స్వామి మాధవానంద ఆది శంకరుల భాష్యము ఆంగ్లములోకి అనువదించిన బృహదారణ్యక ఉపనిషత్తు ఆధారముగా ఈ క్రింది తెలుగు అనువాదము చేయబడినది
కర్మలు మంచివి లేదా చెడ్డవి కావచ్చు. మంచి కర్మలు సజ్జనుడికి వర్తిస్తాయి మన ఉనికి అట్టి కర్మల వల్లే
చెడు కర్మ వలన ఒకడు మరల మరల క్రిమికీటకాదులవలె జన్మించి బాధలను అనుభవించును. ఇది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి శ్రుతి మంచి కర్మలను గూర్చి మాత్రమే మాట్లాడును.
ప్రతి మానవుడు ముక్తికై ప్రయత్నించుచుండును . అందువలన ముక్తి కర్మ వలన సాధ్యమని భ్రమ పడవచ్చు.
మరియు కర్మాచారణ పరిపక్వమైనగొలది, కర్మ ఫలము కూడా సులభ సాధ్యము. దాని వలన ముక్తి కూడా పరిపక్వమైన కర్మలవలన సాధ్యమని అపోహ గలదు . దానిని తుడిచిపెట్టవలెను
నిష్కామ కర్మ మరియు ధ్యానము కొంతవరకు నయము . కర్మలు వాని ఫలములు నామరూపాత్మక ప్రపంచమునకే పరిమితములు
కాని కర్మకు ముక్తికి సంభందములేదు. ఎందుకనగా ముక్తి ఒక కార్యము కాదు . కర్మ నామరూపాత్మక ప్రపంచమునకే పరిమితము.
కొందరు నిష్కామ కర్మ వలన, ధ్యానము వలన పాలు పెరుగైనట్లుగా మరియొక ఫలమును పొందవచ్చునని తలంతురు
కానీ ముక్తి ఒక కార్యము కాదు. అది ఒక తయారు చేసిన పదార్థమూ కాదు. బంధ విముక్తి వలన సాధ్యము.
బంధానికి కారణము అజ్ఞానము . కర్మ వలన అజ్ఞానము అంతరించదు . ఏలనగా కర్మ నామరూపాత్మక ప్రపంచమునకే పరిమితము
కర్మయొక్క లక్షణములు తయారు చేయుట , మార్పు చెందుట , స్వచ్ఛత మొదలగునవి అనగా కర్మవలన వస్తువులను తయారు చేయవచ్చు ; మార్పు చెందింప వచ్చు లేదా స్వచ్చ పరచ వచ్చు . ముక్తి వీనిలో ఏ ఒక్కిoటికి చెందదు .
ప్రత్యర్థి అనుమానము :
నిష్కామ కర్మ మరియు ధ్యానము విలక్షణ మైనవి . పాలు - పెరుగు అయినట్లుగా కర్మ వలన ముక్తిని పొంద వచ్చు గదా !
భాష్యకారుని సమాధానము:
అట్లు తలంచుటకు ఒక్క ఆధారముకూడా లేదు. దానికి ప్రత్యక్ష, అనుమాన , ఉపపత్తి వంటి ప్రమాణము లేదు. శృతి లోనూ అట్టి ప్రమాణము లేదు
ప్రత్యర్థి అనుమానము :
ముక్తి తప్ప వేరే ఫలము లేనపుడు వైదిక కర్మలు ఎట్టి ప్రయోజనములు గలవి ? కర్మలవలన స్వర్గప్రాప్తి కలుగవచ్చుననుటకు శృతిలో ప్రమాణము లేదు. కానీ మనుజులు వైదిక కర్మములు స్వర్గ ప్రాప్తికై చేయుదురు. అట్టి నమ్మకమే ముక్తి గూర్చి ఉండడము ఎందుకు అసాధ్యము ?
భాష్యకారుని సమాధానము:
సాధారణ మానవులు ప్రయోజనము లేనిదే కర్మలను చేయరు . వారిని గూర్చి ముక్తి కర్మవలన సాధ్యమనే నానుడి ఉండవచ్చును. అది ఎంతమాత్రము నిజము కాదు.
ప్రత్యర్థి అనుమానము :
ఉదాహరణకు ముక్తి జ్ఞానము వంటిది కావచ్చు కదా? జ్ఞానము వలన ముక్తి సాధ్యమని చెప్పుదురు . అట్లే కర్మ ముక్తికి కారణము ఎందుకు కాకూడదు ?
