Sunday, April 3, 2022
Saturday, March 26, 2022
Eknath Gita Chapter 14 Sloka 9
14.9
సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ద౦ సత్త్వమిత్యుత
ఈ శరీరద్వారములైన సర్వేంద్రియముల యందును ఎప్పుడు ప్రకాశమానమగు జ్ఞానము ఆవిర్భవించునో అప్పుడు సత్త్వగుణము బాగా వృద్ధి నొందుచున్నదని గ్రహింపుము
ఈ శ్లోకంలో ఉపనిషత్తులు చెప్పిన విధముగా: శరీరమును చుట్టూ గోడ, రాకపోకలకి ద్వారాలు గల పురాతన పట్టణములతో పోలిక చెప్పబడినది. ఇంద్రియాలు శరీరం యొక్క ద్వారాలు. శ్రీకృష్ణుడు శరీరము లోపల ఒక అధ్యక్షుడుగా ఉన్నానని గుర్తు చేయుచున్నాడు. పట్టణము చక్కగా ఉండి, కాపలా భటులు అధ్యక్షుడు చెప్పినట్లుగా కొందరిని లోపలికి రానిస్తారు, కొందరిని వెనుకకు పంపిస్తారు. ఇది సత్త్వ గుణముతో పోలిక. రజస్ తో కూడిన పట్టణములో కాపలా భటులు వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తారు. తమస్ తో కూడిన పట్టణములో వాళ్ళు పడుకొని ఉంటారు.
ఒక చిన్న ఉదాహరణ. నేను ఉంటున్న పెటలూమా అనే ఊరులో ఒక భయానకమైన సినిమా విడుదలయింది. ఆడ మగ పెద్ద ఎత్తున ఆ సినిమా చూడడానికి, అనారోగ్యము వస్తుందని తెలిసినా, బారులు కట్టేరు. అది వారికి నచ్చుతుంది. సాన్ ఫ్రాన్కిస్ కో నగరంలో ఒక ఆడది సినిమా హాల్ లో మూర్ఛతో పడిపోయినదని విన్నాను.
నేను ఒక దంపతులను ఆ వరసలో చూసేను. టిక్కెట్టు కొంటున్నప్పుడు జరిగే దృశ్యాన్ని ఊహించగలను. "ఈమె నా జూలిఎట్. నాకు ఆమె అంటే ఎంత ఇష్టమంటే, ఆవిడకి మూర్ఛ తెప్పిస్తాను. "
కళ్ళు, చెవులు మనస్సుకు రహదారులు. ఇటువంటి సినిమా చూస్తున్నప్పుడు మనం విన్నది, కన్నది వికల్పమైన మనస్సుకు దారి తీస్తాయి.
ఆత్మ కాంతి వంటిది. తమస్ గాఢాంధకారము. రజస్ పట్టణంలో రభస. సత్త్వ౦ అనగా ఆ పట్టణం ప్రశాంతంగా ఉండడం. ఆ స్థితిలో మీ హృదయం ప్రేమతో, జ్ఞానముతో నిండుగా ఉండి, మీ తేజస్సు నలుదిక్కులా వ్యాపిస్తుంది. 139
Saturday, March 19, 2022
Eknath Gita Chapter 14 Sloka 8
14.8
రజస్తమశ్చాభిభూయ సత్త్వ౦ భవతి భారత
రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా
భారతా! సత్త్వగుణము రజో తమోగుణములను, రజోగుణము సత్త్వ తమో గుణములను, తమోగుణము సత్త్వరజోగుణములను అణుచుచు ఆయా గుణము ప్రధానమగుచుండును
ఎవ్వరూ రజో, తమో గుణములతో జీవించాలని కాంక్షించరు. కాని చాలామంది వాటితోనే జీవిస్తారు. మంచి ఉద్దేశము ఉన్నా, ఎందుకు నిస్వార్థ కర్మల చేయుటకు మానసిక అవరోధాలు ఉన్నాయి? అపాయం కలిగించే స్వార్థ కర్మలు ఎందుకు చేస్తున్నాం?
ఇదే మానవులకున్న సందిగ్దావస్థ. కొన్నిసార్లు మనకు పని చేయవలసినప్పుడు బద్దకం ఆవహిస్తుంది. మనం "నేనిది చేయలేను. వేరేవాళ్ళచేత చేయిస్తాను" అనుకుంటాం. మనకు ఇష్టమైన పని చేయవలసినపుడు పూనుకొని మనః పూర్వకంగా చేస్తాం. దాని వల్ల ఏ లాభం ఉండకపోవచ్చు. దానివల్ల మనకు, ఇతరులకు అపాయం కలగవచ్చు. మరుసటి రోజో, కొన్నినెలల తరువాతో, లేదా తరువాత తరంలోనో దాని ప్రభావం తెలుస్తుంది. మనం పని మీద దృష్టి కేంద్రీకరించి సమయాన్ని మర్చిపోతాం. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని మరచిపోయేం.
ఈ శ్లోకం ఒక గుహ్యమైన విషయం చెప్తోంది. సత్త్వ గుణంతో బ్రతకాలంటే రజస్ తమస్ లను నియంత్రించుకో. ఈ విధంగా రెండు గుణాలను స్వాధీనంతో పెట్టుకొంటే మూడవది అనుభవంలోకి వస్తుంది.
మీ స్వీయానుభవంతో తెలుసుకోవచ్చు. మీరు సోమవారము గీత చదివి ఉత్సాహపూరితలు అవుతారు. ఆ బోధ మనస్సులో బాగా నాటుకు౦ది. మీరు జీవితాన్ని తదనుగుణంగా మార్చుకొని దాని పరమార్థం తెలిసికొన్నారు. మరుసటిరోజు ఉదయం వేరంగా లేచి, ధ్యానం చేసి, సాత్విక టిఫిన్ తిని, పనిమీద పూర్తి ధ్యాస పెట్టి, తోటివారలను గౌరవంగా చూసి, నిర్దయులకు ప్రేమ చూపిస్తారు. బద్దకం వస్తే నడక మొదలెట్టి మంత్రం జపించుకొంటూ వెళతారు. లేదా జాప్యం చేసిన పనిని మొదలెడతారు. మనస్సు వేగంగా ఉంటే మంత్ర సహాయంతో దాని వేగం తగ్గిస్తారు. ఒక ముఖ్యమైన పని చేయడానికి తక్కిన వాటిని ప్రక్కన పెడతారు. వీటివల్ల రజస్ తమస్ ల నుండి విడివడి ఒక మూడు రోజులు సాత్వికంగా ఉంటారు.
ఆ తరువాత నెమ్మదిగా పట్టు సడలుతుంది. నిరుత్సాహం ఆవరిస్తుంది. ఆఫీస్ లో పని ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ ఉన్న వారు ఏదో పని వెంటనే చేయమని అడుగుతారు. మనకు తెలీకుండానే పాత అలవాట్లు తిరిగి వస్తాయి. మనస్సు వేగంగా చలిస్తుంది. ఇతరులు మీ పనికి అడ్డం వస్తే వాళ్ళ మీద చికాకు పడతారు. గురువారం మీరు ఇంటిలో ఆఫీస్ పని చేయ బూనుతారు. భోజనం చేస్తున్నప్పుడు దానిపైనే ధ్యాస పెడతారు. భార్యను, పిల్లలను పలకరించరు. ఈవిధంగా సత్త్వగుణాన్ని వదలి, రజస్ తో ఉన్నారు.
శనివారం పడిపోతారు. పక్క మీద నుంచి లేవరు. కలలు కంటూ వాటితో రమిస్తారు. ధ్యానం చేద్దామని కూర్చొని, నిద్ర పోతారు. "నాకు ఈ వారమంతా పని ఒత్తిడి ఎక్కువయింది. ఇప్పుడు పూర్తిగా విశ్రమిస్తాను" అని అనుకొంటారు. టిఫిన్ ఎక్కువగా తిని కాఫీ కప్పు పట్టుకొని బయట ఎండలో కూర్చొని ఆనందిస్తారు.
