికి తామసికుడు నిద్రలోకి ప్రవేశిస్తాడు. అతి కష్టంతో కళ్ళు తెరిచి ఉంటాడు. వాడు సినిమా చూస్తున్నా, ఒక సమావేశం జరుగుతున్నా, చివరకు భోజనం చేస్తున్నా ఎక్కడైనా నిద్రను కాంక్షిస్తాడు. వాడికి ఒక సమస్య వేధించినా, ఒక పని చేయలేకపోయినా బద్దకంతో, ఆవులింతలు చేసి, చంచల మైన మనస్సుతో నిద్రకు ఉపక్రమిస్తాడు.

ఈ బద్దకం విద్యాలయాల్లో కూడా ఉంది. ఎవ్వరో అన్నారు ప్రొఫెసర్ అనగా అవతలి వారి నిద్రలో మాట్లాడేవాడు. నా విద్యార్థి ఒకడు ఎప్పుడూ మొదటి పంక్తిలో కూర్చొనేవాడు. నేను ఎంతో కష్టపడి సాహిత్యం గురించి చెప్తూ ఉంటే, వాడు నెమ్మదిగా నిద్రలోకి జారుకునేవాడు. నిద్రలో తూగుతూ, మెడ ఛాతీకి తగులుతూ ఉండేదా దృశ్యం. వాడిని ఒకసారి ఏమి కనపడుతున్నాదని అడిగేను. "మీరు కొంతసేపు దయ్యంలా కనిపిస్తారు. ఆ తరువాత మీరు ఆవిరి ఐపోతారు. చివరకు మీరు మాయమవుతారు".

ఎప్పుడైతే క్లిష్టమైన మానసిక సమస్యలతో వేధింపబడతారో అప్పుడు నిద్ర రాదు. కానీ అచేతన మనస్సుది పైచేయి అయివుంటుంది. ఎంత మేల్కొని ఉందామని ప్రయత్నించినా సాధ్యము కాదు. అది ఆఫీసు లోనే కావచ్చు, కొంతమంది సన్నిధిలోనైనా, లేదా వాహనం నడుపుతున్నా అలా అవ్వవచ్చు. ఆ సమయాల్లో ఎంత ప్రయత్నించినా అచేతన మనస్సును స్వాధీనం చేసికోలేరు. పిడికిలి బిగించినా, తల తిన్నగా పెట్టినా అది పనిచేయదు. ఇవన్నీ భౌతికమైన చర్యలు. కాని అది నిజంగా అభౌతికము. అందుకే ఒక మంత్ర౦ సహాయం కావాలి. ఒక పవిత్రమైన -- సెయింట్ బెర్నార్డ్ చెప్పినట్లు "శక్తినిచ్చే పదం"--నామం తలుచుకొంటూ దానితో పోరు చేయాలి.

తామసుని మంత్రం: "నాకు లెక్క లేదు. నేను తక్కినవారికి ఏమైనా పట్టించుకోనవసరంలేదు. నాకేమైనా కూడా ఫరవాలేదు." ఈ రోజుల్లో చాలా మందికి ఇటువంటి భావన ఉంది. గీత దృష్టిలో అట్టివారు జీవచ్చవాలు. వారు రాతితో చేయబడిన విగ్రహాల్లా౦టివారు. ఒక రాయి అనుకొంటుంది: "నేను ఇక్కడనుంచి కదలను. ఇక్కడ మంటలొచ్చినా పరిగెత్తను. మంటలు రానీ. నన్ను మండించినా సరే కదలను." ఈ విధంగా పట్టించకోపోవడం తామసుని సహజ నైజం. ఎంతమంది పొంచి యున్న ప్రమాదాలను పట్టించుకుంటున్నారు? యుద్ధాలు, హింస, ఆకలితో అలమటించు పేదలు, తునాతునకలైన కుటుంబ వ్యవస్థ, విషంగా మారిన పర్యావరణం, వీటి గురించి ఎవరు స్పందిస్తున్నారు? ఇవి మనలనందరినీ మంటల్లాగా ఆవరిస్తాయి. దినపత్రికలు వీటి గురించి చెప్పినా ఎవరూ పట్టించు కోవటంలేదు.