భాష్యకారుని సమాధానము:
జ్ఞానము అజ్ఞానమును ధ్వంసము చేయును . దాని వలననే ముక్తి సాధ్యము. కానీ కర్మ వలన జ్ఞానము వచ్చుననుటకు ఆధారము లేదు . అజ్ఞానము వలన ముక్తి అసాధ్యము. ముక్తి అన్నిటికి అతీతము. అది ఆత్మకు సంబంధించిన విషయము
అజ్ఞానమునకు ప్రత్యక్ష సాక్ష్యము లేదు . అది జ్ఞానమునకు వ్యతిరేకము . కానీ కర్మ అజ్ఞానమునకు వ్యతిరేకము కాదు . కాబట్టి దానికి జ్ఞానమునకు సంభందము లేదు.
అజ్ఞానమునకు కారణములు అనేకములు . అవి అనుమానములు, అపోహలు , తప్పుడు నమ్మకములు మొదలగునవి కావచ్చు . అది జ్ఞానము ఉదయించ గానే పోవును. కానీ కర్మవలన జ్ఞానము ఉదయించుననుటకు ఆధారము లేదు .
ప్రత్యర్థి అనుమానము :
కర్మ విచిత్రముగా అజ్ఞానమును దూరము చేయవచ్చునని అనుకొందాం
భాష్యకారుని సమాధానము:
మనకు జ్ఞానము వలన అజ్ఞానము తొలగుననుటకు పెక్కు ఆధారములు కలవు . కాని కర్మ అటువంటిది అనుటకు ఆధారములు లేవు
ధాన్యమునుండి పొట్టు వేరుచేయుట అజ్ఞానము వలన సాధ్యము కాదు. అట్లే అజ్ఞానము వైదిక కర్మల వలన పోవుననుట నిజము కాదు.
శృతిలో భగవంతుని చేరుటకు కర్మలతో సంభందము లేని జ్ఞానము వలన సాధ్యమనుటకు ఆధారములు కలవు . ఉదాహరణకు "ధ్యానము వలన దేవతల ప్రపంచమును చేరవచ్చును" అనెడి శృతి వాక్యము గలదు.
ఉపాసనల వలన పొందెడి ఫలము కర్మకు వ్యతిరేకమనుట సాధ్యము కాదు . ఎందుకనగా కర్మ ఒక కార్యము కాదు. అనగా కర్మకు కారణము లేదు . అట్లే ఫలమునకు కర్మ కారణము కాలేదు .
ఉపాసనములను ఆచరించుటకు ఒక ఆశను కలిగించుట చూచెదము . ముక్తిని ప్రసాదించుటకు గానీ లేదా అజ్ఞానము తొలగిపోవుట గానీ వాని వలన సాధ్యము కాదు .
ప్రత్యర్థి అనుమానము :
నేతి నేతి అనెడి ప్రక్రియ వలన ముక్తి కర్మఫలమని తలచవచ్చు కదా . ఉదాహరణకు సంతానము కొరకు , ధనమునకై , స్వర్గ ప్రాప్తికై అనేక ఉపాసనలు కలవు. మిగిలనది ముక్తే . వేద పండితులు అట్టి ముక్తిని పొందుటకు ఆశ పడెదరు .
భాష్యకారుని సమాధానము:
కర్మ ఫలములు లెక్క లేనన్నివి . అందు వలన నేతి నేతి ప్రక్రియ వానికి వర్తించదు . ఏ సామాన్యుడు కర్మ ఫలములు , వానిని పొందుటకు గల మార్గములు, వానిపైగల ఆశలు గూర్చి సంపూర్ణముగా అధ్యయనము చేయలేడు . ఎందుకనగా వాటికి దేశ, కాల, కారణ పరిమితులు లేవు . మనకు లెక్క పెట్ట లేని కర్మలు, వాని ఫలములు , వానిని పొందు మార్గములు తెలియనప్పుడు, ముక్తి ఒక కర్మ ఫలమని చెప్పలేము .
ప్రత్యర్థి అనుమానము :
కర్మ ఫలములు ఒక జాతిగా ఊహించిన, ముక్తి ఒక్కటే ఆధారము లేనిది. ఫలములు లెక్క లేనన్నివి అయినప్పటికి అవి కర్మ ఫలములనెడి జాతి. ముక్తి అట్టి కర్మ ఫలము కాదని చెప్పుట సమంజసము కాదు .
ఉదాహరణకు ముక్తి ఒక పదార్థము వలె ఆవిర్భావము , మార్పు , స్వచ్ఛత అను లక్షణములు గలదని చెప్పవచ్చు కదా
భాష్యకారుని సమాధానము:
ముక్తి జననమరణములు లేనిది. దానికి ఆవిర్భావము , మార్పు వంటి లక్షణములు లేవు.