ఆదివారం అయోమయంగా ఉంటుంది. ఎక్కడా నొప్పి లేకున్నా మనస్సు సరిగా ఉండదు. దేహంలో శక్తిలేనట్టు అనిపిస్తుంది. "ఏదో వైరస్ వల్ల కాబోలు" అనుకొంటారు. "నేను వేరే వాళ్ళని చూడను. పక్కమీదే ధ్యానం చేస్తాను" అని గుడికి వెళ్ళే కార్యక్రమాన్ని విరమించుకుంటారు. ఏవో పిచ్చి పుస్తకాలను తిరగేస్తారు.
రజస్ తాండవం చేస్తున్నప్పుడు సత్త్వ౦ కొరకు పెద్ద యుద్ధమే చేయాలి. ఏమైనప్పటికి తమస్ ను ఆశ్రయించకూడదు. సత్త్వ గుణం తగ్గుముఖం పడుతూంటే, దానికి ఊత నివ్వండి. ఇది చాలా బాధించేదే కాని పట్టుతో దాన్ని విడువకండి. వేరే మార్గం లేదు. 139
Sunday, March 13, 2022
Eknath Gita Chapter 5 Section 14
Bhagavat Gita
5.14
కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసా౦
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్
కామాక్రోధముల నుండి విడిపడిన వారును, మనసు స్వాధీనపడిన వారును, ఆత్మ జ్ఞానులును అగు యతి పురుషులకు బ్రహ్మజ్ఞానము సర్వత్ర కలదు.
ఈ శ్లోకంలో బ్రహ్మనిర్వాణ అనే పదం శ్రీకృష్ణుడు ప్రయోగించేడు. అంటే ఒక ఉత్కృష్టమైన లక్ష్యం. దాన్ని చేరాలంటే రెండు అడ్డంకులు ఉన్నాయి. ఒకటి స్వార్థం. దాని వల్ల ఒకడు లాభము, పేరుప్రఖ్యాతలు, ప్రతిష్ఠ కొరకై ప్రేరేపింపబడతాడు. బుద్ధుడు దీన్నే తన్హా -- అంటే తనది పొందటానికి ఇతరులతో అవసరమైతే కలహం పెట్టుకొని చేయడం-- అంటాడు. రెండవ ప్రతిబంధకం క్రోధం. ఎక్కడైతే వేర్పాటు, తానొక్కడే తృప్తి పొందాలనే భావన ఉంటుందో అక్కడ క్రోధం ఉన్నట్టే. కామము, క్రోధము కలసి వస్తాయి. మనమంతా స్వార్థ౦తో ఒక పెద్ద వస్తువు పొందాలని ప్రయత్నిస్తే, అది ప్రపంచంలో ఒకే ఒక వస్తువయితే, మన మధ్య స్పర్థలు కలగక మానవు.
అనేక విడిపోవడాలలో -- వ్యష్ఠి అయినా, సమిష్ఠి అయినా-- మన ఇష్టం, ఇతరుల ఇష్టం మధ్య, మన సౌభాగ్యం ఇతరుల సౌభాగ్యం మధ్య కలహం ఉంటుంది. సౌభాగ్యం, శాంతి విడదీయబడలేవు. నేతలు ప్రపంచ శాంతి ఎంతో అవసరమని చెప్తున్నారు. ప్రపంచం ఒక మూలలో యుద్ధం జరుగుతూ ఉంటే, మరో మూలలో శాంతి ఉన్నా లాభం లేదు. అలాగే ఒక దేశంలో సౌభాగ్య ముండి, వేరే దేశం దరిద్రంతో బాధ పడుతూ ఉంటే కూడా లాభం లేదు. ఎలాగంటే మన ఇంట్లో వంట గది నిప్పంటుకుంటే, దానిని ఆర్పకపోతే, అది ఇల్లంతా వ్యాపించి ఇల్లునే తగలబెడుతుంది.
కామాక్రోధాలను నియంత్రించాలంటే, మన ఇంటిలో కలసిమెలసి ఉండాలి. లేకపోతే ఇంట్లో యుద్ధ బీజాలు నాటబడతాయి. ఇంట్లోని వ్యక్తుల మధ్య కలహాలు, వేర్పాటు భావాలు ఉన్నాయంటే, ఆ ఇంట్లో ఒక చిన్న యుద్ధం జరుగుతున్నట్టే. అది ప్రపంచ యుద్ధమంత పెద్దది కాకపోయినా, అది యుద్ధమే.
యుద్ధ ప్రతిపాదిక మనస్సులో కలుగుతుంది. అది క్రమంగా మన హృదయాలలోనూ, ఇళ్లలోనూ, సమాజంలోనూ, చివరకు ప్రపంచమంతా వ్యాపిస్తుంది. గీత చేసే బోధ: యుద్ధం స్వార్థం-నిస్వార్థం, శుద్ధం-అశుద్ధం, ఆసురిక-దైవీక స్వభావాల మధ్య జరిగే పోరాటం. గీత చెప్పే యుద్ధం మన మనస్సులో, హృదయంలో జరిగే గందరగోళం. యుద్ధం రెండు వర్గాల మధ్య పోరాటం కాబట్టి మనకి ఆసురిక వర్గమైనా లేదా దైవిక వర్గమైనా ఎన్నిక చేసికోవచ్చు. అది దేశాకాలమానాలతో సంబంధం లేనిది. 331
Saturday, March 12, 2022
Eknath Gita Chapter 14 Sloka 7
14.7
సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత
జ్ఞాన మావ్రుత్య తు తమః ప్రమాదే సంజయత్యుత
భారతా! సత్త్వ గుణము సుఖములో జీవుని ప్రవర్తింపజేయును. రజోగుణము కర్మలలోనికి నెట్టును. తమోగుణము జ్ఞానము నావరించి జీవుని ప్రమాదమున ముంచును
ఏ విషయానికైనా మన స్పందన యాంత్రికము. ధనము వచ్చిన మనము దాని వ్యామోహములో అనాలోచితంగా పడతాము. సుఖం దానికన్నాఎక్కువగా ఆకర్షిస్తుంది. పేదవాడు, ధనవంతుడు అని తేడాలేక వాటిచే ఆకర్షింపబడతారు. మనం "నేను తీసికోవచ్చు లేదా వదిలేయవచ్చు" అనుకోవచ్చు. కానీ ధన-సుఖాలకు వేరే మార్గముంది.
మనము ధ్యానం మొదలుపెట్టిన తరువాత, సుఖం వచ్చి మనను తనవైపు లాగుకొ౦టే, అప్రయత్నంగా మనము దానివైపు వెళదామనుకున్నా, వెళ్లము. దానికి కోపంవస్తుంది. సుఖము ఇలా అంటుంది: "ఇది క్రికెట్ కాదు. నీవు నా వైపు రావాలి. జీవితమంటే అదే. చుట్టూ చూడు. ఎవరయినా నన్ను చూసి దూరంగా పరిగెడుతున్నారా? ప్రతి ఒక్కరు నన్ను కాంక్షిస్తారు. నేను ప్రతిఒక్కరికి మిత్రుడను." సెయింట్ ఫ్రాన్ సిస్ ఇలా తలుస్తారు: "నేను ఆకర్ష-వికర్షణలకు బద్దుడను కాను. నేను నాకు కావలసినది చేస్తాను. సుఖం నన్ను ప్రభావితం చేయలేదు".
ఎంతో ధ్యానం చేసిన పిదప, మనం తీసికొన్న నిర్ణయాలు కాకతాళీయంగా, బయట విషయాల వల్ల కాక, ఉన్నా, అవి వేరే గతి లేని స్పందనలు మాత్రమే. అవి నిర్ణయాలు కావు. గాఢమైన కోర్కెలు. అవి యాంత్రికంగా మన మనస్సుకు వస్తాయి. మనం వాటిని నియంత్రించాలి. మోక్షమనగా అట్టి కోర్కెలకు బానిస కాకపోవడం.
తామసికుడు, జడత్వంతో, ఇలా ఆలోచిస్తాడు: "నేను ఈ రోజు పక్క మీదే ఉంటాను". తమస్ "నేను వీడిని ఒక వేలుతో నా స్వాధీనంలోకి తీసుకొన్నాను. వీడు మంచానికి తాళ్లతో కట్టి పడేసిన వాడిలా ఉన్నాడు" అంటుంది. వాడితో "నీకు స్వతంత్రం లేదు " అంటే నమ్మడు . "చూడు నా చేయిని ఎత్త గలుగుతున్నాను. నా కాళ్ళను కదపగలను. నేను స్వతంత్రుడిని" అని అంటాడు.