మానసిక, సాంఘిక శాస్త్రజ్ఞులు ఎవరిలోనూ ఈ సమస్యలను నిర్మూలంచడానికి ప్రేరేపణ లేదని చెప్తున్నారు. ప్రేరణ లేకపోవడం తామసిక లక్షణం. తామసికుడు భయానికి స్పందిస్తాడు. ఒకే గాడిలో ఉండడం వాని స్వభావం. చాలా మందికి ఒకే గాడిలో ఉండడం ఇష్టం. ఎందుకంటే దాని వల్ల జీవితం ప్రపంచాన్ని చూడకుండానే గడిపేయవచ్చు. ఒకరి గాడి మరొకరి గాడిని తగలదు. స్త్రీ, పురుషులు ఒకే ఇంట్లో కలసి వుండవచ్చు, భోజన సమయంలో ఉదయం, సాయంత్రం ఒకరినొకరు పలకరించకోవచ్చు, పిల్లల్ని పెంచవచ్చు, చివరకు ఒకరి మొహాలొకరు చూస్కోకుండా విడిపోవచ్చు. అతను వాని గాడిలో ఉన్నాడు. ఆమె తన గాడిలో ఉంది.

మార్పు అంటే తామసికునికి భయం. మనం జీవితంలో ఒక సమస్యను ఎదుర్కోవలసి వచ్చినా, లేదా మార్పు వచ్చినా తమస్ తో స్పందిస్తాం. జీవతంలో మార్పు సహజం. బుద్ధుడు చెప్పినట్టు ఏదీ మార్పు చెందకుండా ఉండదు. మనం దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. కాని తామసికుడు మార్పు గురించి ఇలా ఆలోచిస్తాడు: "నాలో మార్పు రాదు. నేను దృఢమైనవాడిని. నేను వంగలేను."

మొన్నొక జపనీస్ మిత్రుడు ఒక బొమ్మను చూపించేడు. దాన్ని నొక్కితే కుంచించుకు పోతుంది. దాని మీదనుంచి చెయ్యి తీసేస్తే మామూలుగా ఉంటుంది. మనం అలాగే ఉండాలి. పరిస్థితులు విషమించి నపుడు మనం లొంగాలి. పరిస్థితులు బాగయినపుడు తిరిగి మన పూర్వ స్థితికి రావాలి. ఇంకా ధృడంగా ఉండాలి.

తామసికుడు పరిస్థితులు విషమించినపుడు క్రింద పడిపోతాడు. అదే వాని సహజ స్థితి. "నేను చేయలేను" అన్నది వానికి ఊతపదం.

నా ధ్యానం తరగతిలో అటువంటివాళ్లను చూసేను. వారు మొదట్లో చాలా ఉత్సాహంతో ఉంటారు. క్రొత్త తలదిండు, ధ్యానానికై కొనుక్కున్న క్రొత్త బట్టలు, మొదలైన వాటితో వస్తారు. వాళ్ళు కళ్ళు మూసుకొంటే వారి మనస్సు కోతిలాగ పరివర్తిస్తుంది.

ఒక ఆంగ్ల సాహిత్యవేత్త ధ్యానం గురించి ఇలా అన్నారు: "ధ్యానంలో కూర్చున్న తరువాత, నేను చదివిన పుస్తకాలన్నీ గుర్తుకొచ్చేయి. నేను వ్రాయవలసిన పుస్తకంలోని పాత్రల గురించి ఆలోచనలు వచ్చేయి. అంతలోనే అరగంటసేపు చేయవలసిన ధ్యానం ముగిసిందని కళ్ళు తెరిచేను. వాచీ చూసుకొంటే ఐదు నిమిషాలు గడిచాయి."

ఇటువంటి అలజడి సాధారణంగా మన మనస్సును స్వాధీనంలో ఉంచడానికి ప్రయత్నిస్తే ఉంటుంది. తామసికునికి అది భరించ రానిది. అతడు ధ్యానంలో వాడే తలదిండును షాపుకు తీసికెళ్ళి "దీన్ని అమ్మిపెట్టు. ఆ డబ్బంతా నువ్వే వుంచుకో. నేను ధ్యానాన్ని వదిలేస్తున్నాను."

తమస్ అంటే చీకటి. తామసికుడు చూడలేడు. వాడు జీవితమంతా చీకటిలో బ్రతుకుతూ అంధుడిలా ప్రవర్తిస్తాడు. యుద్ధం వస్తే వానికి తెలీదు. పీల్చే గాలి కాలుష్యంతో నిండివున్నా వానికి పట్టదు. వాని నివాస స్థలంలో హింసాకాండ చెలరేగుతుంటే పట్టించుకోడు. నేనెప్పుడో చదివేను ఒక కుటుంబంలోని సభ్యులంతా నిద్రలో నడుస్తారని. మధ్య రాత్రిలో లేచి వారు కలసి తింటారు. మరుసటి ఉదయం వాళ్ళలో వాళ్ళే ప్రశ్నించుకొంటారు "ఎవళ్లు ఇక్కడ తిన్నారు?" ఇది మనం చేసే క్రియలకు భిన్నంగా లేదు. మనకున్న చేతనంతో పోలిక చేస్తే, మనలో చాలామంది జీవితం అర్థరాత్రి తినడంలాగా గడుపుతారు.