ప్రత్యర్థి అనుమానము :
నేతి నేతి అనే తర్కము వలన ముక్తి సాధ్యము కదా
భాష్యకారుని సమాధానము:
ముక్తి ఆత్మకు సంబంధించిన విషయము . నిజానికి అది ఆత్మ లక్షణము
ప్రత్యర్థి అనుమానము :
సాధారణ కర్మలు వైదిక కర్మలవలె కానప్పుడు వాని ఫలములు విలక్షణముగా ఉండ వచ్చు కదా
భాష్యకారుని సమాధానము:
సాధారణ కర్మలకు వైదిక కర్మలకు పెద్ద తేడా లేదు . ఎందుకనగా శృతి సాధారణ కర్మలు -- అనగా నిత్య నైమిత్తిక కర్మలు -- జీవితాంతము చేయవలెనని శాసించినది. కాబట్టి వాని నుండి ముక్తి పొందుట సాధ్యము కాదు .
ముందు పాలు-పెరుగు ఉదాహరణ ఇవ్వడము జరిగినది. దానికి నేను వ్యతిరేకిని కాదు . నిష్కామ కర్మ ధ్యానముతో ఆచరించిన విలక్షణమైన ఫలములను పొందవచ్చును .
శృతి దేవతల మెప్పుకై త్యాగము చేయువానికన్న ఆత్మ జ్ఞాని గొప్పవాడని తెలిపినది. మనువు చెప్పినట్లుగా అందరిని తనలోనూ, తనను అందరి లోనూ చూచుకొనెడి వాడు గొప్ప ఆత్మ జ్ఞాని . అట్టి జ్ఞాని కర్మలు ఆచరించిన అది తన స్వచ్ఛత కొరకే . అట్టి వాడు ఈ జన్మలోనే లేదా మరు జన్మల వలెనో ఆత్మ సాక్షాత్కారము పొందును.
శ్రుతి కర్మ ,మరియు ధ్యానముల వలన హిరణ్యగర్భుని పొందవచ్చునని చెప్పి యున్నది . అట్లే శరీరము పంచ భూతములలో కలిసిన తరువాత జ్ఞాని ఒక దేవుని వలెనె పూజింప బడెదడు అని చెప్పబడినది
కాబట్టి హిరణ్యగర్భుని పొందిన వానికి , ఆత్మ సాక్షాత్కారము అయిన వానకిని గల తేడా కర్మ ఫలమునకు కారకమైన వైదిక ఉపాసనలు మరియు వేదాంతములైన ఉపనిషత్తులకు గల తేడా
మనము సుకర్మలు చేయువానికి, నిషిద్ధ కర్మలు చేయువానికి గల తేడా చూచుచున్నాము కదా. నిషిద్ధ కర్మలు చేయువాడు జంతు రూపాముగానో లేదా చెట్టు రూపాముగానో మరల పుట్టును.
శ్రుతి "ఈ శరీరము బ్రహ్మమును తెలిసికొనుటకు ఇచ్చినది" అని తెలిపి యున్నది .
ముందు చెప్పిన పాలు-పెరుగు ఉదాహరణ ఖండించుటకు వీలు కానిది. అది ఒకని అనుభవము లేదా తెలివి మీద ఆధారపడును . కానీ శృతి వాక్యములు అట్టి ఉదాహరణాలకు అతీతమైనవి. ఒకవేళ శ్రుతి అట్టి ఉదాహరణము చెప్పినచో దానిని శాసనముగా తీసికొనవచ్చును .
శ్రుతి యొక్క వాక్యములు వేరొక శాస్త్రములకు వర్తించదు. ఒకవేళ శృతి "అగ్ని చల్లగా ఉండును. అగ్ని వస్తువులను తడుపును" అని చెప్పిన దానిని అంగీకరించనక్కరలేదు . కానీ శృతి చెప్పిన విషయము వేరొక శాస్త్రమునకు చెందనిదైనచో, ఆ విషయమునకు శృతియే ప్రమాణము . కొందరు మిణుగురు పురుగులను అగ్నిగా భావింతురు. అట్లే ఆకాశము నీలి రంగు అని తలతురు. వేరొక ప్రమాణము వలను వారి అనుభవము మిథ్య అని తలంపవచ్చును.
వేదము అట్టిది కాదు. వేదము చెప్పిన మంత్రములు శాసనము వంటివి. ఒకని తెలివి వలన లేదా యుక్తి తో వానిని ఖండించిన అది వృధా. ఎట్లనగా సూర్యుని కాంతి వస్తువులను ప్రకాశింపజేయును. అది ఒకని తెలివి లేదా మేధపై ఆధారపడిలేదు. అట్లే శాస్త్ర వాక్యములను వికటమైన తెలివితో తప్పులని నిరూపింపజేసే ప్రయత్నము వ్యర్థము. కావున కర్మాచారణము వలన ముక్తిని పొందవచ్చుననుట అసత్యము .
No comments:
Post a Comment