మనం అడుగుతాం "అయితే పక్క మీదనుంచి ఎందుకు లేవలేక పోతున్నావు?"
"నేను తలచుకొంటే లేవగలను. కానీ నేను పక్క మీదే ఉండాలని నిర్ణయం తీసికొన్నాను"
ఒకడు ఆఫీస్ కు వచ్చి "నేనీ ఆదివారం ఊరెళుతున్నాను" అని అంటాడు. రాజసికుడు నవ్వి "వీడు మనస్సు వికల్పమైనది. నేను వాడిని ఎక్కడికైనా ప్రయాణం కట్టించగలను." ఇవి నిర్భంధమైన విషయాలు. అవి మనను కర్మ చేత బంధిస్తాయి. ఎందుకంటే మనను ఒక ధ్రుక్పధంలో బంధిస్తాయి. దీనిని శ్రద్ద అంటారు. ఒక దృఢమైన, స్థిరమైన, తిరిగి ప్రశ్నించ బడలేని, నమ్మకం బయట వస్తువేదో ఆనందాన్ని కల్గిస్తుందని అనిపిస్తుంది. అది ప్రస్తుత కాలంలోనే కాదు. సుఖమును కోరినవారు చరిత్రపుటలలో చాలా మంది ఉన్నారు. సుఖానికై ప్రతిఒక్కరు వెతుకుతారు. కానీ దాన్ని సంపూర్ణముగా పొందలేరు.
మనలో చాలామంది ఇంద్రియ సుఖము ఎక్కడో ఉందని తలుస్తాము. మన కది దొరకటం లేదని భావిస్తాము. అతి కొద్ది మందికి జ్ఞానోదయం కలుగుతుంది: "సుఖం బయటెక్కడో లేదు. నా అంతర్గతంలోనే ఉంది." ఈ విధమైన పరిపక్వమయిన జ్ఞానము సత్త్వ గుణమువలననే సాధ్యము. తద్వారా మన౦ మంచి నిర్ణయాలు చేయగలిగే శక్తిని పొందుతాము.
పరిపక్వాన్ని చాలా విధాలుగా ఊహిస్తారు. ఈనాటి మంత్రం: "నీకు బాగా అనిపించేదాని కోసమై వెళ్ళు." అంటే "ఎంత వీలయితే అంత మూర్ఖంగా వుండు." పరిపక్వతకి అసంగత్వం ఉండాలి. అదిలేని వాడు స్వార్థంతో: తన కోర్కెలు, అభిప్రాయాలు, క్రియలు గురించే ఆలోచిస్తాడు. పరిపక్వత చెందినవాడు తన ఇష్టాయిష్టాలకు అతీతుడై , సహనంతో వాటిని ఎదుర్కోగలడు.
శ్రీకృష్ణుడు "సత్త్వ౦ మనను ఆనందంలో ఓలలాడిస్తుంది" అని చెప్పేడు. అంటే మనం ప్రపంచంలో ఏదీ శాశ్వత సుఖం ఇవ్వదని తెలుసుకొంటాం. మనం మార్పు చెందని సుఖం గురించి వెదుకుతా౦. దీనివలన మనం సత్త్వాన్ని దాటి, త్రిగుణాల కతీతంగా శాశ్వతమైన స్వతంత్రం, ఆనందాన్ని పొందుతా౦.
నాకు పదేళ్ళ వయస్సులో ఆంగ్ల సాహిత్యం పరిచయం చేయబడింది. అంత మంచి కథలు, పాత్రధారులు ఉన్నారని ఊహించలేకపోయేను. నా స్కూల్ లో గ్రంధాలయం అంతా ఒక బీరువాలో హెడ్ మాస్టర్ కుర్చీ వెనుక ఉండేది. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. నిజంగా శ్రద్ధ ఉన్న వారికి ఆయన పుస్తకాలు ఇచ్చేవాడు. ఆంగ్ల నవలలు చాలా పెద్దగా కూడా ఉండేవి. ముఖ్యంగా చార్లెస్ డికన్స్ వ్రాసిన నవలలు. ఆంగ్లం నేర్చుకోవడం నాకు అతి కష్టం అనిపించేది. అందువలన నేను నెమ్మదిగా చదివేవాడిని. ఆ పొడుగాటి నవలలో పూర్తిగా మునిగిపోయేవాడిని. వాటి ముగింపులో నాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే అంతటితో నవల చదవడం అయిపోయింది. నేను దాన్ని ఇంకా పొడిగించటాకి దాన్ని మూసి, ప్రక్కన పెట్టేవాడిని. నా చిన్న మేనకోడలికి నా భార్య క్రిస్టినా చకలేట్ ఇస్తే అది దాన్ని దాచి అప్పుడప్పుడు తింటూ ఉండేది. అది చిన్న పిల్లలు చేస్తే ఫరవాలేదు. కానీ పెద్దవారు అలా చేయరు.
ధ్యానం గురించి నా ప్రసంగాన్ని వినడానికి అప్పుడప్పుడు క్రొత్తవాళ్ళు వచ్చేవారు. వాళ్ళు అశాశ్వతమైన విషయాలగురించి ఎంత నిరుత్సాహంగా ఉన్నారో చూద్దామని వాళ్ళని పరీక్షించే వాడిని. ఎవరైతే అశాశ్వత సుఖాలను కాంక్షి౦చరో వారు ఆధ్యాత్మికంగా పైకి ఎదగగలరు. అట్టివారు జీవితమనే బొమ్మలాటకు అతీతమైనవారు. వాళ్ళకి అప్పటికీ బట్టల విషయంలో వ్యామోహం ఉండవచ్చు. ఆధ్యాత్మికత వస్తే అదీ పోతుంది. ఆధ్యాత్మిక జీవితం కష్టమైనది. దానిపై గట్టి పట్టు ఉండాలి. వాళ్ళకి అది అలవాటైతే ముందుకు సాగగలరు.
శ్రీకృష్ణుడు "రజస్ మనను కర్మతో బంధిస్తుంది" అంటాడు. రాజసికుడు సవా లక్ష పనులు చేస్తూ ఉంటాడు. కానీ దేని మీదా వాడికి ఏకాగ్రత లేదు. ఎంతసేపూ చలనంలో ఉండి, అశాంతిగా ఉంటాడు.
ఇవాళ ఇంటికి వెళుతూ ఉంటే ఒక చెత్తలబండి మీద "ఇది ఎక్కువగా ఆగుతుంది" అని వ్రాసి ఉన్నది. ఇది రాజసికునికి వర్తిస్తుంది. చెత్తల బండి చెత్త ఉన్న అన్ని చోట్లా ఆగుతుంది. అది పెద్ద శబ్దం చేస్తుంది. చెత్తను ఎత్తి మీద వేసికొంటుంది. మరికొంత దూరం వెళ్ళి అదే పని చేస్తుంది. ఎవరైతే లక్ష్యంలేని పనులు చేస్తారో, సుఖానికి బద్ధులవుతారో అటువంటి వారే. వాళ్ళు దుకాణం నుంచ దుకాణంకు, హోటల్ నుంచి హోటల్ కు, దేశం నుంచి దేశంకు మారి తిరుగుతూ ఉంటారు. మార్పుకై జీవితాన్ని వృధా చేస్తారు. "నాకు మార్పు కావాలి" అనుకుంటాం. మనకి మార్పు ఆఖరుగా కావాలి. అది కానివి చాలా ఉన్నాయి. మనకి అత్యవసరం శాశ్వతమైనది.
కర్మ చేయాలనే పట్టువల్ల ఒత్తిడి కలుగుతుంది. ఒకనికి ధనార్జనపై ఎక్కువ కోరిక ఉంటుంది. వాడు ఇంటి గురించి ఎక్కువ ఆలోచించడు. తన కుటుంబంతో ఆనందంగా కాలం గడపడు. వాడు సెలవు రోజు కూడ దుర్భరంగా తలుస్తాడు.