కొన్ని సంవత్సారల క్రితం నా మేనకోడలిని ఐస్ షో కి తీసికెళ్ళేను. అక్కడ ఒక మర మనిషి ఐస్ మీద స్కేటింగ్ చేసింది. దాని చుట్టూ ఒక ఆడది, మెరుపులు గొలిపే బట్టలు వేసుకొని, మానిటర్ తో మర మనిషిని కదిలిస్తున్నది. "రోబోట్ కుడివైపు తిరుగు, పరిగెత్తు, నోరు తెరచు" అన్నట్టు ఆ మానిటర్ తో దానిని నడిపింది. ఇదే తామసికునికి జరిగేది. బుద్ధుడు చెప్పినట్లు ఇది జీవించడం కాదు. నిద్రపోవడం. స్వార్థపూరిత కోర్కెలతో అటునిటు లాగబడితే దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.

బద్దకం తామసికుని లక్షణం. వానికి ఆలోచించడం, అనుభవించడం, కదలడం, వ్యాయామం చేయడం, టివి చానెల్ ను మార్చడం అంటే బద్దకం. మనకు చెడుని ఎదిరించి, ప్రపంచానికి ఏదైనా మంచి చేయడం కష్టమే. తామసికులు వలం అవతారు. వాని మనస్సు బరువుగా ఉంటుంది కాబట్టి శరీరం దానితో సమానంగా ఉంటుంది.

బెర్ క్లీ లో ఒక గోడమీద ఇలా వ్రాసి ఉంది: "నాకు కావలసినది మద్యం, గంజా". ఇది తామసికునికి బాగా వర్తిస్తుంది.

తామస గుణాన్ని వదిలించుకోవాలంటే మొదటి అడుగు భౌతికం. తామసికుడు జడత్వంతో నిరుత్సాహంగా, నిర్లక్ష్యంగా ఉంటాడు. వాడిని ఎవరో ఇలా శాసించునట్టు తలుస్తాడు: "నాకు కావాలసినట్టు కూర్చోకూడదని ఎందుకు చెప్పారు?" తామసికుడు భౌతికంగా ఆరోగ్యంతో లేనని తలుస్తాడు. వొళ్లంతా నొప్పులతో ఉన్నట్టు, ఎవరూ పట్టించుకోనట్టు వాని అనిపిస్తుంది. కాని తమస్ ఉన్నప్పుడు విశ్రాంతి తీసికోకూడదు. కావలసింది విశ్రాంతిని తగ్గించుకోవడం. పైపై కొన్ని ఆనవాలు ఉంటాయి : తలనొప్పి, నరాల బలహీనత, కాళ్ళలో రక్త ప్రసారం లేనట్టు, తల బిరుసుగా ఉన్నట్టు. మంచంమీద పడుకొంటే భౌతిక పరిస్థితి విషమిస్తుంది. లేచి నడవాలి. మంత్రం జపిస్తూ వేగంగా నడవాలి. పది నిమిషాలు అలా నడుస్తే వొళ్ళు స్వాధీనంలోకి వస్తుంది. అక్కడితో ఆపకూడదు. అలా నడుస్తూ ఉ౦డాలి.

మీరు ఒక రిపోర్ట్ రాద్దా మనుకొన్నారు. తామసం ఆవహించింది అనుకోండి. కొన్ని పెన్సిళ్ళను ముల్లు చెక్కి తయారుచేసుకొన్నారు. దానితోనే కొన్ని పుస్తకాలు బెంచీ మీద పెట్టేరు. తెల్ల కాగితం ముందు పెట్టుకున్నారు. వ్రాయడానికై ఆలోచన చేస్తున్నారు. ఇది చాలాకాలంగా జాప్యం చేయబడిన రిపోర్ట్ . అది రేపే పై వాడికి ఇవ్వాలి. ఏదో ఒకటి వ్రాయాలి.

మీకు రిపోర్ట్ దేని మీద వ్రాయాలో తెలీదు. బహుశా మీరు ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివి, కాచి వడబోసి, రిపోర్ట్ తయారు చేసుకోవాలనుకొంటున్నారు. ఇక్కడ పరిపక్వం అంటే జాప్యం. పరిపక్వతను సాధించడానికి ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ అది క్రియ చేయకముందే ఉండాలంటే దానికి చాలా కాలం వేచి వుండాలి.