రాజసికుడి మంత్రం: "లక్ష్య సిద్దికి ఏ పనైనా చెయ్యచ్చు ." అతడు లక్ష్యం నెరవేర్చుకోవడానికి సదా ఆలోచిస్తూ ఉంటాడు. అది పని చేస్తుందా? అది అధర్మం కావచ్చు కాని వృధా. మంచి దారులతో మంచి లక్ష్యాన్ని సాధించడమనేది ఆధ్యాత్మిక జీవనంలో మొదటి సిద్ధాంతం. మనం శాంతిని తయారు చేయలేం. శాంతి శాంతి వలననే కలుగుతుంది. యుద్ధం తననితాను పెంచుకుంటూ పోతుంది. దురాశ సంతృప్తి నివ్వదు. అది మరింత దురాశ కలిగిస్తుంది. పోటీ ఒకడికి క్షేమం కలిగించదు. అది వేర్పాటుని కలిగిస్తుంది.
మహాత్మా చెప్పేరు లక్ష్యం, దాన్ని సాధించే మార్గాలు ఒక్కటే. మంచి మార్గంలో వెళ్ళి, ఇంటిలో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఐకమత్యంతో ఉంటే "నేను విజయం సాధించేనా?" అని అడగనక్కర లేదు. ఆ ప్రశ్న నిరర్థకం. గాంధీ చెప్పేది: "పూర్తి ప్రయత్నము పూర్తి విజయాన్ని ఇస్తుంది. " మనం చేయవలసినదేమిటంటే హింసా కాండకి పరిష్కారం కనుగోవడం. మా ధ్యాన పాఠశాలవంటి దానికి సమయం, శక్తి, వనరులు సమకూర్చడం. బౌద్ధులు లాగ మనము గొప్పదైన క్రియను, కోపం, భయం, దురాశ లేకు౦డా చెయ్యాలి. మనం ఆడగవలసింది "నేను పూర్తి ఏకాగ్రతతో ప్రతి రోజూ ఏదో చేతనైనంత మంచి చేస్తున్నానా?"
పై శ్లోకం తమస్ భ్రాంతిని కలుగజేస్తుందని చెప్తుంది. అది జ్ఞానాన్ని కప్పివేసి అజ్ఞానాన్ని కలిగిస్తుంది. మన ఎరుకను తెలియకుండా చేయిస్తుంది. తామసికుడు మానవాళిలో అతి క్రింద ఉన్నవాడు. వాడు కర్మ ససేమిరా చేయడు. ఎందుకంటే వాడికి ఖాతరు లేదు.
మన అయిష్టమైన క్రియ చేయాలంటే తమస్ ఆవహించి మనని నిశ్చేష్టులిని చేస్తుంది. పక్షవాతంలా ఉంటుంది. తామసికుడు ఏ కర్మను చేయలేడు. సున్నిత స్వభావం వానిలో లేదు. వాని వలన ఇతరులకు కలిగే ఇబ్బందిని తెలుసుకోలేడు. వాడు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని తెలియక, తన స్వార్థాన్ని తాను చూసుకొంటాడు. ఎన్నో ద్రోహాలు, విశ్వాసఘాతక పనులు, తమస్ ఆవహించినప్పుడు కలుగుతాయి. మనకు విశ్వాసమంటే తెలియకపోతే దాని పర్యావసానము కూడా తెలియదు.
తమస్ వలన ఒక మనిషి, జాతి, దేశం స్వార్థానికి ఉపయోగింపబడితే మనకి ఏమీ పట్టనట్టు ఉంటాము. ఎటువంటి సానుభూతి, కోపం కలుగదు. ఒకనికి జరిగిన అన్యాయము, వాడు పడే యాతన, మన గుండెను కరిగించదు. అది చాలా బాధాకరమైన విషయము. చాలా మందికి ప్రపంచంలో జరుగుతున్న యాతన గురించి తెలియదు. ఎందుకంటే వారికి స్వార్థ బుద్ధి తప్ప వేరేది లేదు.
కొంత కాలం క్రిందట దినపత్రికలో సాన్ ఫ్రాన్సిస్ కో నగర అధ్యక్షుడు (mayor) తన సహోద్యోగి చే కాల్చి చంపబడ్డాడాని చదివేను. చంపినవాడు ఆ అధ్యక్షుడు వానికి అన్యాయం చేసేడని వెళ్ళి ఒక తుపాకీ కొన్నాడు. నేను ఆ నగరవాసులు కలత చెంది తుపాకీలకు సంబంధించిన చట్టాలను బలోపేతం చేస్తారని తలంచేను. కానీ వారు కొన్ని రోజులు శోకం చెంది, ఆ విషయం మరచిపోయేరు. క్రోధం వల్ల చాలా గొప్పవారు - కెనెడి, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు--వేలకొలది సామాన్యులు, ఆడవారు, పిల్లలు తుపాకీలచే కాల్చబడి మరణించేరు. ఇటువంటి దుర్ఘటనలు జరుగుతన్నా ప్రజలు షరా మామూలు అని ఉన్నారు. చాలా మందికి తెలీని విషయం మనం నిస్వార్థమైన, అహింసా చట్టాలను దబాయించి అడగాలి.
శ్రీకృష్ణుడు మనమందరమూ జీవితానికి తోడ్పడాలి అని మన కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. మన భూలోక వాసానికి ఉన్న కారణమదే. ఎవ్వడైతే స్వార్థంతో, దేహాభిమానంతో, ఇతరులకేమైనా జరిగినా పట్టించుకోకుండా, పర్యావసానాలను తెలిసికోకుండా, ఉన్నాడో వాడు తమస్ అనే మసుగేసుకొని, తను తక్కిన వారిని ప్రభావితం చేయనట్టు ఉన్నాడు. అయినప్పటికీ వాడు తమస్ ను వీడి ధ్యానంలో ప్రవేశిస్తే బాగుపడతాడు. 137
Saturday, March 5, 2022
Eknath Gita Chapter 14 Sloka 6
13.6
తమస్త్వ జ్ఞానజం విద్ధి మోహనం సర్వ దేహినాం
ప్రమాదాలనిద్రాభిః తన్ని బధ్నాతి భారత
భారతా! అజ్ఞాన జనితమైన తమోగుణము సర్వ జీవులకు మోహనమును కలుగజేయుచు మఱపు, అలసత్వము, నిద్రలలో జీవుని బంధించివేయుచున్నది
ఇంతవరకు శ్రీకృష్ణుడు చెప్పిన ఉపోద్ఘాతము, "ప్రపంచంలో వింతైన పాత్రని చూస్తారు. అతడు చెప్పిన మాట వినడు, బద్దకస్తుడు, స్తిమితము లేని వాడు, కృతజ్ఞత లేనివాడు" అని టివిలో ప్రకటన చేసినట్టు.
శ్రీకృష్ణుడు తమస్ చిహ్నాలు వల్లిస్తున్నాడు. మొదటిది ప్రమాద: మనఃపూర్వకత లేక పోవుట. ఇది చాలా చెడ్డని అలవాటు. అట్టివారు ముందుకు సాగలేరు. వాళ్ళ దృష్టి సదా మారుతూ ఉంటుంది. మనఃపూర్వకత ఉన్నవాళ్ళు విజయాన్ని పొందుతారు అని యోగి పతంజలి చెప్పియున్నారు. అట్టివారు ఒక మంచి లక్ష్యాన్ని మనస్సులో పెట్టుకొని మనస్పూర్తిగా, దిక్కులు చూడకుండా, పని చేస్తారు. ఆధ్యాత్మిక గురువులు ఒకరిని శిష్యునిగా చేర్చు కోవలంటే కొన్ని సంవత్సరాలు వాని స్వభావమును, మనఃపూర్వకతను తెలిసికొనుటకై నిఘా వేసి వుంచుతారు. అలాకాక వచ్చిన ప్రతి వొక్కరినీ శిష్యునిగా తీసుకొంటే, వానికి మనఃపూర్వకత లేకపోతే, గురువు సమయం, శక్తి వృధా అవుతాయి.
రెండవది ఆలస్య అనగా బద్దకం. అది నిరుత్సాహం, జడత్వం మొదలైనవాటితో కూడియున్నది. ఒకడు తన జడత్వం వలన నడుస్తున్నా, సంసిద్ధతతో యుండడు. మనస్సు గడిచిన కాలం గూర్చి, భవిష్యత్తులో ఏమి జరబోతుందని సదా ఆలోచిస్తూ ఉంటుంది. శరీరము మాంద్యముతో కూడి ఉంటుంది. అడుగులు నెమ్మదిగా పడతాయి. తల క్రిందకు వంచబడి ఉంటుంది. కూర్చున్నప్పుడు వెన్నెముక వంగియుంటుంది. దానివలన ధ్యానం సరిగా చేయలేడు.
చివరది నిద్ర. అది శరీరానికి కావలసినంత కాదు. దాన్నే అతినిద్ర అంటారు. ప్రపంచ విషయాలనుండి తప్పించుకోవడానికి తామసికుడు నిద్రలోకి ప్రవేశిస్తాడు. అతి కష్టంతో కళ్ళు తెరిచి ఉంటాడు. వాడు సినిమా చూస్తున్నా, ఒక సమావేశం జరుగుతున్నా, చివరకు భోజనం చేస్తున్నా ఎక్కడైనా నిద్రను కాంక్షిస్తాడు. వాడికి ఒక సమస్య వేధించినా, ఒక పని చేయలేకపోయినా బద్దకంతో, ఆవులింతలు చేసి, చంచల మైన మనస్సుతో నిద్రకు ఉపక్రమిస్తాడు.
ఈ బద్దకం విద్యాలయాల్లో కూడా ఉంది. ఎవ్వరో అన్నారు ప్రొఫెసర్ అనగా అవతలి వారి నిద్రలో మాట్లాడేవాడు. నా విద్యార్థి ఒకడు ఎప్పుడూ మొదటి పంక్తిలో కూర్చొనేవాడు. నేను ఎంతో కష్టపడి సాహిత్యం గురించి చెప్తూ ఉంటే, వాడు నెమ్మదిగా నిద్రలోకి జారుకునేవాడు. నిద్రలో తూగుతూ, మెడ ఛాతీకి తగులుతూ ఉండేదా దృశ్యం. వాడిని ఒకసారి ఏమి కనపడుతున్నాదని అడిగేను. "మీరు కొంతసేపు దయ్యంలా కనిపిస్తారు. ఆ తరువాత మీరు ఆవిరి ఐపోతారు. చివరకు మీరు మాయమవుతారు".
ఎప్పుడైతే క్లిష్టమైన మానసిక సమస్యలతో వేధింపబడతారో అప్పుడు నిద్ర రాదు. కానీ అచేతన మనస్సుది పైచేయి అయివుంటుంది. ఎంత మేల్కొని ఉందామని ప్రయత్నించినా సాధ్యము కాదు. అది ఆఫీసు లోనే కావచ్చు, కొంతమంది సన్నిధిలోనైనా, లేదా వాహనం నడుపుతున్నా అలా అవ్వవచ్చు. ఆ సమయాల్లో ఎంత ప్రయత్నించినా అచేతన మనస్సును స్వాధీనం చేసికోలేరు. పిడికిలి బిగించినా, తల తిన్నగా పెట్టినా అది పనిచేయదు. ఇవన్నీ భౌతికమైన చర్యలు. కాని అది నిజంగా అభౌతికము. అందుకే ఒక మంత్ర౦ సహాయం కావాలి. ఒక పవిత్రమైన -- సెయింట్ బెర్నార్డ్ చెప్పినట్లు "శక్తినిచ్చే పదం"--నామం తలుచుకొంటూ దానితో పోరు చేయాలి.
తామసుని మంత్రం: "నాకు లెక్క లేదు. నేను తక్కినవారికి ఏమైనా పట్టించుకోనవసరంలేదు. నాకేమైనా కూడా ఫరవాలేదు." ఈ రోజుల్లో చాలా మందికి ఇటువంటి భావన ఉంది. గీత దృష్టిలో అట్టివారు జీవచ్చవాలు. వారు రాతితో చేయబడిన విగ్రహాల్లా౦టివారు. ఒక రాయి అనుకొంటుంది: "నేను ఇక్కడనుంచి కదలను. ఇక్కడ మంటలొచ్చినా పరిగెత్తను. మంటలు రానీ. నన్ను మండించినా సరే కదలను." ఈ విధంగా పట్టించకోపోవడం తామసుని సహజ నైజం. ఎంతమంది పొంచి యున్న ప్రమాదాలను పట్టించుకుంటున్నారు? యుద్ధాలు, హింస, ఆకలితో అలమటించు పేదలు, తునాతునకలైన కుటుంబ వ్యవస్థ, విషంగా మారిన పర్యావరణం, వీటి గురించి ఎవరు స్పందిస్తున్నారు? ఇవి మనలనందరినీ మంటల్లాగా ఆవరిస్తాయి. దినపత్రికలు వీటి గురించి చెప్పినా ఎవరూ పట్టించు కోవటంలేదు.
మానసిక, సాంఘిక శాస్త్రజ్ఞులు ఎవరిలోనూ ఈ సమస్యలను నిర్మూలంచడానికి ప్రేరేపణ లేదని చెప్తున్నారు. ప్రేరణ లేకపోవడం తామసిక లక్షణం. తామసికుడు భయానికి స్పందిస్తాడు. ఒకే గాడిలో ఉండడం వాని స్వభావం. చాలా మందికి ఒకే గాడిలో ఉండడం ఇష్టం. ఎందుకంటే దాని వల్ల జీవితం ప్రపంచాన్ని చూడకుండానే గడిపేయవచ్చు. ఒకరి గాడి మరొకరి గాడిని తగలదు. స్త్రీ, పురుషులు ఒకే ఇంట్లో కలసి వుండవచ్చు, భోజన సమయంలో ఉదయం, సాయంత్రం ఒకరినొకరు పలకరించకోవచ్చు, పిల్లల్ని పెంచవచ్చు, చివరకు ఒకరి మొహాలొకరు చూస్కోకుండా విడిపోవచ్చు. అతను వాని గాడిలో ఉన్నాడు. ఆమె తన గాడిలో ఉంది.
మార్పు అంటే తామసికునికి భయం. మనం జీవితంలో ఒక సమస్యను ఎదుర్కోవలసి వచ్చినా, లేదా మార్పు వచ్చినా తమస్ తో స్పందిస్తాం. జీవతంలో మార్పు సహజం. బుద్ధుడు చెప్పినట్టు ఏదీ మార్పు చెందకుండా ఉండదు. మనం దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. కాని తామసికుడు మార్పు గురించి ఇలా ఆలోచిస్తాడు: "నాలో మార్పు రాదు. నేను దృఢమైనవాడిని. నేను వంగలేను."
మొన్నొక జపనీస్ మిత్రుడు ఒక బొమ్మను చూపించేడు. దాన్ని నొక్కితే కుంచించుకు పోతుంది. దాని మీదనుంచి చెయ్యి తీసేస్తే మామూలుగా ఉంటుంది. మనం అలాగే ఉండాలి. పరిస్థితులు విషమించి నపుడు మనం లొంగాలి. పరిస్థితులు బాగయినపుడు తిరిగి మన పూర్వ స్థితికి రావాలి. ఇంకా ధృడంగా ఉండాలి.
తామసికుడు పరిస్థితులు విషమించినపుడు క్రింద పడిపోతాడు. అదే వాని సహజ స్థితి. "నేను చేయలేను" అన్నది వానికి ఊతపదం.
నా ధ్యానం తరగతిలో అటువంటివాళ్లను చూసేను. వారు మొదట్లో చాలా ఉత్సాహంతో ఉంటారు. క్రొత్త తలదిండు, ధ్యానానికై కొనుక్కున్న క్రొత్త బట్టలు, మొదలైన వాటితో వస్తారు. వాళ్ళు కళ్ళు మూసుకొంటే వారి మనస్సు కోతిలాగ పరివర్తిస్తుంది.
ఒక ఆంగ్ల సాహిత్యవేత్త ధ్యానం గురించి ఇలా అన్నారు: "ధ్యానంలో కూర్చున్న తరువాత, నేను చదివిన పుస్తకాలన్నీ గుర్తుకొచ్చేయి. నేను వ్రాయవలసిన పుస్తకంలోని పాత్రల గురించి ఆలోచనలు వచ్చేయి. అంతలోనే అరగంటసేపు చేయవలసిన ధ్యానం ముగిసిందని కళ్ళు తెరిచేను. వాచీ చూసుకొంటే ఐదు నిమిషాలు గడిచాయి."