నా విద్యార్థులకు స్వీయానుభవం ఇలా చెప్పేను: మీకున్న జ్ఞానంతో వ్రాయడం మొదలు పెట్టండి. ఏదో క్రొత్త గ్రంధాన్ని ఆవిష్కరిస్తున్నట్టు కాదు. మీ వ్రాసే శైలిని గురించి బాధ పడకండి. ఎవరూ చదవకపోయినా కొంత మంది సరైన పదం గురించి తర్జనబర్జన పడతారు. ఒక్కొక్కపుడు దానివలన కొన్ని గంటలు కాగితాన్ని చూస్తూ గడుపుతారు. వ్రాసే విధానం గూర్చి బాధ పడకండి. మీకు కావలసినది వ్రాయడం. అది అయిన తరువాత దానికి తగిన రీతిలో మెరుగులు దిద్దవచ్చు.

మొదటి మెట్టు భౌతికమైన క్రియ. మీ కలాన్ని ముందుకు నడపండి. మీరేమి వ్రాస్తున్నానని అని బాధ పడకండి. క్రమంగా తమస్ తగ్గి దాని స్థానంలో రజస్ వస్తుంది. ఒక ఆలోచన వస్తుంది. అటు తరువాత దానిని ఖండించే ఉంకో ఆలోచన వస్తుంది. వాటిని వ్రాసి, ఆ రెండిటికి ఏమైనా సంబంధం ఉందో లేదో చూసుకోండి. దాన్ని మరల, మరల, పరీక్షించండి. ఇంతలోనే ఒక గంట గడిచిపోతుంది. మీ మిత్రుడు కాఫీ త్రాగడానికి రమ్మంటాడు. మీ సమాధానం: "నేను తరువాత వస్తాను. బుర్రలో జ్ఞాపకమున్నప్పుడే ఈ పని చేయాలి."

భౌతిక క్రియలతో, కలంతో కాగితం మీద వ్రాస్తూ, తమస్ ని వెళ్ళగొట్టి, ప్రాణ శక్తిని పొందుతారు. ఇప్పుడు మీరు దృష్టిని కేంద్రీకరించగలరు. మీ సావధానత పూర్తిగా మీరు చేస్తున్న క్రియపై పెట్టండి. తమస్ దాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే అయితే మీ మనస్సు వికలమవుతుంది. ఇది మనకు చేస్తున్న పని వృధా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ క్రియని ఆపేస్తే తీరని నష్టం కలుతుంది. సమస్యను జటిలం చేస్తుంది. ఎప్పుడైతే ఒక క్రియ వృధా అనిపిస్తుందో, దానిమీద దృష్టి కేంద్రీకరించాలి. మనస్సు వికలంగా ఉంటే ఇంకా తీక్షణంగా ఉండాలి. మీ మనస్సును ధ్యానంలో లాగ వెనక్కు తీసికో౦డి. కొంత కాలం తరువాత అది సహజమై, కావలసిన ఫలితం ఇస్తుంది.

ధ్యానం వల్ల మనస్సును మనకు కావలసినట్టుగా మార్పు చేయవచ్చు. నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది. నేను దాన్ని జేబులో పెట్టుకుంటాను. దాన్ని నాకు కావలసిన చోట వాడుతాను. అది దానికై సర్వసిద్ధంగా ఉండాలి. చాలామందికి క్రియాశీలత సిద్ధంగా ఉండదు. ఎలాగంటే టార్చ్ లైట్ జేబులో ఉన్నంత కాలం అది నిరుపయోగం. దాని ఉపయోగం తెలుసుకోవాలంటే వాడి చూడాలి .

మన మనస్సును నియంత్రించుకొంటే మనం చేయవలసిన క్రియ మీద పూర్తి ఏకాగ్రత ఉంటుంది. ఇది అమోఘం. ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు సాధించనిదంటూ ఏమీ లేదు. వాళ్ళు ఇలా తమను తాము ప్రశ్నించుకోరు: "నాకిది ఇష్టమా? నాకు దీని వల్ల ఒరిగేదేమిటి?" కాలుష్యం లేదా హింస ని లేకుండా చేయడానికి పూనుకొన్నవారు తమని తాము మరచి, వేరొకరికై పాటుపడతారు. ఇటువంటి క్రియలవల్ల ఒత్తిడి, ఉద్రిక్తత, నిరాశ దూరమౌతాయి. 137

No comments:

Post a Comment