ఇటువంటి అలజడి సాధారణంగా మన మనస్సును స్వాధీనంలో ఉంచడానికి ప్రయత్నిస్తే ఉంటుంది. తామసికునికి అది భరించ రానిది. అతడు ధ్యానంలో వాడే తలదిండును షాపుకు తీసికెళ్ళి "దీన్ని అమ్మిపెట్టు. ఆ డబ్బంతా నువ్వే వుంచుకో. నేను ధ్యానాన్ని వదిలేస్తున్నాను."
తమస్ అంటే చీకటి. తామసికుడు చూడలేడు. వాడు జీవితమంతా చీకటిలో బ్రతుకుతూ అంధుడిలా ప్రవర్తిస్తాడు. యుద్ధం వస్తే వానికి తెలీదు. పీల్చే గాలి కాలుష్యంతో నిండివున్నా వానికి పట్టదు. వాని నివాస స్థలంలో హింసాకాండ చెలరేగుతుంటే పట్టించుకోడు. నేనెప్పుడో చదివేను ఒక కుటుంబంలోని సభ్యులంతా నిద్రలో నడుస్తారని. మధ్య రాత్రిలో లేచి వారు కలసి తింటారు. మరుసటి ఉదయం వాళ్ళలో వాళ్ళే ప్రశ్నించుకొంటారు "ఎవళ్లు ఇక్కడ తిన్నారు?" ఇది మనం చేసే క్రియలకు భిన్నంగా లేదు. మనకున్న చేతనంతో పోలిక చేస్తే, మనలో చాలామంది జీవితం అర్థరాత్రి తినడంలాగా గడుపుతారు.
కొన్ని సంవత్సారల క్రితం నా మేనకోడలిని ఐస్ షో కి తీసికెళ్ళేను. అక్కడ ఒక మర మనిషి ఐస్ మీద స్కేటింగ్ చేసింది. దాని చుట్టూ ఒక ఆడది, మెరుపులు గొలిపే బట్టలు వేసుకొని, మానిటర్ తో మర మనిషిని కదిలిస్తున్నది. "రోబోట్ కుడివైపు తిరుగు, పరిగెత్తు, నోరు తెరచు" అన్నట్టు ఆ మానిటర్ తో దానిని నడిపింది. ఇదే తామసికునికి జరిగేది. బుద్ధుడు చెప్పినట్లు ఇది జీవించడం కాదు. నిద్రపోవడం. స్వార్థపూరిత కోర్కెలతో అటునిటు లాగబడితే దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.
బద్దకం తామసికుని లక్షణం. వానికి ఆలోచించడం, అనుభవించడం, కదలడం, వ్యాయామం చేయడం, టివి చానెల్ ను మార్చడం అంటే బద్దకం. మనకు చెడుని ఎదిరించి, ప్రపంచానికి ఏదైనా మంచి చేయడం కష్టమే. తామసికులు వలం అవతారు. వాని మనస్సు బరువుగా ఉంటుంది కాబట్టి శరీరం దానితో సమానంగా ఉంటుంది.
బెర్ క్లీ లో ఒక గోడమీద ఇలా వ్రాసి ఉంది: "నాకు కావలసినది మద్యం, గంజా". ఇది తామసికునికి బాగా వర్తిస్తుంది.
తామస గుణాన్ని వదిలించుకోవాలంటే మొదటి అడుగు భౌతికం. తామసికుడు జడత్వంతో నిరుత్సాహంగా, నిర్లక్ష్యంగా ఉంటాడు. వాడిని ఎవరో ఇలా శాసించునట్టు తలుస్తాడు: "నాకు కావాలసినట్టు కూర్చోకూడదని ఎందుకు చెప్పారు?" తామసికుడు భౌతికంగా ఆరోగ్యంతో లేనని తలుస్తాడు. వొళ్లంతా నొప్పులతో ఉన్నట్టు, ఎవరూ పట్టించుకోనట్టు వాని అనిపిస్తుంది. కాని తమస్ ఉన్నప్పుడు విశ్రాంతి తీసికోకూడదు. కావలసింది విశ్రాంతిని తగ్గించుకోవడం. పైపై కొన్ని ఆనవాలు ఉంటాయి : తలనొప్పి, నరాల బలహీనత, కాళ్ళలో రక్త ప్రసారం లేనట్టు, తల బిరుసుగా ఉన్నట్టు. మంచంమీద పడుకొంటే భౌతిక పరిస్థితి విషమిస్తుంది. లేచి నడవాలి. మంత్రం జపిస్తూ వేగంగా నడవాలి. పది నిమిషాలు అలా నడుస్తే వొళ్ళు స్వాధీనంలోకి వస్తుంది. అక్కడితో ఆపకూడదు. అలా నడుస్తూ ఉ౦డాలి.
మీరు ఒక రిపోర్ట్ రాద్దా మనుకొన్నారు. తామసం ఆవహించింది అనుకోండి. కొన్ని పెన్సిళ్ళను ముల్లు చెక్కి తయారుచేసుకొన్నారు. దానితోనే కొన్ని పుస్తకాలు బెంచీ మీద పెట్టేరు. తెల్ల కాగితం ముందు పెట్టుకున్నారు. వ్రాయడానికై ఆలోచన చేస్తున్నారు. ఇది చాలాకాలంగా జాప్యం చేయబడిన రిపోర్ట్ . అది రేపే పై వాడికి ఇవ్వాలి. ఏదో ఒకటి వ్రాయాలి.
మీకు రిపోర్ట్ దేని మీద వ్రాయాలో తెలీదు. బహుశా మీరు ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివి, కాచి వడబోసి, రిపోర్ట్ తయారు చేసుకోవాలనుకొంటున్నారు. ఇక్కడ పరిపక్వం అంటే జాప్యం. పరిపక్వతను సాధించడానికి ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ అది క్రియ చేయకముందే ఉండాలంటే దానికి చాలా కాలం వేచి వుండాలి.
నా విద్యార్థులకు స్వీయానుభవం ఇలా చెప్పేను: మీకున్న జ్ఞానంతో వ్రాయడం మొదలు పెట్టండి. ఏదో క్రొత్త గ్రంధాన్ని ఆవిష్కరిస్తున్నట్టు కాదు. మీ వ్రాసే శైలిని గురించి బాధ పడకండి. ఎవరూ చదవకపోయినా కొంత మంది సరైన పదం గురించి తర్జనబర్జన పడతారు. ఒక్కొక్కపుడు దానివలన కొన్ని గంటలు కాగితాన్ని చూస్తూ గడుపుతారు. వ్రాసే విధానం గూర్చి బాధ పడకండి. మీకు కావలసినది వ్రాయడం. అది అయిన తరువాత దానికి తగిన రీతిలో మెరుగులు దిద్దవచ్చు.
మొదటి మెట్టు భౌతికమైన క్రియ. మీ కలాన్ని ముందుకు నడపండి. మీరేమి వ్రాస్తున్నానని అని బాధ పడకండి. క్రమంగా తమస్ తగ్గి దాని స్థానంలో రజస్ వస్తుంది. ఒక ఆలోచన వస్తుంది. అటు తరువాత దానిని ఖండించే ఉంకో ఆలోచన వస్తుంది. వాటిని వ్రాసి, ఆ రెండిటికి ఏమైనా సంబంధం ఉందో లేదో చూసుకోండి. దాన్ని మరల, మరల, పరీక్షించండి. ఇంతలోనే ఒక గంట గడిచిపోతుంది. మీ మిత్రుడు కాఫీ త్రాగడానికి రమ్మంటాడు. మీ సమాధానం: "నేను తరువాత వస్తాను. బుర్రలో జ్ఞాపకమున్నప్పుడే ఈ పని చేయాలి."
భౌతిక క్రియలతో, కలంతో కాగితం మీద వ్రాస్తూ, తమస్ ని వెళ్ళగొట్టి, ప్రాణ శక్తిని పొందుతారు. ఇప్పుడు మీరు దృష్టిని కేంద్రీకరించగలరు. మీ సావధానత పూర్తిగా మీరు చేస్తున్న క్రియపై పెట్టండి. తమస్ దాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే అయితే మీ మనస్సు వికలమవుతుంది. ఇది మనకు చేస్తున్న పని వృధా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ క్రియని ఆపేస్తే తీరని నష్టం కలుతుంది. సమస్యను జటిలం చేస్తుంది. ఎప్పుడైతే ఒక క్రియ వృధా అనిపిస్తుందో, దానిమీద దృష్టి కేంద్రీకరించాలి. మనస్సు వికలంగా ఉంటే ఇంకా తీక్షణంగా ఉండాలి. మీ మనస్సును ధ్యానంలో లాగ వెనక్కు తీసికో౦డి. కొంత కాలం తరువాత అది సహజమై, కావలసిన ఫలితం ఇస్తుంది.
ధ్యానం వల్ల మనస్సును మనకు కావలసినట్టుగా మార్పు చేయవచ్చు. నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది. నేను దాన్ని జేబులో పెట్టుకుంటాను. దాన్ని నాకు కావలసిన చోట వాడుతాను. అది దానికై సర్వసిద్ధంగా ఉండాలి. చాలామందికి క్రియాశీలత సిద్ధంగా ఉండదు. ఎలాగంటే టార్చ్ లైట్ జేబులో ఉన్నంత కాలం అది నిరుపయోగం. దాని ఉపయోగం తెలుసుకోవాలంటే వాడి చూడాలి .
మన మనస్సును నియంత్రించుకొంటే మనం చేయవలసిన క్రియ మీద పూర్తి ఏకాగ్రత ఉంటుంది. ఇది అమోఘం. ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు సాధించనిదంటూ ఏమీ లేదు. వాళ్ళు ఇలా తమను తాము ప్రశ్నించుకోరు: "నాకిది ఇష్టమా? నాకు దీని వల్ల ఒరిగేదేమిటి?" కాలుష్యం లేదా హింస ని లేకుండా చేయడానికి పూనుకొన్నవారు తమని తాము మరచి, వేరొకరికై పాటుపడతారు. ఇటువంటి క్రియలవల్ల ఒత్తిడి, ఉద్రిక్తత, నిరాశ దూరమౌతాయి. 137
Saturday, February 26, 2022
Eknath Gita Chapter 14 Sloka 5
14.5
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం
తన్ని బధ్నాతి కౌన్తేయ కర్మసంగేన దేహినమ్
కౌన్తేయా! రజోగుణము కామరూపమైనది , అది ఆశను, సంగమును కలుగజేయును. కర్మలయందు ఆసక్తిని కల్పించి జీవుని బంధించును
రజస్ మనను బంధించ కారాగారంలో పడేస్తుంది. ఎందుకంటే అది స్వార్థపూరితమైనది: నేను, నాది, మొదలైనవి. ఇది రజస్ కున్న పెద్ద లోపం. రాజసికుడు తామసికుడు కన్న ఫరవాలేదు: వానికి మోహం, అపరిమిత శక్తి ఉన్నా, కొంత సున్నితత్వము కూడా ఉంది. "నేను సున్నిత స్వభావము కలవాడిని. సున్నితులలో మొదటి వాడిని. నాకు ఏమి కావాలో నాకు తెలుసు" అని అంటాడు. వానికి ఏమి కావాలో వాడికి నిజంగా తెలుసు. దానిని ఏదో విధంగా పొందుతాడు. దాని వల్ల ఎవరికైనా హాని జరిగితే పట్టించుకోడు. అది పర్యావరణ విషయమైతే "మనం దానితో సద్దుకుపోవాలి" అంటాడు. అది మారణాయుధాల గురించి అయితే "పురోగతికై అవసరము. " అంటాడు.
స్మాగ్ విషయం చూద్దాం. స్మాగ్ నిరోధక యంత్రాలు నిజంగా స్మాగ్ ని నిరోధించటంలేదు. స్మాగ్ కి కారణం యంత్రాలు, ఫర్నెస్ లు, ఇంజిన్ లు కావు. మానవులను శాస్త్రజ్ఞులు హోమో సేపియన్స్ అంటారు. అనగా ఆలోచించే శక్తి గలవారు. ఇది అనవసరమైన బిరుదు. బెర్గ్ సన్ అన్నారు మానవులకు అచ్చొ చ్చిన పేరు హోమో ఫేబర్ . అనగా ఎవరైతే వస్తువులను తయారు చేస్తారో. రాజసికుడు అంటాడు "నేను వస్తువులను తయారు చేస్తాను. అది కాక నేను ఏమి చేయగలను? అన్నిచోట్లా నాకు వీలైనన్ని వస్తువులను తయారు చేసి నింపుతాను. పిదప, వాటిని మానవాళి వాంఛిస్తుంది. వారికి వాటితో ఏమి చేయాలో తెలియదు కాని, అవి కావాలనే ధృడమైన సంకల్పం కలుగుతుంది". వాడు రహదారులు, పట్టణాలు, వాహనాలు, పళ్ళు తోముకొనే బ్రష్ లు, విమానాలు, ఆయుధాలు, ఒకటేమిటి అన్నీ చేయాలని ఆకాంక్షిస్తాడు.
వస్తువులు చేయడంలో తృప్తి ఉంది. దానిని నేను కాదనను. ఆ సంతుష్టే మనని బంధిస్తుంది. రాజసికుడు ఏమైనా తయారు చేస్తూంటే దానిలో లీనమైపోతాడు. అతడు వస్తువు లోపలకి దూరినట్టు ఉండి, తాళం వేసుకొని నట్టు ఉండి, బయటనుంచి ఎవరు కేకేసినా విననట్టు ఉంటాడు. ఈ విషయంలో తామసికుడు లాగ అంధుడు, చెవిటివాడు.
ఏదైనా బజారులో లేదా షాపులలో చూడండి, వాటిలో ప్రదర్శించబడిన వస్తువులలో మనకి నిజంగా ఎన్ని కావాలి? వాటిలో ఎన్ని మనకు నిజంగా ఉపయోగపడతాయి? ఇది హోమో ఫేబర్ లు చేసిన సహాయం. మనం నేతి, నేతి ప్రక్రియతో అక్కరలేని వస్తువులు తీసివేస్తే మిగిలేవి ఒకే ఒక షాపులో నిండినన్ని.
అనుభవించే మనకి ఈ ప్రక్రియతో అవినాభావ సంబంధం ఉంది. కొనేవాళ్ళము మనము. మనం వాహనాలకై, బట్టలకై, పరికరాలకై అక్కరలేని కొనుగోళ్లు చేస్తూవుంటే, కాలుష్యాన్ని పెంచినవారమౌతాము. నేను నిరాడంబరంగా ఉండడానికి పేదరికం మంచిదని అనటంలేదు. నిరాడంబర జీవితం ఆనందం, తృప్తి నిచ్చేది. వస్తుసముదాయముతో కూడిన జీవితం అవసరంలేదు. అవి కళలకు సంబంధించినవి అయినా సరే.
నేను, నా భార్య వోక్ లాండ్ లో నివసిస్తూ ఉండగా ఒకరోజు ఒక పెద్ద లారీ మా నివాస స్థలానికి వచ్చింది. "వాళ్ళు న్యూ జర్సీ నుంచి వస్తున్నారు" అని నా ఇంటి ప్రక్క వాడు చెప్పేడు. ప్రపంచంలో ఎక్కడికైనా వస్తువులను తీసికివెళతాం అని ఆ లారీ మీద వ్రాసి ఉంది. నేను కుతూహలంగా ఏ రకమైన కళలకు సంబంధించిన వస్తువుల మూడు వేల మైళ్ళు మోసుకొని తెచ్చేరో చూద్దామని అనుకున్నాను.
ఆ లారీ తలుపులు తెరిస్తే ఇవి కనబడ్డాయి: కుర్చీలు, దీపాలు, మంచాలు, కోట్లు తగిలించే హ్యాంగరులు మొదలగు వస్తువులు. అవి అమెరికాలో ఎక్కడైనా దొరుకుతాయి. వాటిని వాళ్ళు న్యూ జర్సీ లోనే వదిలి, ఓక్ లాండ్ లో కొనుక్కొన వచ్చు. ఏమీ తేడా తెలీదు. మానవులు తమ వస్తువులతో బంధింపబడతారు. వాటిని ఎక్కడికి వెళ్ళినా మోసుకొను పోతారు. గతంలో ముడిపడిన వాటి భారాన్ని లెక్క చేయరు.
నేను చెప్పినంత మాత్రాన మీ ఇంట్లో వస్తువులను దాన ధర్మాలు చేయకండి. నేను చెప్పేది వస్తువులతో అసంగత్వంగా ఉండమని. మీవద్ద ఎంతో పురాతనమైన, ఖరీదైన కళా వస్తువులు ఉండచ్చు. వాటిని చూసి ఆనందించండి కాని వాటికి అతుక్కుపోవద్దు. వాటితో తాదాత్మ్యం చెందితే వాటిని నిజంగా అనుభవించిన వారు అవ్వరు.
మనం స్వార్థంతో ఒకరితో అనుబంధం పెంచుకోవచ్చు. నిస్వార్థ అనుభందం ప్రేమ. మీరు మీగురుంచి ఆలోచించకుండా, అవతల వాళ్ళ సుఖానికై బ్రతుకుతారు. కానీ స్వార్థపూరిత బంధంలో ప్రేమ లేదు. ప్రేమ నిస్వార్థమైతే అనుబంధం గట్టి పడుతుంది; అదే స్వార్థపూరితమైతే అనుబంధం తెగుతుంది. వస్తువులలాగే, స్వార్థంతో సంబంధం పెట్టుకుంటే, మీరు దానితో బంధింపబడతారు. మీవారి అక్కరలు తెలియదు. నిజానికి మీకు కావలసినది ఏమిటో కూడా తెలీదు. నిజంగా మనం ఒకరిని ప్రేమించామంటే వాళ్ళని వస్తువులులా -- అంటే "ఇది నాది. ఎవ్వరూ ముట్టుకోకూడదు" -- చూడకూడదు.
మనందరికీ సహజంగా ఒక వస్తువును పొందుదాము, ఒక వస్తువును ఇతరులకు ఇద్దాము అని ఉంటుంది. మనం చిన్నప్పడినుంచీ, దేవుడి దయతో, ఒక వస్తువుని ఇతరులనుండి పొందితే ఎవ్వరికీ లాభం లేదని నేర్చుకోవచ్చు. మొదట్లో అంతా బాగా ఉన్నట్టే ఉంటుంది. అది స్వార్థ బుద్ధికి నిదర్శనం. క్రమంగా ఆకాశం మారుతుంది. ఒక చిన్న మేఘం -- మన చెయ్యి అంత పెద్దది -- అగుపిస్తుంది. "బ్రెడ్ ని కాల్చాలా, లేక పచ్చిగా తినాలా ? బ్రెడ్ గోధుమతో చేయబడినదా లేదా వేరొక పదార్థంతోనా?" అని తర్జనబర్జన పడతాం. మనతో మనకు కావలసిన వారు ఏకీభవించరు. ఆ మేఘం కాఫీ వైపు వెళుతుంది. రాజసికుడు చిక్కని కాఫీ అవసరమున్నా లేకున్నా తాగాలనుకొంటాడు. వాని భార్య కెఫీన్ లేని కాఫీ తాగాలనుకొంటుంది. వాని చెయ్యి పరిమాణమున్న మేఘం, వాని తలంత పెద్దదయింది.
రాజసికుడు ఇంటికి మధ్యాహ్న భోజనానికి వస్తాడు. వాని భార్య సాదరంగా ఆహ్వానించి "మీ గురించి వేచి ఉన్నాను" అంటుంది.
రాజసికుడు "నా వాచీలో ఐదే అయింది. క్రిందటి వారం డైరీ క్వీన్ వద్ద నీ గురించి ఎంతసేపు వేచి ఉన్నానో గుర్తుందా?" అని అడుగుతాడు.
"గతాన్ని తవ్వకండి. ఇప్పటి కాలంలో ఉండండి. అది డైరీ క్వీన్ కాదు. "
స్వార్థ పూరిత అనుబంధం ఇలాగే ఉంటుంది. అది ఒకానొక రోజు తిరగబడుతుంది. కొన్నాళ్ళకు మనం నిజమైన ప్రేమ అనేది అత్యంత బాధను కలిగించేదిలా అవుతుంది: మీరు ఎవరినైతే గతంలో గాఢంగా ప్రేమించారో, వాళ్ళు ఇప్పుడు ప్రకోపింప జేసేవారవుతారు. క్లియోపాత్ర రాణిని తలపించిన ఆమె ముక్కు ఇప్పుడు చూడడానికే అసహ్యం అనిపిస్తుంది. ఆయనగురించి ఒకప్పుడు కలలు గనేవారు. కలలు పండకపోతే ఆయనను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఈ రోజుల్లో రాజసికుల జీవితం ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఇలాగ క్రిందకి పడనక్కరలేదు. ఒకవేళ పడినా వాళ్ళ సంబంధాలను సత్త్వంతో తిరిగి పెంపొందించుకోవచ్చు.
ఒకరోజు నేను పాచి (Lichens) గురించి చదువుతున్నాను. దీన్నిబట్టి మీరు జ్ఞానార్జనకి నేను ఎంత దూరం వెళతానో అర్థం చేసుకోగలరు. నేను జీవితంలో మార్చలేని సిద్ధాంతాలను పాచిని ఉదాహరణగా తీసికొని చెప్తాను. నా మనస్సు ఒక్కొక్కప్పుడు ఇలా చెప్తుంది: "నువ్వు రచయితవు. నువ్వు చిన్న చిన్న జీవుల గురించి తెలుసుకోవడంకంటే ఒక మంచి నాటకం గూర్చిన పుస్తకం చదవరాదూ ? " కానీ నాకు పాచి వ్రాయడానికి మంచి స్పూర్తినిచ్చింది. అవి ఏ మొక్కా పెరగలేని వాతావరణంలో బ్రతుకుతాయి. శాస్త్రజ్ఞులు దానికి కారణమేమిటని పరిశోధన చేస్తున్నారు. పాచి రెండు రకాల జీవుల సంయోగం. ఒకటి ఆల్గే , రెండవది ఫన్గస్. అవి పరస్పర౦ సహాయం చేసికుంటూ బ్రతుకుతాయి. వాటి జీర్ణశక్తిలో, స్వభావములో, ప్రకృతిలో చాలా తేడాలున్నాయి. ఒకటి పదార్థాన్ని తయారు చేస్తే, రెండవది నీరు సమకూరుస్తుంది. రెండూ కలసి మెలసి ఎటువంటి వాతావరణంలోనైనా ఒత్తిడి పడక బ్రతుకుతాయి.
ఇది ఒక మగవాడు, ఆడది కూడా చేయగలరు. వాళ్ళు ఇద్దరూ శివ-పార్వతులులా ఒకే స్వరూపం. వాళ్ళు పరస్పర అవగాహన పెంచుకొని, ఒకరికొకరు సహాయం చేసికొ౦టే ఎటువంటి శక్తీ వారిని విడదీయలేదు. అటువంటి స్థితిలో వాళ్ళ మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది.
ఎక్కడైతే ఆడ మగ పోటీ పడతారో అక్కడ ప్రేమ ఉండదు. కృత్రిమ ప్రేమ నటన కూడా పనిచేయదు. ఎక్కడైతే స్పర్థ ఉంటుందో అక్కడ మరణమొక్కటే ఉండగలదు. మన సమాజములో శోచనీయాంశం ఏమిటంటే ప్రేమ పేరుతో ఆడ మగ మధ్య ప్రతి రంగంలోనూ స్పర్థలు కలిగించడం. నేను రోజూ వాటిగురించి పుస్తకాలలో, సినిమాలలో , టివిలో, విద్యాలయాలలో, ఇళ్ళలో చూస్తున్నాను. మనమందరము మన బుద్ధిని ఉపయోగించుకొని ఆడామగా పరస్పర సహాయంతో కలసి మెలసి ఉండాలని తలచి వాళ్ళ మధ్య స్పర్థలు పెట్టకుండుటకు ప్రయత్నించాలి. 126